జైల్‌భరో విజయవంతం

Jan 10,2024 08:26 #Jail Bharo, #Krishna district, #tension

– కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపాలి

– రాష్ట్రవ్యాప్తంగా పలువురి అరెస్టు, విడుదల

ప్రజాశక్తి – యంత్రాంగం:రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమ్మెపై ఎస్మా విధించడాన్ని వ్యతిరేకిస్తూ, మున్సిపల్‌ కార్మికులు, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలకు పరిష్కారం చూపాలని కోరుతూ కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జైల్‌ భరో నిర్వహించారు. ‘చాలీచాలని జీతాలతో ఎన్నాళ్లని అప్పుచేసి, వడ్డీలు కట్టుకుంటూ బతుకు జీవనం సాగించాలి.. మా వల్ల కాదు.. మీరు ఇచ్చిన హామీ మేరకు జీతాలైనా పెంచండి.. లేదంటే జైల్లోనైనా పెట్టండి’ అంటూ కార్మిక సంఘాలన్నీ ఏకతాటిపైకొచ్చి మంగళవారం ఈ కార్యక్రమం చేపట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది నాయకులను, అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం విడుదల చేశారు.విజయవాడ లెనిన్‌ సెంటర్‌కు చేరుకున్న కార్మిక, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. నాయకులను బలవంతంగా అరెస్టు చేసి వ్యాన్లలో ఎక్కించారు. అంతకముందు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఎస్మా ప్రయోగించడం సరైందికాదని, నాయకులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడుతూ.. అంగన్‌వాడీలపై ఎస్మాను ప్రయోగించడం సాధ్యం కాదని, అయినా ప్రభుత్వం తెలివి తక్కువ తనంతో విడుదల చేసిందని పేర్కొన్నారు. ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు మాట్లాడుతూ.. ఎందుకు ఎస్మా ప్రయోగించారో కూడా అధికారులకు తెలియదని, కేవలం బెదిరించడం కోసమే ఇలాంటి చర్యలకు దిగుతోందని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కార్మికవర్గంపై దాడిగా ఎస్మాను అభివర్ణించారు. ఐఎఫ్‌టియు రాష్ట్ర నాయకులు ప్రసాద్‌ మాట్లాడుతూ.. సమ్మెలో ఉన్నవారితో చర్చించి సమస్యను పరిష్కరించుకోవాల్సింది పోయి ‘ఎస్మా ప్రయోగిస్తాం, అరెస్టులు చేస్తాం’ అంటే అది ప్రజాస్వామ్యం కాదని తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, వృత్తిదారుల నాయకులు ఎం భాస్కరయ్య, సిఐటియు నాయకులు అజరుకుమార్‌, కమల, ఐద్వా నాయకులు గాదె ఆదిలక్ష్మి, ఐఎఫ్‌టియు నాయకులు రవిచంద్ర పాల్గన్నారు.ఏలూరులో సమ్మె శిబిరం వద్ద ఉభయగోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మద్దతునిచ్చి మాట్లాడారు. సమస్యల పరిష్కారమయ్యే వరకూ పోరాడాలని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలుగా తామంతా సంపూర్ణ మద్దతిస్తున్నామని, చివర వరకూ తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. సిపిఎం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం పాల్గని సంఘీభావం ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆర్‌డిఒ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఆర్‌డిఒ శ్రీనివాసరాజులును కార్యాలయంలోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆర్‌డిఒ వెనుదిరిగారు. ర్రరర అదీంతో పోలీసులు రంగంలోకి దిగి పలువురి నాయకులను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించడంతో కార్మికులంతా స్టేషన్‌ వద్ద ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు అరెస్ట్‌ చేసిన నేతలను విడుదల చేశారు.విశాఖపట్నం ఎల్‌ఐసి కార్యాలయ సమీపంలోని బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీగా బయలుదేరారు. బాటా జంక్షన్‌ వద్ద వందలాది మంది పోలీసులు మోహరించి సుమారు 300 మంది కార్మిక సంఘాల నాయకులను అరెస్టు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగిలో అంగన్‌వాడీలందరూ స్వచ్ఛందంగా అరెస్టయి పోలీసు స్టేషన్‌ వద్ద నిరసన తెలిపారు. తిరుపతి జిల్లావ్యాప్తంగా 2,800 మందిని అరెస్టు చేసి, అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు.పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పోలీసుస్టేషన్‌ లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరు, ఒంగోలులో అంగన్‌వాడీలను, నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. నెల్లూరులో గాంధీబమ్మ సెంటర్‌ నుంచి విఆర్‌సి సెంటర్‌ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. కాకినాడలో జైల్‌భరో, తూర్పుగోదావరి రాజమహేంద్రవరంలో రాస్తారోకో, కోనసీమ జిల్లా అమలాపురంలో కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాలను నిర్వహించారు. కాకినాడలో 16 మంది సిపిఎం, సిఐటియు, ఇతర ప్రజాసంఘాల నాయకులు అరెస్టు చేసి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాజమహేంద్రవరంలో రాస్తారోకోకు హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు.అమలాపురంలో కలెక్టరేట్‌ ముట్టడిలో వందలాది మంది అంగన్‌వాడీలు పాల్గన్నారు. శ్రీకాకుళం, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో కార్మికసంఘం నాయకులను అరెస్టు చేశారు. కర్నూలులో ఎపిరైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్‌రెడ్డి, తదితరులను అరెస్టు చేశారు. అనంతరం విడుదల చేశారు. వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లోని ఐసిడిఎస్‌, తహశీల్దార్‌, ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట బైటాయించి నిరసన కొనసాగించారుఅంగన్‌డీ కార్యకర్తకు అస్వస్థతఏలూరు స్థానిక ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌లో బైఠాయించి నిరసన తెలియజేస్తున్న సమయంలో ఏలూరు సత్యన్నారాయణ కాలనీకి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త బేబీ చిన్నారి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.మీ మద్దతు మాకొద్దుప్రకాశం జిల్లా గిద్దలూరులో సమ్మె శిబిరానికి బిజెపి నాయకులు రాగా ఒక్కసారిగా అంగన్‌వాడీలు ‘బిజెపి నాయకులారా.. మీ మద్దతు మాకు వద్దు’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ‘మాకు ఏమీ చెప్పవద్దు.. మేము వినం’ అంటూ వెనక్కు తిరిగి చెవులు మూసుకున్నారు. దీంతో బిజెపి నాయకులుసమ్మె శిబిరం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.విధులకు హాజరుకాకుంటే షోకాజ్‌ నోటీసులువిధులకు హాజరుకాకుంటే షోకాజ్‌ నోటీసులు ఇస్తామని కంభం ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ సమ్మెలో ఉన్న అంగన్‌వాడీలకు మంగళవారం ఫోన్‌ చేశారు. తమకు జీతాలు పెంచే వరకు విధులకు హాజరుకాబోమంటూ అంగన్‌వాడీలు తేల్చి చెప్పారు.

 

➡️