సమానంగా చూడాలి!

Mar 3,2024 10:42 #Gender, #Human Rights, #Women's Day
  • ఆడపిల్ల లేని ఇల్లు చంద్రుడు లేని ఆకాశం ఒక్కటే. అందుకే ప్రతి ఇంటికీ ఓ వెన్నెలలా ఓ కూతురు అవసరం. ఈ రోజు ఆడపిల్లను వద్దనుకుంటే రేపటి సమాజం అమ్మలేని అనాధ అవ్వటం ఖాయం. తరంతరం నిరంతరంగా జరుగుతున్న సామాజిక జీవన ప్రక్రియలో అమ్మాయిలు లేని జీవితం.. జీవనం.. సమాజం.. ఊహించలేం. ఈ క్రమంలో సమాజంలో మహిళల పట్ల వివక్ష, దృక్పథాన్ని తెలిపారు అమ్మాయిలు.

‘ఇప్పుడున్న పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్య గౌరవం కొరవడుతోంది. బహుశా పనుల ఒత్తిడి కారణమై ఉండవచ్చు. ఇద్దరూ సంయమనం పాటిస్తే విభేదాలు రావు. విడాకుల వరకూ వెళ్ళాల్సిన అవసరం రాదు. ప్రేమైనా సహజీవనమైనా ఒక్కసారి ఇష్టపడిన తర్వాత ఒకర్నొకరు గౌరవించుకోవాలి’ అని టీచరు రాగ రజిత అన్నారు.

  • పాలకుల వివక్ష

‘ పాలకులే స్త్రీలపై వివక్ష చూపుతున్నప్పుడు సామాన్య ప్రజలకు ఉండకేం చేస్తుంది? రెజ్లర్స్‌, మణిపూర్‌ ఘటనలపై కానీ, మరెందరో స్త్రీలపై జరిగే అత్యాచారాల విషయంలో.. ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుంటే ఎవరిని ఆశ్రయించాలి? అందుకే ఎన్నుకునేప్పుడే మంచి పాలనా దక్షత, నిజాయితీ ఉన్నవారిని ఎన్నుకుంటే ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోగలం’ అంటున్నారు బిఇడి చదువుతున్న ప్రసన్న.

  • పెళ్లి విషయంలో స్వేచ్ఛ..

‘పెళ్ళి విషయంలో మా స్వేచ్ఛ మాకివ్వాలి. చదువు పూర్తయ్యి, మా కాళ్ళ మీద మేం నిలబడేవరకూ పెళ్ళిచేసుకోము. కానీ ఇప్పటికీ మాకెన్నో ఆంక్షలు. బయటికి వెళ్ళకూడదు. వెళ్ళినా గట్టిగా నవ్వకూడదు.. మాట్లాడకూడదు.. ఇలాంటివి చెబుతూనే ఉంటారు. అదే అబ్బాయిలైతే ఎప్పుడైనా వెళ్లొచ్చు.. రావచ్చు. వాళ్ళనేమీ అడగరు.. చెప్పరు. పెళ్ళి వాళ్ళకెప్పుడు ఇష్టమైతే అప్పుడు చేసుకోవచ్చు.. ఇలాంటి పెంపకంలో ఆడపిల్లలు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేరు. ఎంత చదివినా నలుగురితో మాట్లాడలేరు. అందరిలో ఫ్రీగా ఉండలేరు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగలేరు’ అని అమెరికాలో ఎమ్‌ఎస్‌ చేస్తున్న సంధ్య, డిగ్రీ ఫైనలియర్‌ చదువుతున్న భార్గవి అంటున్నారు.

  • ఇంటి పనికే పరిమితం..

‘ఆడవాళ్లు ఇంట్లో పని చేయడానికే. పిల్లలు కనడానికే అని భావించే సమాజంలో బతుకుతున్నాం. ఈ తీరు మారాలంటే ఆడవాళ్లను అన్ని రంగాల్లో, అన్నివిధాలా ప్రోత్సహించాలి’ అని నాగార్జున యూనివర్శిటీ విద్యార్థులు స్ఫూర్తిమయి, మల్లీశ్వరి అంటున్నారు. ‘చాలామంది ఆడపిల్లలు చదువుకున్నా, పిల్లలు పుట్టగానే పెంపకం బాధ్యత తల్లులే నిర్వర్తిస్తూ, ఇంట్లోనే ఉండిపోతున్నారు. ఈ క్రమంలో తమకోసం, ఉద్యోగం కోసం ఆలోచన చేయలేరు. దాంతో వెనకబడుతున్నారు. పురుషులూ పిల్లల బాధ్యత తీసుకోవాలి. అప్పుడే మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు’ అని ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ విద్యార్థి నాగ శిరీష అంటున్నారు.

  • అధికమైన పని భారంతో..

‘గత కొన్నేళ్ల నుంచి ఆడవాళ్లు ఇంట్లో పనిచేసి, పిల్లల్ని స్కూళ్లకు పంపి, బయటా పనిచేయడానికి వెళుతున్నారు. ఇది అభినందించాలి. కానీ పనిభారం పెరగడంతో శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్నారు. అందుకే ఇంటిపనుల్లో పురుషులూ భాగస్వామ్యం కావాలి. అంతేకాదు.. పని ప్రదేశాల్లో వేధింపులు, అత్యాచారాలకు గురవుతున్నారు. బయటకు చెబితే పరువు పోతుందని, రకరకాల భయాలతో అన్నీ భరిస్తున్నారు. అందుకే ప్రభుత్వాలు మహిళా చట్టాల్ని కఠినంగా అమలుచేయాలి’ అని రాజమండ్రికి చెందిన అపర్ణ అంటున్నారు.

‘నాటి నుండీ ఆడవాళ్లు అలా ఉండాలి, ఇలా ఉండాలనే చెబుతారేగానీ, అబ్బాయిలు ఆడపిల్లల పట్ల ఎలా మసలుకోవాలో చెప్పడం లేదు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే భవిష్యత్తరాలను ఉన్నతంగా తీర్చిదిద్దగలరు. అమ్మాయిలను, అబ్బాయిలతో సమానంగా వివక్ష చూపకుండా పెంచాలి’ అని నాగార్జున యూనివర్శిటీ విద్యార్థి టి.మల్లీశ్వరి, అనీసా ఖానమ్‌ అంటున్నారు.

  • మహిళా బిల్లు అమలు చేయాలి..

‘మహిళా బిల్లు తక్షణమే అమలు చేసేలా పాలకులు చర్యలు తీసుకోవాలి. సమాజం ఎంత ముందుకెళుతున్నా. ఇప్పటికీ మహిళలపై ఎన్నో ఆంక్షలు.. అవమానాలు. పాలకులు చట్టాలు సక్రమంగా అమలు చేయాలి. వీటి మీద యువతకు అవగాహన కల్పించాలి. అప్పుడే మార్పు సాధ్యం. లింగ వివక్ష రూపుమాపే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి’ అని కాకినాడకు చెందిన వై బుజ్జి అంటున్నారు.

  • తల్లిదండ్రులూ మారాలి..

‘మారుతున్న జనరేషన్‌కు తగ్గట్టుగా తల్లిదండ్రుల ఆలోచనలు మారాలి. అబ్బాయిలకు కోరుకున్న కోర్సుల్లో, గ్రూపుల్లో చేరే స్వేచ్ఛ ఉంటుంది. ఎంత దూరమైన చదువుకోవడానికి పంపిస్తారు. కానీ ఆడపిల్లల విషయంలో మాత్రం తల్లిదండ్రులే నిర్ణయాలు తీసుకుంటారు. బయటకు పంపేందుకు కూడా చాలా ఆలోచిస్తారు. ఇంట్లోనే ఉంచి, వారిని పిరికివాళ్లను చేస్తారు. ఈ తీరు మారాలి. అమ్మాయిల్ని, అబ్బాయిలతో సమానంగా పెంచాలి.. ప్రోత్సహించాలి’ అని రాజమండ్రి ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ విద్యార్థులు సుబ్రహ్మణ్యేశ్వరి, సరుగుడి పద్మ అంటున్నారు.

  • పద్మావతి
➡️