ప్రజాగొంతుక మూగబోవడం బాధాకరం

Jan 1,2024 11:16 #PDF MLC
  • ఎంఎల్‌సి సాబ్జీ సంస్మరణ సభలో శాసనమండలి చైర్మన్‌ మోషేన్‌రాజు

ప్రజశక్తి –  తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి జిల్లా)  : ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలతోపాటు ప్రజా సమస్యలపై గళమెత్తిన పిడిఎఫ్‌ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ గొంతుక మూగబోవడం బాధాకరమని శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని గుణ్ణం ఫంక్షన్‌ హాల్లో యుటిఎఫ్‌ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జరిగిన ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ సంస్మరణ సభలో ఆయన పాల్గని మాట్లాడారు. మదుస్వభావి, స్నేహశీలి, చిరునవ్వుతో అందరితో ఆప్యాయంగా ఉండే సాబ్జీ లేరనే నిజాన్ని నమ్మలేకపోతున్నామన్నారు. ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సాబ్జీ భౌతికంగా మన మధ్యలో లేకున్నా ఆయన ఆశయ సాధనకు అంతా కృషి చేయాలని కోరారు. సిపిఎస్‌ రద్దు కోసం ఉద్యోగ, ఉపాధ్యాయులు ఐక్యంగా పోరాటాలు చేయడమే సాబ్జీకి అర్పించే నిజమైన నివాళని పేర్కొన్నారు. సాబ్జీ మరణం ప్రజాతంత్ర, అభ్యుదయ, ప్రగతిశీల ఉద్యమాలకు తీరని లోటన్నారు. సాబ్జీ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు, యుటిఎఫ్‌ శ్రేణులకు తెలియజేయాలని జిల్లా ఎస్‌పి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై పోరే సాబ్జీకి ఘననివాళని అన్నారు. యుటిఎఫ్‌ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.రవికుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఉద్యోగ సంఘాల జిల్లా జెఎసి చైర్మన్‌ చోడగిరి శ్రీనివాస్‌, రాష్ట్ర నాయకులు హరినాథ్‌, యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి, రాష్ట్ర కార్యదర్శి బి.సుభాషిణి, సీనియర్‌ నేతలు ఎస్‌ జయప్రభ, ఎం.రామకృష్ణ, పివి నరసింహారావు, ఉమ్మడి జిల్లాల నేతలు ఆర్‌.రవికుమార్‌, షేక్‌ అలీ, పి.విజయరామరాజు, ఎకెవి.రామభద్రం, ప్రజాసంఘాల నేతలు చింతకాయల బాబూరావు, కర్రి నాగేశ్వరరావు, సాబ్జీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

➡️