కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి

Nov 25,2023 15:38 #Guntur District

జొన్న శివశంకరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు..
మహాధర్నా జయప్రదంకు కార్మిక, కర్షక బైకు ర్యాలీ….
ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : రైతాంగ, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న, బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 27, 28 తేదీలలో విజయవాడలో జరుగు మహాధర్నాను జయప్రదం చేయాలని, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు అన్నారు. శనివారం ఎం టి ఎం సి పరిధిలోని తాడేపల్లి, కుంచనపల్లి, వడ్డేశ్వరం, కొలనుకొండ గ్రామాలలో రైతు, కార్మిక,కౌలు రైతు సంఘాల నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొలనుకొండ గ్రామంలో మహా ధర్నా జయప్రదం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు ప్రసంగించారు. దేశానికి పెనుముప్పుగా మారిన బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వాన, కేంద్రంలో అధికారంలోకి వచ్చి, రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతుందని, దేశ సంపదను ప్రైవేట్ కంపెనీలకు దోచిపెడుతుందని ఆయన దుయ్యబట్టారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు బిజెపి ప్రభుత్వం మూడు నల్ల చట్టాలు తీసుకువచ్చిందని, దేశవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున మహా ఉద్యమం చేసి, నల్ల చట్టాలు వెనక్కి తీసుకునేలా పోరాటం చేశారన్నారు. అదేవిధంగా కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను, నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చిందని ఆయన అన్నారు. కార్మికుల పొట్ట కొట్టే, యాజమాన్యానికి లాభం చేకూర్చే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిరంకుశ నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అనేక రైతు సంఘాలు, కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారని ఆయన అన్నారు. అదేవిధంగా బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి అన్నారు. తద్వారా నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి, సామాన్యుడిపై అధిక బారాలు పడ్డాయని ఆయన అన్నారు. వ్యవసాయ రంగాన్ని దివాలా తీసే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అదేవిధంగా విద్యుత్ చట్ట సంస్కరణలు తీసుకువచ్చి, వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్ల పెట్టే ప్రక్రియ మొదలుపెట్టడం దుర్మార్గమని ఆయన అన్నారు. ఈ విధానం వలన రైతాంగం పూర్తిగా నష్టపోయే పరిస్థితి దాపురించిందన్నారు. అంతేకాకుండా గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించి, ఉపాధి హామీ పథకాన్ని పేదలకు దూరం చేసేందుకు బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. తక్షణమే ఉపాధి హామీ పథకం పని దినాలను 200 రోజులకు పెంచి, కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు, రైతులు, కౌలు రైతులు, కార్మికులు సామాన్య మధ్యతరగతి ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఈనెల 27, 28 తేదీలలో విజయవాడలోని జింఖానా గ్రౌండ్ లో కార్మిక, కర్షక ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరుగు మహా ధర్నాలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రచార బైకు ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తాడేపల్లి మండల నాయకులు దొంతి రెడ్డి వెంకటరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తాడేపల్లి మండల అధ్యక్షులు మోదుగుల శ్రీనివాసరెడ్డి, సిఐటియు తాడేపల్లి పట్టణ నాయకులు బూరగ వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం తాడేపల్లి మండల కార్యదర్శి పల్లె కృష్ణ, ఏఐటీయూసీ నాయకులు తుడిమెళ్ళ వెంకటయ్య, గుంటక సాంబిరెడ్డి, మానికొండ డాంగే, సిఐటియు నాయకులు బి దశరథరామిరెడ్డి, రైతు సంఘం తాడేపల్లి పట్టణ నాయకులు గోపాల రెడ్డి, దొంతి రెడ్డి బుల్లికోటిరెడ్డి, రాజధాని రైతు సంఘం నాయకులు ఎస్కే ఎర్ర ఫీర్, తక్కెళ్ళ పాటి భక్కి రెడ్డి, రైతు సంఘం తాడేపల్లి మండల నాయకులు డోకిపర్తి రాజేంద్ర బాబు, బొప్పన గోపాలరావు, కౌలు రైతు సంఘం నాయకులు పి. సుబ్బారావు, రైతు సంఘం నాయకులు కాట్రగడ్డ శివరామకృష్ణయ్య, కాట్రగడ్డ శివన్నారాయణ, సిఐటియు నాయకులు నీరుడు దుర్గారావు, వై బర్నబాస్, తదితరులు పాల్గొన్నారు.

➡️