అందమైన జ్ఞాపకమే ఆదాయమైంది…

Dec 7,2023 07:12 #Jeevana Stories, #Women
kanyaputri stroy jeevana women

చిన్నప్పటి ఎన్నో తీపి గుర్తులు కాలగర్భంలో కలిసిపోతాయి. బాల్యం చూసిన మరెన్నో జ్ఞాపకాలు మది లోతుల్లో మరుగునపడతాయి. ఎప్పుడో ఒకప్పుడు.. ఏదో ఒక సందర్భంలో ఆ గుర్తులో.. ఆ జ్ఞాపకాలో పలకరిస్తే.. వాటి చుట్టూనే మన జీవితం అల్లుకోగలమా? అలా ఎంతమందికి సాధ్యమవుతుంది? అయితే బీహార్‌కి చెందిన నమితా ఆజాద్‌ గురించి తెలుసుకుందాం. చిన్నతనంలో తను చూసిన ‘కన్యాపుత్రి’ అనే చేతితో తయారుచేసే అందమైన బొమ్మల సాంప్రదాయం అనుకోకుండా ఆమె జీవితంలో మరొక్కసారి తారసపడింది. విధి నిర్వహణలో భాగంగా కళారూపాల శిక్షణలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆమె ఈసారి తన బాల్య గుర్తులకు ఆధునిక సొగసులద్ది, కళను విస్తృత పరచటమే కాక, ఆదాయ మార్గంగా మలుచుకుంటున్నారు.

బీహార్‌ చంపారన్‌ జిల్లా మంఝిరియా గ్రామంలో నజీమా బాల్యం గడిచింది. అప్పుడు తన ఇంటి చుట్టుపక్కల వాళ్లందరూ ‘కన్యాపుత్రి’ బొమ్మల రూపకల్పన చేసేవారు. ‘అమ్మాయిలు, అమ్మలు, అమ్మమ్మలు ఇలా ఇంట్లో ఉన్న ఆడవాళ్లందరూ తయారుచేసేవారు. మా ఇంట్లో కూడా అదే వాతావరణం ఉండేది. అయితే ఇవన్నీ విక్రయించే బొమ్మలు కాదు. ఓ సాంప్రదాయం కోసం వాటిని తయారుచేసేవారు’ అని ఈ బొమ్మల కథేంటో చెబుతున్నారు నజీమా.

‘కన్యాపుత్రి’ వెనుక కథ ఏంటంటే..’

అక్కడ ప్రతి వర్షాకాలం దర్జీల వద్ద వృధాగా ఉన్న దుస్తుల పీలికలను సేకరించి వాటితో అందమైన బొమ్మలు తయారు చేయడం ఆనవాయితీ. సోదరుల కోసం సోదరీమణులు తయారుచేసిన ఈ బొమ్మలను ఆ తరువాత, దగ్గర్లోని చెరువులో ముంచేవారు. అక్కడే ఉన్న సోదరులు ఆ బొమ్మలను తీసుకుని తిరిగి సోదరీమణులకు ఇవ్వడం సాంప్రదాయం. బొమ్మ తెచ్చినందుకు కృతజ్ఞతగా సోదరీసోదరులు ఒకరికొకరు మిఠాయిలు పంచుకునేవారు. ఇది అన్నాచెల్లెళ్ల అనుబంధానికి గుర్తుగా చేసేవారు. ఆ తరువాత ఈ బొమ్మలు వివాహ సమయంలో కూడా ప్రత్యేకంగా నిలిచేవి. నా చిన్నప్పుడు మా ఇంటికి వచ్చిన కొత్తకోడలు తనతో పాటు ఈ బొమ్మలను తీసుకురావడం నాకు బాగా గుర్తు’ అని నజీమా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.గ్రామంలో ఇలా ఎన్నో మధుర జ్ఞాపకాలను భద్రపరచుకున్న నజీమా తండ్రి ఉద్యోగరీత్యా కొన్నేళ్లకు గ్రామం విడిచారు. తన విద్యాభ్యాసమంతా నగరంలోనే సాగింది. అయితే చిన్నతనంలో కళల పట్ల ఏర్పడిన మక్కువతో ఎంఎ సైకాలజీ చేసిన నజీమా, ఛండీగఢ్‌ ప్రాచీన కళా కేంద్రంలో ఆర్ట్స్‌, క్రాఫ్ట్స్‌లో మాస్టర్‌ చేశారు.

ఆ బొమ్మల కోసం నా కళ్లు వెతికేవి..

చదువు, ఉద్యోగ బాధ్యతల్లో తలమునకలై ఉన్న నజీమా తన చుట్టూ పెరిగిపోతున్న ప్లాస్టిక్‌ బొమ్మల మధ్య ‘కన్యాపుత్రి’ బొమ్మల ఆనవాళ్లు కోసం వెతికేవారు. బంధువుల ఇళ్లు, పెళ్లిళ్లలో ఆ బొమ్మల రూపాల కోసం ఆమె కళ్లు చూసేవి. ‘ఎక్కడా ఆ ఆనవాళ్లు కనిపించలేదు. సాంప్రదాయం కనుమరుగైపోయిందని భావించాను. ఉద్యోగరీత్యా బొమ్మల రూపంలో పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాలో టీచర్లకు శిక్షణ ఇచ్చేదాన్ని. ఒకసారి కుటుంబం, బంధాలు, పాఠం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ కన్యాపుత్రి బొమ్మలతో ఎలా చెప్పవచ్చో ఆలోచించాను. అమ్మ సాయంతో వాటిని తయారుచేశాను. అవి ఎంతోమందికి నచ్చాయి. వాటిని తయారుచేయడం నేర్పించమని టీచర్లు అడిగేవారు. అలా 2013లో ఈ బొమ్మలను నేర్చుకునేందుకు ఓ టీచర్‌ ముందుకు వచ్చారు. ఆమె ఆసక్తి చూసి నేను కూడా ఉద్యోగాన్ని వదిలేసి పూర్తికాలం బొమ్మల రూపకల్పనలో మునిగిపోయాను’ అని తన ప్రయాణం గురించి చెప్పారు నజీమా.

‘క్రాఫ్ట్స్‌ ఎన్‌ క్రియేషన్స్‌’ రూపకల్పన

పాట్నా కేంద్రంగా ‘క్రాఫ్ట్స్‌ ఎన్‌ క్రియేషన్స్‌’ ప్రారంభించిన నజీమా, ఆమె బృందం తయారుచేసిన ఈ కళారూపాలు ఇప్పుడు చంపారక్‌ జిల్లాలోనే కాదు దేశ నలుమూలలకు వ్యాప్తి చెందాయి. ఇద్దరితో ప్రారంభమైన ఈ బొమ్మల కేంద్రంలో ఇప్పుడు పదుల సంఖ్యలో ఉన్నారు. వారంతా మహిళలే. చేతితో తయారుచేసే ఈ కళారూపాలను వివిధ ఆకృతులలోనే కాక, సమాజానికి సందేశం ఇచ్చేలా తయారుచేయడంలో నజీమా విజయం సాధిస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలు, అన్నాచెల్లెళ్లు, గర్భిణీలకు, పిల్లలకు పోషాకాహారం ఆవశ్యకత, జంతువులు, పక్షులు, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు వంటి నజీమా తయారుచేసిన బొమ్మలు రాష్ట్రంలో ఆమెను ప్రత్యేక వ్యక్తిగా నిలిపాయి. రూ.100 నుండి రూ.5000 వరకు పలికే ఈ బొమ్మల ధర అందరికీ అందుబాటులో ఉండడంతో, ప్రభుత్వ సంస్థలు, ఎగ్జిబిషన్లలో ఈ కళారూపాలకు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ కృషికి గాను ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం బీహార్‌ హ్యాండ్‌క్రాఫ్ట్‌ అవార్డుతో ఆమెను సత్కరించింది. ‘కన్యాపుత్రి’ బొమ్మలే కాదు.. అమ్మలు, అమ్మమ్మల నుండి నేర్చుకున్న నైపుణ్యాలతో మనం ఎన్నో కొత్త విషయాలను రూపొందించవచ్చు. వాటిద్వారా ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఇదే అంశంపై రాష్ట్రంలో నేను పలు శిక్షణా శిబిరాలను నిర్వహించాలని లక్ష్యం పెట్టుకున్నాను’ అంటున్న నజీమా లాంటి వారు ఎంతోమందికి ఆదర్శం.

అందమైన జ్ఞాపకమే ఆదాయమైంది...

➡️