సుదీర్ఘ ఎన్నికల కోడ్‌

Mar 17,2024 08:37 #Long Election Code
  • 81 రోజులపాటు అమల్లో..
  • ఇటు అధికారుల్లో, అటు రాజకీయ పార్టీల్లో ఒత్తిడి..

ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చేసింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ శనివారం షెడ్యూల్‌ విడుదల చేయటంతోనే ఈ కోడ్‌ అమల్లోకి వచ్చేంది. ఈ నెల16 నుంచి జూన్‌ 4 వరకు దాదాపు 81 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండనుంది. 2019 ఎన్నికల షెడ్యూల్డ్‌తో పోల్చితే, ఈ సంవత్సరం దాదాపు వారం రోజులు అధికంగా కోడ్‌ అమల్లో ఉంటుంది. 2019లో మార్చి 10న ఎన్నికల షెడ్యూల్డ్‌ విడుదల చేయగా, మార్చి 18న నోటిఫికేషన్‌ ఇచ్చారు, ఆ తర్వాత మే 23న ఫలితాలు ప్రకటించారు. ఈ సంవత్సరం మార్చి 16న ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయగా..ఏప్రిల్‌ 18న రాష్ట్రంలో నోటిఫికేషన్‌ జారీచేయనున్నారు. మే13న పోలింగ్‌ నిర్వహించి, జూన్‌4న ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావటంతో రాష్ట్రంలోని అన్ని శాఖలు, ప్రభుత్వాధికారులు, సిబ్బంది అంతా ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి వచ్చేశారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం ఇకపై ఏ విషయంలోనూ రాజకీయ నాయకులు, ఇప్పటి వరకు ఎమ్మెల్యే, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు సిఫార్సులు, సూచనలకు అధికారులు పరిగణలోకి తీసుకోవల్సిన అవసరం ఉండదు. వివిధ సంక్షేమ కార్యక్రమాలకు కొత్తగా లబ్థిదారులను ఎంపిక చేయకూడదు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు తదితర కార్యక్రమాలు కూడా ప్రజాప్రతినిధులు చేయకూడదు. గతంలో మొదలై ఇప్పటికీ కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం కొనసాగించవచ్చు. వాటికి నిధుల విడుదల కూడా ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం, ఆ కమిషన్‌ పరిధిలోనే జరుగుతుండాలి.

రాజకీయ పార్టీల్లో మరింత ఒత్తిడి
సుదీర్ఘ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే అవకాశం కనిపిస్తోంది. కోడ్‌ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్నికల సమయం వరకు దాదాపు రెండు నెలలపాటు వివిధ అంశాలపై బరిలో నిలబడిన అభ్యర్థులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండటంతో, వారిలో కొంత ఒత్తిడి కనిపిస్తోంది. అంతేకాక ఇంత సుదీర్ఘ గ్యాప్‌ ఉండటం వల్ల రాష్ట్రంలో ఏ పార్టీకి ఉపయోగం? ఏ పార్టీకి నష్టం? టికెట్‌ రాని అసంతృప్తుల ప్రభావం ఎంత మాత్రం ఉంటుంది? అనే అంశాలను పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. చాలా మంది అభ్యర్థులు ఎన్నికలు ఒక నెలలోపే ముగిసిపోతే బాగుండనే ఆలోచనను వ్యక్తపరుస్తున్నారు.

➡️