ఇతిహాసపు చీకటి కోణంపై వెలుగు

Apr 15,2024 04:54 #aksharam

”ఒక రాణీ ప్రేమ పురాణం/ ఆ ముట్టడికైన ఖర్చులూ,
మతలబులూ, కైఫీయతులూ/ ఇవి కావోరు చరిత్రసారం
ఇతిహాసపు చీకటి కోణం/ అట్టడుగున పడి కాన్పించని
కథలన్నీ కావాలిప్పడు! ” అన్నాడు శ్రీశ్రీ.
అణగారిన కులాల స్త్రీల పోరాటాలపై డాక్టర్‌ చల్లపల్లి స్వరూప రాణి వెలువరించిన ‘మిణుగురులు’ ఆ పనిని చేసింది. రచయిత్రి చెప్పినట్లు ఈ పుస్తకంలో చర్చించిన స్త్రీల చరిత్రంతా వారు కులపరంగా, పురుషుల పరంగా, మతపరంగా సామాజిక మూఢ నమ్మకాలు కట్టుబాట్లు సంప్రదాయపరంగా ఎదుర్కొన్న పోరాట దృశ్యాలే. ఇందులో ధిక్కార స్వరం ఉంది. పడి లేచిన కెరటంలా తిరిగి నిలబడిన వారి ఆత్మవిశ్వాసం ఉంది. ఈ పుస్తకంలో 26 మంది జీవిత కథనాలు ఉన్నాయి. ఎంతో సరళంగా హఅద్యంగా చక్కని తెలుగు పదాలను పొదిగి కథనం చేశారు స్వరూప రాణి.
చదువుకోవడం ద్వారా తమ జీవితాలను బాగుపడతాయని పూలే, అంబేద్కర్‌ లాంటి మేధావులు గుర్తించారు. వారి జీవిత సహచరులు కూడా ఆ భావాలను అందిపుచ్చుకున్నారు. అలా సావిత్రిబాయి, పుల్లగూర దీనమ్మ, జ్యోతి లింగమ్మ, ఫాతిమా షేక్‌ తాము చదువుకోవడమే గాక పాఠశాల స్థాపించి అణగారిన కులాల వారిని విద్యావంతులను చేశారు. సావిత్రిబాయి పూలే పాఠశాలకు టీచర్‌గా వెళ్తున్నప్పుడు ఆమె పైన కోడిగుడ్లు, బురద, రాళ్లు విసిరేవారు. మాటలతోనూ అవమానించేవారు. అయినప్పటికీ ఆమె కుంగిపోకుండా జ్యోతిరావు పూలే ఇచ్చిన ధైర్యంతో సంచిలో మరో చీర పెట్టుకుని వెళ్లి అక్కడ మార్చుకొని మళ్లీ పాఠాలు బోధించేది. ఆమె దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయినిగా పేరుగాంచింది. ఆమెకు తోడుగా ఫాతిమా షేక్‌ టీచర్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసుకొని మహిళా ఉపాధ్యాయునిగా చేరింది. మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయిని అయింది. ఆంధ్రదేశంలో చిలకలూరిపేట దగ్గర పుల్లకూర దీనమ్మ అనే దళితురాలు తాను వికలాంగురాలైనప్పటికీ లూథరిన్‌ ఎలిమెంటరీ స్కూల్‌ స్థాపించి, ఆంధ్రాలో మొదటి దళిత ఉపాధ్యాయిని అయింది. మార్కాపురంలో జ్యోతి లింగమ్మ తన భర్త ద్వారా చదవడం రాయడం నేర్చుకుంది. తన భర్త అన్న తిరుపతయ్య దగ్గర్నుంచి ఆయుర్వేద విద్య నేర్చుకుని అన్ని కులాల వారికి వైద్యం అందించింది. అంబేద్కర్‌ చేస్తున్న కఅషికి, పోరాటానికి మద్దతుగా రమాబాయి పూర్తిగా అండదండలు ఇచ్చింది. తను ఎన్నో త్యాగాలు చేసి ఆయనకు చదువుకోడానికి డబ్బులు పంపింది.
ఇలా ఈ పుస్తకంలో పరిచయం చేసిన ఇలాంటి 26 మందిలో 11 మంది రాజకీయాల్లో ఉన్నవాళ్లే! ఐదుగురు విద్యారంగంలో పనిచేశారు. నలుగురు సాహిత్య సాంస్కఅతిక రంగంలో ఉన్నారు. ఇద్దరు బుద్ధిస్టులు. ఇద్దరు స్వాతంత్ర పోరాట యోధులు. వీరు సమాజంలో కట్టుబాట్లను సంప్రదాయాలను తెంచుకొని నిలబడ్డమే కాకుండా చివరి వరకు పోరాడారు.
ఈ గ్రంథంలో కేరళకు చెందిన ఇద్దరు మహిళల జీవిత కథనాలు ఉన్నాయి. అందులో ఒకరు నంగేలి. ఈమె జాకెట్‌ వేసుకుంటే రొమ్ములపై పన్నును విధిస్తున్నప్పుడు పాలకవర్గానికి నిరసనగా తన రొమ్ములను కోసి ఇచ్చి ఆత్మ త్యాగం చేసింది. ఇది ఒక ధిక్కార స్వరంగా ఇప్పటికీ ప్రజల నోళ్లలో నాలుతోంది. కొచ్చిన్‌కి చెందిన ద్రాక్షాయిని రాజ్యాంగ సభకు ఎన్నికయింది. ఈమె భర్త వేలాయుధన్‌. ఇతని మేనల్లుడే భారత రాష్ట్రపతుల్లో రాజనీతిజ్ఞుడుగా పేరుపొందిన కేఆర్‌ నారాయణన్‌. ద్రాక్షాయిని అటు గాంధీవాదంలోనూ, ఇటు అంబేద్కర్‌ వాదంలోనూ తనకు నచ్చని అంశాలను నిర్మామాటంగా చర్చించి, తన వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నారు.
ఆదివాసీల కోసం పోరాడిన వాళ్లలో కత్తి చల్లమ్మ ఒకరు, జండాలమ్మ మరొకరు. నేరస్థ జాబితాలో చేర్చబడిన యానాదుల కోసం కత్తి చల్లమ్మ కఅషి చేశారు. వారిని ఆ జాబితా నుంచి బయటకు తీయించి, అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. జెండాలమ్మ రాయలసీమ వాసి. శ్రీశైలం దగ్గర ఉన్న గిరిజనుల సంక్షేమ కోసం అనేక పోరాటాలు చేశారు. రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాలో సభ్యురాలుగా ఉండి అంబేద్కర్‌ వాదానికి ఎంతో వన్నెతెచ్చిన ఈశ్వరి బాయి గురించి ఎంతో ఆసక్తికరమైన విషయాలు రచయిత్రి వివరించారు. ఆమె 1967లో ఒకసారి, 1972లో మరొకసారి నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి గెలిచారు. తన కూతురు గీతారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నప్పటికీ తాను మాత్రం ఆ పార్టీలో చేరలేదు. ‘నీ జీవితానికి నువ్వే యజమానివి’ అన్న బుద్ధుడి మాటలను ఆఖరి శ్వాస దాకా ఆచరించారు. ఈ గ్రంథంలో కమ్యూనిస్టు ఉద్యమంలో రాణించిన కామ్రేడ్‌ కమల సువార్తమ్మ గురించి వివరించారు రచయిత్రి. కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్న నిబద్ధతను పుణికిపుచ్చుకున్నారు కమల. శాస్త్రీయ దఅక్పథాన్ని అలవర్చుకొని, సంప్రదాయాలను పక్కనపెట్టి ఆదర్శంగా నిలిచారు. అనేక సామాజిక వివాహాలను జరిపారు. ఆడపిల్లలకు సైకిల్‌ తొక్కడం నేర్పించి వారు చదువుకోడానికి సహాయం అందించారు. బాల సంఘంలో బుర్రకథ నేర్చుకుని, చైతన్యం అందించే కథలను ప్రచారం చేశారు. ఉద్యోగిగా, రచయిత్రిగా తన కుటుంబాన్ని తానే పోషించుకుంటూ ముందుకు సాగిన ధీశాలి నంబూరి పరిపూర్ణ. ఉంటాయి మాకు ఉషస్సులు, కథాపరిపూర్ణం అనే కథాసంపుటి, శిఖరారోహణం వ్యాసాలు కథలు, పొలిమేర నవల రాశారు.
‘నా దేశం తప్పు చేస్తే దాన్ని దిద్దుతాను/ నా దేశం ఒప్పు చేస్తే దాన్ని అనుసరిస్తాను’ అని గర్వంగా చెప్పిన హేమలత లవణం గురించి కూడా ఈ పుస్తకంలో ఉంది. ఆమె తండ్రి జాషువా, అత్తమామలు సరస్వతి, గోరా అభ్యుదయవాదులు. హేమలత, లవణం దంపతులు ఎంతో మంది అనాధ పిల్లలకు జీవితాన్ని ఇచ్చారు. జోగినిల కోసం చెల్లి నిలయం ఏర్పాటు చేసి జోగినిగా మార్చే దురాచారంపై పోరాటం చేశారు. కులమతాలకు అతీతంగా జీవించారు. హేమలత లాగానే ఇప్పుడు హేతువాద లక్ష్మి కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. నాగార్జున సాగర్‌లో జ్యోతిష్యం కోసం విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని నిర్ణయించినప్పుడు ఆమె పోస్ట్‌కార్డు ఉద్యమాన్ని నడిపారు. తిరుపతిని వాటికన్‌ సిటీ తరహాలో హిందూ సిటీగా మార్చాలని కొందరు తలపోసినప్పుడూ ఆమె ఉద్యమించారు. ఇప్పటికీ ఎన్నో సామాజిక ఉద్యమాలు నిర్వహిస్తున్నారు.
బుద్ధిష్టు కల్చరల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు మణిసింగ్‌ గురించి ఈ పుస్తకంలో రాశారు. ఆమె దళిత హక్కుల వేదిక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు కూడా. దళితులపై ఎక్కడ దాడులు జరిగినా ఆమె స్పందించి, పోరాటంలోకి దిగుతారు. ఆమె నివసించే పాలగూడెంలో బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేయించారు. అంబేద్కర్‌ చెప్పిన హేతువాద బాటలో బుద్ధుని చూడాలని, దేవునిగా పూజించకుండా బౌద్ధాన్ని ఆచరిస్తే అది సమాజానికి ఎంతో విలువైనదని ఆమె చెబుతారు. ఒకనాడు జోగినిగా ఉన్న రంగమళ్ళ మహాలక్ష్మి ఇప్పుడు జోగిని నిర్మూలన సంఘానికి చైర్‌ పర్సన్‌. ఆశ్రయి అనే స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాల పట్ల ఆకర్షితురాలై తన జోగిని వఅత్తిని వదిలేసి వారితో పాటు ఇతర జోగిని స్త్రీల విముక్తి కోసం పనిచేస్తున్నారు.
పూలన్‌ దేవి ఒక సాహస వనిత. పెత్తందారీ ఠాకూర్ల దాష్టీకాలను ఎదిరించటానికి, బందిపోటుగా మారారు. తరువాతి కాలంలో సమాజ్‌ వాది పార్టీలో చేరి, మీర్జాపూర్‌ పార్లమెంటు స్థానం నుంచి గెలిచారు. మహిళల కోసం ఏకలవ్య సేన అనే ఒక సంస్థను స్థాపించారు. ఆమెను 2001లో కొందరు దుండగులు కాల్చి చంపేశారు. ఆమె కథ ఈ దేశపు అణగారిన ప్రజల తిరుగుబాటు పతాకగా నిలిచిపోయింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ములుగు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ధనసరి అనసూయ అలియాస్‌ సీతక్క గురించి కూడా ఈ ఈ పుస్తకంలో ఉంది. ఆమె అన్న సాంబయ్య ప్రభావంతో ఆమె జనశక్తి పార్టీ దళ కమాండర్‌గా మారారు. ఉద్యమంలోంచి బయటకు వచ్చాక ఎల్‌ఎల్‌బి చదివారు. తరువాత రాజకీయాల్లో చేరి, ఇప్పుడు తెలంగాణా మంత్రిగా ఉన్నారు.
ఇలా వివిధ ఉద్యమాల్లో పనిచేసి, ఆదర్శంగా నిలిచిన 26 మంది మహిళల గురించి ఈ పుస్తకంలో వివరించారు. సమాజంలో మార్పు కోసం పనిచేయడమంటే ఏటికి ఎదురీతేనని, అయినా, కారుచీకట్లో మిణుగురు వెలుగుల్లా ముందుకు సాగిపోవడమే తుది విజయాలకు కారణమవుతాయని ఈ మహిళామూర్తుల జీవిత గాధలు మనకు ప్రబోధిస్తాయి.

– కుమారస్వామి

➡️