బ్రిటన్‌ రాజు చార్లెస్‌-3కి క్యాన్సర్‌

 లండన్‌ :   బ్రిటన్‌ రాజు చార్లెస్‌-3 (75)కి క్యాన్సర్‌ నిర్థారణైనట్లు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. గత నెల పెరిగిన ప్రొస్టేట్‌కు చికిత్స చేయించుకున్నారని, వైద్య పరీక్షల్లో క్యాన్సర్‌ వ్యాధి బయటపడినట్లు పేర్కొంది. అయితే అది ఏరకమైన క్యాన్సర్‌ అని వెల్లడించలేదు. సోమవారం నుండి చికిత్స తీసుకుంటున్నారని, వైద్యుల సూచన మేరకు ఆయన హాజరయ్యే ప్రత్యేక కార్యక్రమాలను వాయిదా వేసినట్లు తెలిపింది.

క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకే ఆయన తన చికిత్స గురించి ప్రకటించారని చార్లెస్‌-3 ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం ఆయన అవుట్‌ పేషెంట్‌గా చికిత్స తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కింగ్‌ చార్సెస్‌-3చికిత్సకు సానుకూలంగా స్పందిస్తున్నారని, వీలైనంత త్వరలో సాధారణ విధులకు హాజరవుతారని అన్నారు. క్వీన్‌ ఎలిజిబెత్‌-2 మరణానంతరం చార్లెస్‌ -3 2022 సెప్టెంబర్‌లో బ్రిటన్‌ రాజుగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.

చార్లెస్‌-3  త్వరగా కోలుకోవాలి : పలువురు నేతల ట్వీట్స్‌

చార్లెస్‌-3 త్వరగా కోలుకోవాలని పలువురు నేతలు ఆకాంక్షించారు. బ్రిటన్‌ మాజీ ప్రధానులు లిజ్‌ ట్రస్‌, బోరిస్‌ జాన్సన్‌, టోనీ బ్లెయిర్‌లు ఈ మేరకు ట్వీటర్‌లో పేర్కొన్నారు. త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు అమెరికా ప్రధాని జోబైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునక్‌, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోలు ట్వీట్‌ చేశారు. చార్లెస్‌-3 త్వరగా కోలుకోవాలని, ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు.

➡️