అసాంజె అప్పగింతపై తీర్పు వాయిదా

Feb 23,2024 10:56 #Assange, #international

లండన్‌ : గూఢచర్యం ఆరోపణలపై వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజెను అమెరికాకు అప్పగించడంపై బ్రిటన్‌ హైకోర్టులో రెండు రోజుల పాటు జరిగిన వాదనలు బుధవారంతో పూర్తయ్యాయి. అయితే, దీనిపై తాము తర్వాత నిర్ణయం వెలువరిస్తామని న్యాయమూర్తులు తెలిపారు. అమెరికా రక్షణ సమాచారాన్ని బహిర్గతం చేశాడనే ఆరోపణలపై అసాంజెను విచారిస్తున్నారు. 2019 నుండి లండన్‌లోని బెల్మార్ష్‌ జైల్లో అసాంజె శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే అసాంజె స్వంత దేశమైన ఆస్ట్రేలియాకు బదిలీ చేయడానికి అనుమతించాలని, ఆయనకు విధించే జైలు శిక్షను అక్కడ అనుభవిస్తారని అమెరికా తరపు న్యాయవాదులు చెప్పారు. అమెరికా అప్రజాస్వామిక వైఖరిని అసాంజె తరపు న్యాయవాది ఎడ్వర్డ్‌ ఫిట్జ్‌ గెరాల్డ్‌ సమర్థవంతంగా ఎండగట్టారు.వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు అసాంజె ఒక బాధ్యతాయుత జర్నలిస్టుగా వ్యవహరించి అమెరికా యుద్ధ నేరాలు, మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన పత్రాలను బయటపెట్టారని, దీనిని గూఢచర్యంగా చిత్రించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. అసాంజెను వెంటాడి వేధించాలన్న రాజకీయ దురుద్దేశంతోనే అమెరికా దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. ఈ వాద ప్రతివాదనలు విన్న న్యాయమూర్తి తన తీర్పును రిజర్వులో ఉంచుతున్నానని చెప్పారు. తీర్పు ఎప్పుడు వెల్లడించేది నిర్ధిష్టంగా ఎలాంటి తేదీని వెల్లడించలేదు. అసాంజెను అమెరికాకు అప్పగించేందుకు 2022లో బ్రిటన్‌్‌ ప్రభుత్వం ఒప్పుకుంది. దీనిని అసాంజె బ్రిటన్‌ కోర్టులో సవాల్‌ చేశారు.

➡️