మోకాలి కీళ్ళే కీలకమా..!

Dec 31,2023 10:04 #Science, #Sneha

ప్రతి పదార్థం.. అణు నిర్మితం.. కణ నిర్మితం. వాటి విభజన, రూపకల్పన, ఉత్పరివర్తనాలన్నీ నిరంతర ప్రక్రియలే. ‘మనిషి.. కోతి నుంచి వచ్చాడు’ అనే క్రియ జరగడానికి మధ్యలో అనేక శతాబ్దాల పాటు చాలా మార్పులు జరిగాయి. అంటే జన్యుపరమైన తేడాలతో కోతుల్లోనూ చాలా రకాలున్నాయి. వాటిలో ఒక రకమైన కోతి రూపాంతరమే మనిషి. ఒకటిన్నర కోట్ల ఏళ్లుగా మనిషిలో (మన పూర్వీకుల్లో) ఆ జన్యుపరమైన మార్పులే జరుగుతూ వచ్చాయి. అవే చింపాంజీలు, కోతుల నుంచి మనల్ని వేరుచేశాయి.

ఈ మార్పుల క్రమంలోనే మన పూర్వీకుల మెదడు పరిమాణం నాలుగు రెట్లు పెరిగింది. ప్రవర్తన, నాలుక రూపం, స్వర పేటికల్లో మార్పులు వచ్చాయి. మాట్లాడటం, ఆ మాటకు భాష ఏర్పడటం, ఆలోచన వృద్ధిచెందటం, కొత్త ఆవిష్కరణల వరకు అనేకానేక ఉద్భవాలు. ఆది మానవుని అస్థిపంజరం, కండరాలు, కీళ్లలో వచ్చిన మార్పులతో నిలబడి నడవడం, సుదూర ప్రాంతాలకు ప్రయాణించడం, ఆయుధాలను విసరడం లాంటివి సాధ్యపడ్డాయి.

పరిణామంలో పరివర్తన..

మనిషి అంటే.. వెంటనే గుర్తొచ్చేది రెండు కాళ్లతో నడవడం. మెదడు పరివర్తన తర్వాత మొదటి బాహ్య పరిణామం కూడా ఇదేనని చెప్పవచ్చు. పందొమ్మిది లక్షల ఏళ్ల క్రితం హౌమో ఎరెక్టస్‌ అనే మానవ జాతి పూర్తిగా రెండు కాళ్లతో నడవడానికి నాంది పలికింది. ఇలా నడవడం వల్లనే ఇతర జంతువులకు భిన్నంగా.. వేటకి ఆయుధాలను ఉపయోగించడం.. సుదూర ప్రాంతాలకు వలస వెళ్ళడం.. ఇతర జంతువులపై ఆధిపత్యాన్ని సంపాదించడం, మచ్చిక చేసుకోవడం లాంటివి అలవడ్డాయి.దీనిపై పరిశోధనలు చేస్తున్న హార్వర్డ్‌ వర్సిటీలోని హ్యూమన్‌ ఎవల్యూషనరీ బయాలజీ ప్రొఫెసర్‌ టెరెన్స్‌ డీ కాపెలినీ ఇలా అంటారు. ‘మనకు శరీరంలో తుంటిపై భాగం ఎక్కువ బరువుంటుంది. ఈ బరువునంతా మోసేలా మన మోకాళ్లలో మార్పులు వచ్చాయి. నాలుగు కాళ్ళతో నడిచే చింపాంజీల మోకాళ్ళ కంటే మనిషి మోకాలు దృఢంగా మారింది’.

హార్స్‌.. రెగ్యులేటరీ స్విచ్‌లు..

అభివద్ధి చెందుతున్న ఎలుక, మనిషి నుంచి కార్టిలేజ్‌ను తీసుకుని ఆయన బందం 2020లో పరిశోధనలు చేపట్టింది. పిండదశలో మోకాళ్లు రూపుదిద్దుకునే సమయంలో, నిర్దిష్టమైన ప్రాంతం నుంచి కార్టిలేజ్‌ను సేకరించారు. మనిషి డీఎన్‌ఏలో ‘హ్యూమన్‌ యాక్సిలరేటెడ్‌ రీజియన్స్‌ (హార్స్‌)’ను గుర్తించారు పరిశోధనలో. ఇవే మనిషికి, వానర జాతులకు మధ్య జన్యువుల తేడాను తెలిపేందుకు కీలకంగా మారాయి. మోకాలి నిర్మాణం, పరిమాణాన్ని నియంత్రించే ‘రెగ్యులేటరీ స్విచ్‌’లలో హార్స్‌ సీక్వెన్స్‌లు పుష్కలంగా ఉన్నాయి. ఈ స్విచ్‌లు జన్యువుల చర్యలనూ నియంత్రిస్తాయి. ‘ఒక జన్యువును బల్బ్‌ అనుకుంటే.. రెగ్యులేటరీ స్విచ్‌ ఎలక్ట్రిక్‌ బోర్డుపై స్విచ్‌ లాంటిది’ అని కాపెలినీ వివరించారు. వీటిలో అదనపు జన్యు పరివర్తనలు (మ్యుటేషన్లు) చోటుచేసుకుంటే వీటి నిర్మాణమే మారిపోతుంది. వయసు పైబడేటప్పుడు, బరువు పెరగటం.. కండరాలు బలహీనపడటం.. కారణంగా కీళ్ళ వ్యాధులకు లోనయ్యే అవకాశం ఉంది’ అంటారు కాపెలినీ.

మార్పులే ముంపులా..!

అనేక మార్పుల కారణంగా కొన్ని జన్యు మార్పులు ప్రస్తుతం ఆటిజం, అల్జీమర్స్‌, స్కిజోఫ్రేనియా, బైపోలార్‌ డిజార్డర్‌, మధుమేహం, కీళ్లవాతం లాంటి వ్యాధుల ముప్పును కూడా పెంచుతున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మనం నడవడానికి కీలకపాత్ర పోషించిన జన్యువులే మనలో ఈ వ్యాధుల ముప్పును పెంచుతున్నాయి. ఒకప్పుడు వాతావరణానికి అనుగుణంగా మనిషి పరిణామం చెందేందుకు, మనం నడవడానికి కీలకపాత్ర పోషించిన జన్యువులే ఇప్పుడు కీళ్లవాతం, ఇతర వ్యాధులకు కారణభూతమవుతున్నాయంటే మన జీవన విధానంలో వచ్చిన మార్పులే దీనికి మూలమని మనకూ అర్ధమవుతోంది. మరి వీటిని అడ్డుకునేందుకు ఆహార, వ్యవహారాల్లోనే తీవ్ర మార్పులు చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. తస్మాత్‌ జాగ్రత్త అంటున్నారు శాస్త్రవేత్తలు.

➡️