బకాయిల కోసం పోరు 

Feb 15,2024 09:08 #Employees, #Protest, #Teachers
Job and teacher protests across the state
  • నల్లబ్యాడ్జీలతో నిరసన
  • 30 శాతం ఐఆర్‌ తక్షణమే చెల్లించాలి
  • రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసనలు

ప్రజాశక్తి – యంత్రాంగం : 30 శాతం ఫిట్‌మెంట్‌తో 12వ పిఆర్‌సి ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న డిఎ బకాయిలు చెల్లించాలని, జిపిఎస్‌, సిపిఎస్‌ రద్దుచేసి ఒపిఎస్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర జెఎసి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రూ.20వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని నినాదాలు చేశారు. టీచర్ల అప్రెంటిస్‌ విధానం రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.

కడపలో ఎపి జెఎసి రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ హృదయరాజు మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా 30 శాతం ఐఆర్‌ ప్రకటించాలని, ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ.20 వేల కోట్ల ఆర్థిక బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 25న జిల్లా స్థాయిల్లో ర్యాలీలు, ధర్నాలు పెద్ద ఎత్తున చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులను కోరారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే 27న రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. బద్వేలులో నిరసన తెలిపారు. ఎస్‌టియు రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు సి.రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం జిల్లా జెఎసి చైర్మన్‌ విద్యాసాగర్‌ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయ పరిపాలన అధికారి నాగలక్ష్మికి వినతిపత్రాన్ని అందజేశారు. కృష్ణాజిల్లా గన్నవరం, చల్లపల్లి మండలాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. చిత్తూరులోని చంద్రగిరి, రామచంద్రపురం తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జెఎసి నాయకులు మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న రెండు కొత్త డిఎలు తక్షణమే విడుదల చేయాలని, టీచర్ల అప్రెంటిస్‌ విధానం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

విజయనగరం జిల్లాలోని భోగాపురం, నెల్లిమర్ల, బొబ్బిలిలో నిరసన తెలిపారు. బొబ్బిలిలో ఆర్‌డిఒకు వినతిపత్రం అందజేశారు. విశాఖ కలెక్టరేట్‌ వద్ద ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. భీమిలిలోనూ నిరసన తెలిపి ఆర్‌డిఒకు, తహశీల్దార్‌కు వినతిపత్రాలు సమర్పించారు. అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లోనూ నిరసనలు కొనసాగాయి. కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు, డోన్‌, ఆళ్లగడ్డలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు నిరసన తెలిపారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో మున్సిపల్‌, మండల కేంద్రాల్లో జెఎసి నేతలు తహశీల్దార్‌ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు.

➡️