అప్రమత్తతోనే కాలేయం భద్రం..

Apr 14,2024 11:33 #Liver, #Sneha

దాన గుణం, సర్దుకుపోయే తత్వం, పునరుత్పత్తి స్వభావం.. ఇవన్నీ ఎవరో వ్యక్తి గురించి అనుకుంటున్నారా! కాదండీ.. మనలోనే ఉన్న కాలేయం అనబడే పెద్ద అవయవం లక్షణాలివి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కాలేయంలో కొంత భాగాన్ని దానం ఇవ్వొచ్చు. ఆ దాత కాలేయం రెండు నెలల్లో మరల దానంతటదే మామూలు స్థాయికి పునరుత్పత్తి అవుతుంది. ఈ కాలేయానికి ఎనిమిది అరలుంటాయి. వాటిలో మూడు అరలు సరిగా పనిచేసి, మిగిలినవి పనిచేయకపోయినా దాని పనులు అది చేసుకుంటూ సర్దుకుపోగల తత్వం ఉంది. ఈ నెల 19న ప్రపంచ కాలేయ దినోత్సవం.
ఈ సందర్భంగా అసలు కాలేయం చేసే పని.. సమస్యలు.. లక్షణాలు.. చికిత్సలు.. తదితర వివరాలు తెలిపేందుకే
ఈ ప్రత్యేక కథనం.

మనిషి శరీరంలో అత్యంత కీలకంగా పనిచేసే అవయవం కాలేయం (లివర్‌). చర్మం తర్వాత కాలేయమే (1.2 – 1.5 కిలోగ్రాముల బరువు – వయోజన కాలేయం) పెద్ద అవయవం. ఇది పక్కటెముకల కింద కుడివైపున ఎగువ పొత్తికడుపులో ఉంటుంది. ఇది మన శరీరంలో ఐదువందల పైచిలుకే విధులను నిర్వహిస్తుంది. అలాంటి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. ఒత్తిడి, ఇతరత్రా కారణాలతో కాలేయ వ్యాధులు వ్యాపిస్తాయి. సాధారణంగా కాలేయానికి తీవ్రమైన పరిస్థితులు ఎదురైనప్పుడు సిర్రోసిస్‌ అనే వ్యాధికి గురవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటేటా సుమారు 20 లక్షల మంది కాలేయ వ్యాధులతో మరణిస్తున్నారని నివేదికలు చెప్తున్నాయి. సిర్రోసిస్‌ వ్యాధి, వైరల్‌ హెపటైటిస్‌, హెపాటోసెల్యులర్‌ కార్సినోమా కారణంగా ఈ మరణాలు సంభవిస్తున్నాయి. ఎక్కువగా ఊబకాయం, వైరల్‌ ఇన్ఫెక్షన్లు, జన్యుపరమైన రుగ్మతలు, అధికంగా మద్యం సేవించటం వంటివి కాలేయాన్ని దెబ్బతీస్తున్నాయి. సాధారణ స్థాయిలో కాలేయం దెబ్బతిన్నప్పుడు స్వయంగా రిపేర్‌ చేసుకోగలదు. కాలేయం తీవ్రంగా గాయపడినప్పుడు మాత్రం సాధారణ విధులను నిర్వహించలేదు. అనేక సంవత్సరాల నుంచి వ్యాధికి లోనవుతున్న కాలేయానికి సిర్రోసిస్‌ అనే వ్యాధి సోకుతుంది.

సిర్రోసిస్‌ ప్రధాన సమస్యలు
సిర్రోసిస్‌ ప్రధాన సమస్యలు అన్నవాహిక వేరిస్‌, (వరిసియల్‌ హెమరేజ్‌) – అనగా అన్నవాహికలో విస్తరించిన రక్తనాళాలు. ఈ రక్త నాళాలు ఉబ్బుతాయి. ఎందుకంటే కాలేయం ద్వారా రక్తప్రసరణ నిరోధించబడుతుంది. రక్తపు వాంతులు, రక్తాన్ని కలిగి ఉన్న పేగు కదలికలు లేదా తారు లాగా కనిపించడం వంటివి
వరిసియల్‌ హెమరేజ్‌ ప్రధాన లక్షణాలు.

లక్షణాలు..
సిర్రోసిస్‌ ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలూ కనిపించవు. తెలిసే కొన్ని సంకేతాలు ఏమంటే.. ఆకలి కోల్పోవడం, బరువు తగ్గడం, బలహీనత ఆవరించడం, కామెర్లు (చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడం), దురద, ఎగువ జీర్ణాశయంలోనే రక్తస్రావం అవుతున్న సంకేతాలు (రక్తాన్ని వాంతులు చేయడం, లేదా తారులా కనిపించే లేదా రక్తం కలిగి ఉన్న మలం), పొత్తికడుపు వాపు (అస్సైట్స్‌), ఉదరంలోని అవయవాల చుట్టూ ద్రవం పేరుకుపోవటం, అసాధారణ నిద్ర (హెపాటిక్‌ ఎన్సెఫలోపతి అనే పరిస్థితి వలన ఏర్పడుతుంది),
కండరాల తిమ్మిరి (తీవ్రంగా ఉంటుంది), అసమతుల్య రుతుస్రావం, వంధ్యత్వం,
పురుషుల్లో రొమ్ము పెరుగుదల వంటి లక్షణాలు ఎదురవుతాయి.

చికిత్స ఎలా చేస్తారంటే..
అసిటిస్‌ (కడుపు వాపు) చికిత్సకు, డాక్టర్స్‌ డైయూరిటిక్స్‌ అనే మందులను సూచిస్తారు. ఇది శరీరం అదనపు ద్రవాన్ని విసర్జించడానికి సహాయపడుతుంది. ఈ పరిస్థితి ఉన్న వ్యక్తులు సోడియం ఆధారిత పదార్థాల వినియోగాన్ని తగ్గించాలని కూడా వారు సిఫార్సు చేస్తారు. విపరీతమైన సందర్భాల్లో యుఎస్‌జి పారాసెంటెసిస్‌ అనే సాంకేతికతను ఉపయోగించి, ఉదరం నుండి ద్రవాన్ని తీసేస్తారు. కొన్ని సందర్భాల్లో ట్రాన్స్‌జుగ్యులర్‌ ఇంట్రాహెపాటిక్‌ పోర్టోసిస్టమిక్‌ స్టెంట్‌ (టిప్స్‌) (అంటే కాలేయంలో ఒక స్టెంట్‌) ను అమర్చుతారు. ఇది కాలేయంలో మచ్చల రూపంలో ఏర్పడే ఒత్తిడిని కొంతవరకు తగ్గిస్తుంది. కాలేయం ద్వారా రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడినప్పుడు మూత్రపిండాలకు రక్త ప్రవాహం పరిమితం చేయబడుతుంది.

క్యాన్సర్‌..
సిర్రోసిస్‌ ఉన్న వ్యక్తులకు కాలేయ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. ప్రత్యేకించి వారికి సిర్రోసిస్‌ హెపటైటిస్‌ బి, హెపటైటిస్‌ సి, నాన్‌ ఆల్కహాలిక్‌ స్టీటోహెపటైటిస్‌ లేదా హీమోక్రోమాటోసిస్‌ వల్ల సంభవించే అవకాశం ఉంది. అందువల్ల సిర్రోసిస్‌ ఉన్న వ్యక్తులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ చేయించుకోవాలి.

రక్షణకు టీకాలు..
రోగనిరోధక శక్తి లేని వారికి హెపటైటిస్‌ ఎ, బి టీకాలు కాలేయం మరింత దెబ్బతినకుండా ఉంచడంలో సహాయపడతాయి. సిర్రోసిస్‌తో బాధపడుతున్న వ్యక్తులు కాలేయానికి హాని కలిగించే అన్ని పదార్థాలకు దూరంగా ఉండాలి. మద్యం పూర్తిగా మానివేయాలి. ఇబుప్రోఫెన్‌, న్యాప్రోక్సెన్‌ వంటి మెడిసిన్స్‌, హెర్బల్‌ రెమెడీస్‌, పారాసెట్మోల్‌ మెడిసిన్స్‌ పరిమిత స్థాయిలో (2,000 మి.గ్రా.) తీసుకోవలసి ఉంటుంది. ఏ మెడిసిన్‌ అయినా వైద్యుని సలహా మేరకే తీసుకోవటం తప్పనిసరి.

విజయవంతంగా మార్పిడి చికిత్సలు
మనదేశంలో 1998 నుండి ఏటా 1800 కంటే ఎక్కువ కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతం అవుతున్నాయి. సిర్రోసిస్‌ వ్యాధి చివరి దశలో ఉన్న రోగుల్లో కూడా కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. వివిధ అధ్యయనాల ప్రకారం ఈ శస్త్రచికిత్సల రేటు 64 నుంచి 88 శాతం మనుగడలో ఉన్నట్లు అంచనా.

మార్పిడితో పెరిగే జీవితకాలం..
మార్పిడిలో వ్యాధికి గురైన కాలేయం స్థానంలో అమర్చేందుకు ఆరోగ్యకరమైన కాలేయాన్ని మాత్రమే వినియోగిస్తారు. చివరిదశ సిర్రోసిస్‌ ఉన్నవారికి ఇది అనివార్యమైన చికిత్స. అవసరమైన వారు జీవన్‌దాన్‌ (https://jeevandan.gov.in) పోగ్రాంలో రిజిస్టర్‌ చేసుకోవాలి. సాధారణంగా బ్రెయిన్‌ డెడ్‌కు గురైన వ్యక్తుల నుండి కాలేయాన్ని సేకరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇటీవల కొందరు జీవించి ఉన్నప్పుడే కాలేయ దానం చేయగలిగిన అవగాహన కలిగి ఉన్నారు. 80 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు కాలేయ మార్పిడి తర్వాత ఒక సంవత్సరం నుండి ఐదేళ్ల వరకూ జీవించగలుగుతున్నారు.

పరీక్షలు.. నిర్ధారణ..
కాలేయ పనితీరు తెలుసుకునేందుకు పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఇందుకుగాను INR, HBsAg, HCV, అల్ట్రాసౌండ్‌ ద్వారా వ్యాధులను తెలుసుకోవచ్చు. అలాగే ఇతర పరీక్షలలో ఎండోస్కోపీ వంటి ప్రాథమిక రక్త పరీక్షలతో కాలేయ వ్యాధులను నిర్ధారించవచ్చు. కానీ ప్రారంభంలో చేసే పరీక్షలు సాధారణమైనవి. కాలేయ దృఢత్వం, సైజు, నియంత్రిత స్థాయి, క్షీణత ఎంతవరకూ ఉందనేది పారామీటర్‌ స్కోర్‌లతో ఫైబ్రోస్కాన్‌ దీర్ఘకాలిక కాలేయ వ్యాధిని ప్రారంభదశలోనే నిర్ధారించగలదు.

డాక్టర్‌ రాజేష్‌చంద్ర
కన్సల్టెంట్‌
మెడికల్‌ గాస్ట్రోఎంట్రాలజిస్ట్‌, మణిపాల్‌ ఆసుపత్రి,
తాడేపల్లి,
గుంటూరు జిల్లా.
సెల్‌ : 7013327699

మనదేశంలోనే ఎక్కువ..
సిర్రోసిస్‌, దాని సమస్యల కారణంగా ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 11.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో 18.3% మంది మన దేశానికి చెందినవారే కావడం ఆందోళన కలిగించే అంశం. ప్రపంచవ్యాప్తంగా లివర్‌ సిర్రోసిస్‌కు ప్రధాన కారణాలు ఆల్కహాల్‌, నాన్‌-ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌ (NAFLD), క్రానిక్‌ వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు (హెపటైటిస్‌ బి, సి).

సేకరణ : యడవల్లి శ్రీనివాసరావు

➡️