గెలుపుముంగిట బెంగళూరు బోల్తా

Apr 22,2024 07:56 #2024 ipl, #Cricket, #Sports
  • ఒక్క పరుగు తేడాతో కోల్‌కతా చేతిలో ఓటమి

కోల్‌కతా: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సిబి)జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. 223పరుగుల భారీ ఛేదనలో భాగంగా బెంగళూరు చివరి ఓవర్లో 21పరుగులు చేయాల్సి రాగా.. తొలి నాలుగు బంతుల్లో కరణ్‌ శర్మ మూడు సిక్సర్లు కొట్టి విజయతీరాలకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత రెండు బంతుల్లో మూడు పరుగులు చేస్తే బెంగళూరుదే విజయం అనుకున్న దశలో.. వరుసగా రెండు వికెట్లు కోల్పోయి అనూహ్యంగా ఓటమిపాలైంది. దీంతో బెంగళూరు ఒక్క పరుగు తేడాతో ఓటమిని చవిచూసింది. దీంతో జాక్స్‌, రజత్‌ పాటిదార్‌ చెరో అర్ధ సెంచరీతో చెలరేగినప్పటికీ లాభం లేకుండా పోయింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఆండీ రస్సెల్‌కు లభించింది.
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ దిగిన కోల్‌కతా బ్యాటర్లు అదిరే ఆరంభం ఇచ్చారు. ఓపెనర్‌ ఫిలిప్‌ సాల్ట్‌ చెలరేగి ఆడాడు. వరుసగా ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. కేవలం 14బంతుల్లోనే 48 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 4.2 ఓవర్‌ వద్ద సిరాజ్‌ వేసిన బంతికి భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. మరో ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌ 10 పరుగులకే ఔటయ్యాడు. సాల్ట్‌, నరైన్‌ తర్వాత క్రీజులోకి వచ్చిన రఘువంశీ(3), వెంకటేశ్‌ అయ్యర్‌(16) ప్రభావం చూపించలేకపోయారు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, రింకూ సింగ్‌ దూకుడుగా ఆడారు. 13.1 ఓవర్‌లో రింకూ సింగ్‌(24) ఔటయ్యాక శ్రేయస్‌ అర్ధ సెంచరీ చేసి వెంటనే ఔటయ్యాడు. చివరలో ఆండ్రీ రస్సెల్‌(27), రమణ్‌దీప్‌ సింగ్‌(24) రాణించడంతో కోల్‌కతా నిర్ణీత 20ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.
భారీ చేధనకు దిగిన బెంగళూరు జట్టు ఆరంభంలోనే తడబాటుకు గురైంది. పవర్‌ ప్లే పూర్తయ్యేలోపే విరాట్‌ కోహ్లీ(18), డుప్లెసిస్‌(7) వికెట్లు కోల్పోయింది. మూడో ఓవర్‌లో మొదటి బంతికే విరాట్‌ కోహ్లీ ఔటయ్యాడు. హర్షిత్‌ బౌలింగ్‌లో రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. నాలుగో ఓవర్‌లో తొలి బంతికే డుప్లెసిస్‌ కూడా ఔటయ్యాడు. కోహ్లీ, డుప్లెసిస్‌ ఔటయిన తర్వాత క్రీజులోకి వచ్చిన జాక్స్‌(55), రజత్‌ పటీధర్‌ (52) అర్ధసెంచరీలతో బెంగళూరును లక్ష్యం దిశగా పయనింపజేశారు. అయితే 12వ ఓవర్‌ నుంచి బెంగళూరుకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. కోల్‌కతా బ్యాటర్ల ధాటికి రెండు ఓవర్లలోనే 4వికెట్లను సమర్పించుకుంది. 12వ ఓవర్‌లో తొలి బంతిలో జాక్స్‌ (55) ఔటవ్వగా.. నాలుగో బంతికి రజత్‌ (52) హర్షత్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 13వ ఓవర్‌లో మూడో బంతికి గ్రీన్‌ (6).. చివరి బంతికి లోమ్రోర్‌(4) ఔటయ్యారు. ఆ తర్వాత ప్రభుదేశారు(24), దినేశ్‌ కార్తిక్‌(25) ధాటిగా ఆడి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. కానీ 18వ ఓవర్‌ రెండో బంతికి ప్రభుదేశారు ఔటవ్వడంతో బెంగళూరు మళ్లీ సందిగ్ధంలో పడింది. అయినప్పటికీ దినేశ్‌ కార్తిక్‌ ఒంటరిపోరుతో విజయతీరాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ 19 ఓవర్‌లో దినేశ్‌ కార్తిక్‌ ఔటవ్వడంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. చివరి ఓవర్లో 21పరుగులు కావల్సిన దశలో మూడు సిక్సర్లు బాదిన కరణ్‌ శర్మ.. రెండు బంతుల్లో మూడు పరుగులు చేస్తే విజయం దక్కే పరిస్థితుల్లో ఔటయ్యాడు. చివరి బంతికి ఫెర్గూసన్‌ రెండు పరుగులు తీసేందుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో బెంగళూరు ఓటమి పాలయ్యింది. కోల్‌కతా బౌలర్లు ఆండీ రస్సెల్‌కు మూడు, నరైన్‌, హర్షీత్‌ రాణాకు రెండేసి వికెట్లు దక్కాయి.

స్కోర్‌బోర్డు…
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి)రజత్‌ పటీధర్‌ (బి)సిరాజ్‌ 48, నరైన్‌ (సి)కోహ్లి (బి)యశ్‌ దయాల్‌ 10, రఘువంశీ (సి)గ్రీన్‌ (బి)యశ్‌ దయాల్‌ 3, వెంకటేశ్‌ అయ్యర్‌ (సి)లోమ్రోర్‌ (బి)గ్రీన్‌ 16, శ్రేయస్‌ అయ్యర్‌ (సి)డుప్లెసిస్‌ (బి)గ్రీన్‌ 50, రింకు సింగ్‌ (సి)యశ్‌ దయాల్‌ (బి)ఫెర్గుసన్‌ 24, రస్సెల్‌ (నాటౌట్‌) 27, రమన్‌దీప్‌ సింగ్‌ (నాటౌట్‌) 24, అదనం 20. (20ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 222పరుగులు.
వికెట్ల పతనం: 1/56, 2/66, 3/75, 4/97, 5/137, 6/179

బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-40-1, యశ్‌ దయాల్‌ 4-0-56-2, ఫెర్గుసన్‌ 4-0-47-1, కరణ్‌ శర్మ 4-0-33-0, గ్రీన్‌ 4-0-35-2.
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: విరాట్‌ కోహ్లి (సి అండ్‌ బి)హర్షీత్‌ రాణా 18, డుప్లెసిస్‌ (సి)వెంకటేశ్‌ అయ్యర్‌ (బి)చక్రవర్తి 7, విల్‌ జాక్‌ (సి)రఘువంశీ (బి)రస్సెల్‌ 55, రజత్‌ పటీధర్‌ (సి)హర్షీత్‌ రాణా (బి)రస్సెల్‌ 52, గ్రీన్‌ (సి)రమణ్‌దీప్‌ సింగ్‌ (బి)నరైన్‌ 6, ప్రభుదేశారు (సి)రఘువంశీ (బి)హర్షీత్‌ రాణా 24, లోమ్రోర్‌ (సి అండ్‌ బి)నరైన్‌ 4, దినేశ్‌ కార్తీక్‌ (సి)సాల్ట్‌ (బి)రస్సెల్‌ 25, కరణ్‌ శర్మ (సి అండ్‌ బి)స్టార్క్‌ 20, సిరాజ్‌ (నాటౌట్‌) 0, ఫెర్గుసన్‌ (రనౌట్‌) 1, అదనం 9. (20 ఓవర్లలో ఆలౌట్‌) 221పరుగులు.
వికెట్ల పతనం: 1/27, 2/35, 3/137, 4/138, 5/151, 6/155, 7/187, 8/202, 9/220, 10/220
బౌలింగ్‌: హర్షీత్‌ రాణా 4-0-33-2, స్టార్క్‌ 3-0-55-1, చక్రవర్తి 4-0-36-1, సునీల్‌ నరైన్‌ 4-0-34-2, సుయాశ్‌ శర్మ 2-0-33-0, రస్సెల్‌ 3-0-25-3.

➡️