ఖాతాదారుల అనుమతి లేకుండానే సొమ్ము మాయం 

Mar 28,2024 08:47 #Cyber Crimes, #fraud
  • ప్రధాని బీమా పథకాల పేరిట బ్యాంకుల మాయాజాలం 
  • పలు చోట్ల అక్రమాలు…అవకతవకలు

న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రారంభించిన బీమా పథకాల పేరిట మీ బ్యాంక్‌ ఖాతాల నుండి మీ అనుమతి లేకుండానే సొమ్ము మాయం అవుతోందా? దేశంలోని అనేక మంది బ్యాంక్‌ ఖాతాదారుల నుండి ఇప్పుడు ఈ రకమైన ఫిర్యాదులు వస్తున్నాయి. మోడీ ప్రభుత్వ బీమా పథకాల పేరు చెప్పి తమ అనుమతి పొందకుండానే ఖాతాల నుండి సొమ్మును తీసేసుకుంటున్నారని వారు మండిపడుతున్నారు. దీంతో కొన్ని బ్యాంకులు వినియోగదారుల అనుమతి పొందిన తర్వాతే వారి ఖాతాల నుండి సొమ్మును డెబిట్‌ చేస్తున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన (పిఎంజెజెబివై), ప్రమాద బీమా పథకం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పిఎంఎస్‌బివై) పథకాలను ప్రవేశపెట్టింది. అయితే బ్యాంకులు తమ ఖాతాదారుల నుండి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఈ పథకాలకు వారి పేర్లను నమోదు చేశాయి. అప్పటి నుండి ప్రీమియం కోసం ఏటా కొంత మొత్తాన్ని వారి ఖాతాల నుండి తీసుకుంటున్నాయి. అటల్‌ పెన్షన్‌ యోజన (ఎపివై) పేరిట కేంద్రం తీసుకొచ్చిన మరో బీమా పథకంలోనూ ఇవే సమస్యలు ఎదురయ్యాయి. పేదలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రధాని మోడీ 2015 మేలో ఈ సంక్షేమ పథకాలను ప్రారంభించారు. పిఎంజెజెబివై పథకానికి ఏటా రూ.436, పిఎంఎస్‌బివైకి ఏటా రూ.20 ప్రీమియం వసూలు చేస్తున్నారు. ఈ మొత్తం వినియోగదారుల బ్యాంక్‌ ఖాతాల నుండి దానంతట అదే డెబిట్‌ అవుతోంది. పిఎంజెజెబివై పథకంలో పాలసీదారులు ఏ కారణం చేతనైనా చనిపోతే అతని నామినీకి రెండు లక్షల రూపాయలు అందజేస్తారు. పిఎంఎస్‌బివై కింద పాలసీదారుడు ప్రమాదంలో చనిపోతే రెండు లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడితే లక్ష రూపాయలు ఇస్తారు. ఎపివై పథకం కింద 60 సంవత్సరాలు దాటిన పాలసీదారుకు నెలవారీగా ఐదు వేల రూపాయల పెన్షన్‌ అందిస్తారు. అయితే పాలసీదారులు లేదా ఖాతాదారుల అంగీకారం లేకుండానే బ్యాంక్‌ సిబ్బంది ఆయా బీమా పథకాలను క్రియాశీలకం చేసేందుకు బోగస్‌ నామినీల పేర్లను చేరుస్తున్నారని, తప్పుడు సమాచారాన్ని నమోదు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ ఒత్తిడిని తట్టుకునేందుకే బ్యాంకులు ఇలాంటి తప్పుడు పద్ధతులు అనుసరిస్తున్నాయని తెలుస్తోంది. ‘బీమా పథకాలలో తమ పేర్లు చేర్చినట్లు, ఖాతాల నుండి ప్రీమియం సొమ్ము డెబిట్‌ అవుతున్నట్లు చాలా మంది బ్యాంక్‌ ఖాతాదారులకు తెలియడం లేదు. దీనివల్ల పాలసీదారుడు చనిపోతే వారి కుటుంబసభ్యులు ఆర్థిక ప్రయోజనం పొందే అవకాశం లేకుండా పోతోంది’ అని ఆర్టికల్‌-14.కామ్‌ తెలిపింది. ఈ తరహా అక్రమాలు సంస్థాగతమై పోయాయి. ప్రాంతీయ, జోనల్‌, కేంద్ర కార్యాలయాలలో ఇవి సర్వసాధారణమయ్యాయి. అంతేకాదు…అవకతవకలకు పాల్పడాలంటూ అవి బ్రాంచ్‌ కార్యాలయాలకు హితబోధ కూడా చేస్తున్నాయి. ఖాతాదారులను ఒకేసారి పెద్ద సంఖ్యలో బీమా పథకాల్లో చేర్చడానికి బ్యాంకులు అడ్డదారులు తొక్కుతున్నాయి. ఇందుకోసం ‘బల్క్‌ యాక్టివేషన్‌’ అనే విధానాన్ని అమలు చేస్తున్నాయి. దీనికింద బ్యాంకులు ఒకేసారి వినియోగదారుల వివరాలను బీమా యాక్టివేషన్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయవచ్చు. వాటిని ఆమోదించవచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి బ్యాంకులు ఇలాంటి అక్రమ పద్ధతులను అనుసరిస్తున్నాయి. దేశంలోని అతి పెద్ద బ్యాంక్‌ అయిన ఎస్‌బీఐ, రెండో అతి పెద్ద బ్యాంక్‌ అయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కూడా లక్ష్యాలను చేరుకోవడానికి బల్క్‌ యాక్టివేషన్‌ విధానాన్ని అమలు చేస్తున్నాయి.

➡️