పౌర స్మృతిలో వివాహ, కుటుంబ భాగాలకు న్యాయ సవరణలు

Apr 7,2024 23:20 #China, #Civic Smriti

– ప్రజల మందుకు చైనా సుప్రీంకోర్టు ముసాయిదా
బీజింగ్‌ : చైనా పౌర స్మృతి (సివిల్‌ కోడ్‌)లో వివాహ, కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన భాగానికి న్యాయ వివరణలు సూచిస్తూ రూపొందించిన ముసాయిదాను ఆ దేశ సుప్రీం పీపుల్స్‌ కోర్టు (ఎస్‌పిసి) ఆదివారం విడుదల చేసింది. న్యాయ వివరణల ముసాయిదాపై సాధారణ ప్రజానీకం ఈ నెల 30 లోగా తమ సూచనలు, సలహాలను పంపవచ్చునని ఎస్‌పిసి ఒక ప్రకటనలో ఆహ్వానించింది. సివిల్‌ కోడ్‌లోని వివాహ, కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన అనేక వివాదాలకు న్యాయ పరిష్కారాలను ముసాయిదాలో పొందుపర్చారు. ప్రధానంగా ‘నకిలీ’ విడాకులకు సంబంధించిన వివాదాల నియంత్రణపై ముసాయిదాలో దృష్టి సారించారు. విడకాలు పొందిన దంపతుల్లో ఎవరైనా ఒకరు తమ విడాకాలు సరైనవి కావంటూ నాయస్థానాన్ని ఆశ్రయిస్తే వెంటనే ఆ విడాకాలను చెల్లుబాటు కానివిగా న్యాయమూర్తులు ప్రకటించరాదని ముసాయిదా సూచిస్తోంది. అయితే తాము తీసుకున్న విడాకాలు ‘నకిలీవి’ అని, పంపకాలు పూర్తి అయిన ఆస్తులను తిరిగి ఉమ్మడిగా రీ డిస్పోజ్‌ చేయాలని దంపతుల్లో ఏవరైనా ఒకరు న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తే అందుకు అనుమతి ఇవ్వవచ్చునని పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమాల్లో లైవ్‌ స్ట్రీమింగ్‌కు సంబంధించి వర్చువల్‌ గిఫ్టింగ్‌ల వివాదాలపైనా ఎస్‌పిసి దృష్టి సారించింది. ముసాయిదా ప్రకారం..ఎనిమిదేళ్ల లోపు వయస్సున్న పిల్లలు ఎవరైనా లైవ్‌ స్ట్రీమింగ్‌ సమయంలో క్రియేటర్లకు వర్చువల్‌ బహుమతులు పంపితే వాటిని ఆ పిల్లల తల్లిదండ్రులు, సంరక్షకులు వెనక్కి ఇచ్చేయాలని క్రియేటర్లను కోరితే..అటువంటి సందర్భాల్లో పిల్లలు పంపిణీ బహుమతులను, డబ్బును క్రియేటర్లు వెనక్కి ఇచ్చేయాల్సివుంటుందని పేర్కొన్నారు. అలాగే 8 నుంచి 16 ఏళ్ల మధ్య వయస్సున్న మైనర్లు లేదా 16 ఏళ్లు పైబడి వయస్సు ఉండి వేరుగా జీవనం సాగించకుండా తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వద్దనే జీవిస్తుంటే అటువంటి పిల్లలు ఒకవేళ పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తే ఆ డబ్బును తల్లిదండ్రులు, సంరక్షకులు వెనక్కి ఇచ్చేయాలని క్లయిమ్‌ చేస్తే పిల్లలు ఎవరికి అయితే డబ్బులు ఇచ్చారో వారు తిరిగి ఇచ్చేయాలని ముసాయిదాలో తెలిపారు.

➡️