కోపర్నికస్‌ గురించి తెలుసా?

Feb 19,2024 10:50 #Copernicus

నికోలాస్‌ కోపర్నికస్‌ మధ్యయుగానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ధ్రువ పరిచిన వారిలో ప్రథముడు. ఫిబ్రవరి 19, 1473లో ధార్న్‌ అనే పట్టణంలో జన్మించాడు. ఇటలీలోని బొలోగ్నా విశ్వవిద్యాలయంలో న్యాయ శాస్త్రం, గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం అభ్యసించాడు. గ్రీకు భాష నేర్చుకుని ఎన్నో గ్రంథాలను కంఠస్థం చేశాడు. 29 ఏళ్ళ వయస్సులో రోమ్‌ విశ్వ విద్యాలయంలో ఖగోళ శాస్త్ర నిపుణుడిగా చేరాడు. అరిస్టాటిల్‌, టోలెమీకు బలపరిచిన భూ కేంద్రక సిద్ధాంతం కంటే పైథాగరస్‌ సూర్య కేంద్రక సిద్ధాంతమే సరైందని బలంగా నమ్మాడు. గ్రహాల కదలికల ఆధారంగా గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని మొట్టమొదట నిరూపించిన వాడు కోపర్నికస్‌. భూమి తన అక్షము పైనే తిరుగుతుందని అందువల్లే రాత్రి పగలూ ఏర్పడుతున్నాయని ధృవపరిచాడు. భూభ్రమణ, పరిభ్రమణాల వల్లే శీతోష్ణ స్థితులు, ఋతువులు మారుతున్నాయని గ్రహించాడు. ఈ విషయాలన్నీ వాస్తవాలే అయినా వాటిని బయట పెట్టడానికి కోపర్నికస్‌కు ధైర్యం చాలలేదు. అప్పట్లో మత గ్రంథాలు, జ్యోతిష గ్రంథాలలో రాసిన సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడన్న విషయాన్ని బలంగా నమ్మేవారు.తన సిద్ధాంతాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేసిన రోజున ‘ఖగోళ శాస్త్రాన్నే తలకిందులుగా చేస్తున్న మూర్ఖుడు’ అని మార్టిన్‌ లూథర్‌ దూషించాడు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కోపర్నికస్‌ తాను సేకరించిన, తెలుసుకున్న వివరాలన్నింటిని గ్రంథంగా అచ్చు వేయించి అప్పటి పోప్‌, మూడవ పాల్‌కు అంకితం చేశాడు. ఇది జర్మనీలో ఉన్న న్యూవెంబర్గ్‌లో ప్రచురితమయినది. ఈ పుస్తకంలోని అంశాలు వివాదానికి దారి తీస్తాయోమోనన్న భయంతో ప్రచురణకర్తలు ‘దీనిని విజ్ఞాన గ్రంథంగా పరిగణించగూడదు’ అని ముందుగానే చెప్పుకున్నారు. ఈ విషయాలేవీ తెలియకుండానే 1543 మే 21 లో కోపర్నికస్‌ కన్ను మూశాడు.కోపర్నికస్‌ కంటే కొన్ని శతాబ్దాల ముందు ఎంతోమంది భారతీయ, గ్రీకు శాస్త్రవేత్తలు సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని గురించి ప్రస్తావించినా ఇతని రచనల్లో సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని, సైద్ధాంతికంగా నిరూపించడంతో ప్రాధాన్యం సంతరించుకున్నాడు. దీంతో ఆధునిక సైన్సులో కోపర్నికస్‌ విప్లవం ఆరంభమైంది. కోపర్నికస్‌ అందించిన ఈ వివరాలే తరువాత రంగంలోకి దిగిన టైకో బాహ్రి, కెప్లర్‌, గెలీలియో, న్యూటన్‌, ఐన్‌ స్టైన్‌ వంటి వాళ్లకు పునాది రాళ్ళుగా నిలిచాయి.

➡️