నష్టాల నుంచి గట్టేక్కేందుకు మిత్రుడి హత్య

Dec 6,2023 21:36 #crime

– ఆధారాలు లేకుండా మృతదేహాన్ని తగలబెట్టిన వైనం

– నిందితుడితో పాటు 11 మంది అరెస్టు : ఎస్‌పి

ప్రజాశక్తి – అనంతపురం క్రైం ఇద్దరూ కలిసి చేసిన వ్యాపారంలో వచ్చిన నష్టాల నుంచి గట్టేక్కేందుకు మిత్రుడునే హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని అదృశ్యం చేసేందుకు పెట్రోల్‌పోసి తగులబెట్టాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేసి, చేధించారు. నిందితుడితో పాటు 11 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం ఎస్‌పి అన్బురాజన్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. నిందితుడు షేక్‌ మహమ్మద్‌ రఫీ, హత్యకు గురైన మహమ్మద్‌ అలీ ఇద్దరూ స్నేహితులు. రియల్‌ ఎస్టేట్‌తో పాటు పలు వ్యాపారాలు కలిసి చేసేవారు. వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. నష్టపోయిన డబ్బును చెల్లించాలని రఫీని తరుచూ అలీ అడిగేవాడు. దీంతో అలీని చంపేస్తే అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయని రఫీ భావించాడు. ధర్మవరం సుఫారీ గ్యాంగ్‌ను సంప్రదించి కుట్ర పన్నాడు. అందులో భాగంగా గతనెల 27న మహమ్మద్‌ అలీని తన బావ అయిన షేక్‌ సిద్ధిక్‌ అలీకి చెందిన ఫర్నీచర్‌ గోడౌన్‌కు రఫీ పిలిపించాడు. అక్కడ అలీపై దాడి చేసి హతమార్చారు. మృతదేహాన్ని కారులో తీసికెళ్లి గిద్దలూరు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో పడేయాలని తొలుత భావించాడు. అలా చేయడం వీలుకాకపోవడంతో తిరిగి మృతదేహాన్ని అంబులెన్స్‌లో అనంతపురంలోని నారాయణపురం ఇందిరమ్మ కాలనీలో మహమ్మద్‌ రఫీక్‌ నిర్మిస్తున్న కొత్త ఇంటికి తీసుకెళ్లారు. గత నెల 28న అర్ధరాత్రి నారాయణపురం సమీపంలోని శ్మశాన వాటికకు మృతదేహాన్ని తీసికెళ్లి పెట్రోలు పోసి కాల్చివేశాడు. బెంగళూరుకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని మృతుని తండ్రి ఈ నెల ఒకటిన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో వాస్తవాలు వెల్లడి కావడంతో ప్రధాన నిందితుడితో పాటు హత్యకు సహకరించిన 11 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

➡️