ప్రతి పేదవానికి భూమి

Feb 23,2024 11:28 #Kerala Minister, #P Rajeev

ఇదే ప్రభుత్వ లక్ష్యమన్న కేరళ మంత్రి రాజీవ్‌

కోచి జిల్లాలో 830 పట్టాల పంపిణీ

కోచి : భూమిలేని పేదలంటూ కేరళలో ఎవరూ వుండకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని కేరళ పరిశ్రమలు, న్యాయ శాఖ మంత్రి పి.రాజీవ్‌ చెప్పారు. ఎలార్‌ మున్సిపల్‌ టౌన్‌ హాల్‌లో జరిగిన జిల్లా పట్టాల పంపిణీ మేళా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రెండున్నరేళ్ళలో లక్షన్నర పట్టాలను పంపిణీ చేయగలిగామని, ఇది గర్వించదగ్గ విషయమని అన్నారు. కేరళ ఈ విషయంలో కొత్త చరిత్ర సృష్టించిందన్నారు. ఈ బృహత్తర లక్ష్య సాధన వెనుక గల అధికారులందరికీ అభినందనలు తెలియచేశారు. తమకంటూ ఎంతో కొంత భూమి వుండాలనేది ప్రతి ఒక్కరి కలగా వుంటుందని, ఈనాడు 830 కుటుంబాలకు ఆ కల సాకారమైందన్నారు. జిల్లాలో 830 పట్టాలను పంపిణీ చేశారు. వీటిల్లో 600 ఎల్‌టి పట్టాలు, 75 దేవస్థానం భూముల పట్టాలు వున్నాయి. 1964 భూపతివ్‌ యాక్ట్‌ కింద పంచాయితీ ఏరియాలో 63 కుటుంబాలకు పట్టాలు ఇచ్చారు. 1995 చట్టం కింద మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధుల్లో 21 కుటుంబాలకు పట్టాలు ఇచ్చారు. అటవీ హక్కుల చట్టం కింద 67 కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ, ఎంఎల్‌ఎలు సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

➡️