కర్షక, కార్మిక విశాల ఐక్యతను చాటిన ఘట్టం

Dec 6,2023 07:18 #Editorial

త్యంత ఉత్తేజభరితంగా గత నెల 27, 28 తేదీల్లో విజయవాడ లోని జింఖానా మైదానంలో జరిగిన కార్మిక, కర్షక మహా ధర్నా…రాష్ట్ర రైతాంగ ఉద్యమ చరిత్రలో ఒక నూతన పుటను ఆవిష్కరింపచేసింది. కార్మిక, కర్షక విశాల ఐక్యతను చాటిచెప్పింది. ఇదో చారిత్రక ఘట్టంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రం నలుమూలల నుంచి కార్మిక, కర్షక సమూహాలు, ముఖ్యంగా రైతు, కార్మిక మహిళలు చంటి బిడ్డలను చంకలో వేసుకొని మహా ధర్నాకు హాజరవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. భారత రాజ్యాంగానికీ, రాజ్య వ్యవస్థలకూ, కార్మిక, కర్షకులు సాధించుకున్న చట్టాలకూ, ప్రజాస్వామ్య పద్ధతులకూ తిలోదకాలిస్తున్న నరేంద్ర మోడీని గద్దె దించాలని ధర్నా ఘంటాపథంగా నిర్ణయించింది. 20 లక్షల మంది కార్మికులు ప్రతి ఏటా రూ.2 లక్షల కోట్ల మిగులును సాధిస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలను తక్కువ ధరలకే అమ్మివేయబూనడాన్ని ధర్నా తీవ్రంగా వ్యతిరేకించింది. ‘ది వైర్‌’, ‘న్యూస్‌ క్లిక్‌’ మీడియాపై అప్రజాస్వామికంగా దాడి చేసి ప్రబీర్‌ పుర్కాయస్థ సహా ముఖ్య పాత్రికేయులను అరెస్టు చేసి ఆ సంస్థలను మూసివేయడం మోడీ ప్రభుత్వం నియంతృత్వానికి ప్రబల నిదర్శనమని పేర్కొన్నది.

వ్యవసాయ రంగానికి ఎంతో సేవ చేసిన భారత ముద్దుబిడ్డ ప్రొఫెసర్‌ ఎం.ఎస్‌. స్వామినాథన్‌కు, అఖిల భారత రైతాంగ నాయకుడు శంకరయ్యకు, రైతు పక్షపాతి, ఇంజినీరు వీరయ్య చౌదరికి ధర్నా ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది. భారత వ్యవసాయాన్ని నాశనం చేసే మూడు నల్ల చట్టాలపై ప్రతిఘటనోద్యమంలో నాలుగు వేల మందిపై కేసులు బనాయించి..750 మంది రైతుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ఉపసంహరింప చేసి..మోడీ మెడలు వంచి రైతాంగానికీ, దేశ ప్రజలకూ క్షమాపణ చెప్పించి ఎంతో ఉత్తేజాన్నిచ్చిన నాటి రైతు ఉద్యమానికి జేజేలు పలికింది.

అన్ని వ్యవసాయ పంటలకూ కనీస మద్దతు ధరల చట్టం చేయాలన్నది రైతాంగ ప్రధాన నినాదంగా ముందుకు వచ్చింది. పెరిగే ధరలకు మోడీ ప్రభుత్వం ఊతమిస్తున్నది. కేరళ తరహాలో 14 రకాల నిత్యావసర సరకులను రాయితీపై చౌక డిపోల్లో అందుబాటులోకి తీసుకురావాలని మహా ధర్నా కోరింది. ఇలాంటి పోరాటాల్లోకి తాము కూడా వస్తామని ఉపాధ్యాయులు, పాత్రికేయులు, ప్రభుత్వోద్యోగులు మహా ధర్నా ప్రాంగణానికి వచ్చి సంఘీభావం తెలియజేశారు. ఉద్యోగ వర్గాలకు కొత్తవి సాధించడం కాదు! ఉన్న సౌకర్యాలు పోకుండా వాటిని నిలబెట్టుకోవడం పెద్ద పోరాటంగా ఉందని ప్రకటించారు.

ప్రభుత్వాలు వ్యవసాయానికి ప్రాణప్రదమైన నీటిని అందించలేకపోతున్నాయి. జూన్‌ నుంచి అక్టోబరు వరకూ నాలుగు నెలల్లోనే 2600 టిఎంసిల నీళ్లు కృష్ణా, గోదావరి నదుల నుంచి సముద్రంలో కలిసిపోగా పోలవరం పడిగాపులు కాస్తోంది. 400 వరకూ చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తి చేస్తారని మెట్ట ప్రాంత పొలాలు నోళ్లు తెరిచి అడుగుతున్నాయి. గోదావరి నీరు సముద్రంలో కలిసే గాడిమొక దగ్గర బయటకు తీస్తున్న ప్రకృతి సహజ వనరులైన గ్యాస్‌, పెట్రోలియంలను రిలయన్స్‌ గుజరాత్‌కు తరలిస్తున్నది. ఆ కంపెనీ సంవత్సరానికి సుమారు రూ.2 లక్షల కోట్లను మూటకట్టకుంటోంది. దాన్ని ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఉపయోగించాలని మహా ధర్నా డిమాండ్‌ చేసింది.

అమరావతి రాజధాని ఆగమైపోయింది. దీనికి బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది. కేంద్రం చేస్తానన్న సాయం రూ.1500 కోట్ల దగ్గరే నిలిచిపోయింది. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి మూడు రాజధానుల సిద్ధాంతంతో ఆంధ్ర విస్తుపోయింది. ఆంధ్రప్రదేశ్‌ ఇల్లు లేని కుటుంబంలా రాజధాని లేని రాష్ట్రం అయ్యింది. దీంతో పెట్టుబడులన్నీ ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి.

రాష్ట్ర విభజన హామీలు ఏవీ అమలు కాలేదు. అభివృద్ధి ఆగిపోయింది. ప్రత్యేక హోదా గాలికిపోయింది. దీనికి కేంద్ర నిర్లక్ష్య వైఖరే కారణం. రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనం. చివరికి నష్టపోయింది ఆంధ్ర ప్రజలు. పారిశ్రామిక రంగం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. వేలాది చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. లక్షలాది కార్మికులకు కనీస వేతనాలు పెంచలేదు. నిరంతరం పెరుగుతున్న విద్యుత్తు ఛార్జీలు, స్మార్ట్‌ మీటర్ల బిగింపు, విద్యుత్‌ వ్యవస్థను ప్రైవేటీకరించడం ప్రజలకు పెనుభారం కానున్నది.

ఇసుక ద్వారా, మద్యం ద్వారా వచ్చే ఆదాయం ప్రభుత్వ ఖజానాకు గాక ప్రయివేటు వ్యక్తుల జేబుల్లోకి చేరుతోంది. అందుకే ప్రభుత్వ అప్పు రూ.10 లక్షల కోట్లు దాటింది. కేంద్ర ప్రభుత్వ అప్పు రూ.150 లక్షల కోట్లు అయ్యింది. ప్రభుత్వం ఈ దోపిడీ పద్ధతిని కాపాడుకోవడానికి, ప్రజల ఆగ్రహాన్ని కట్టడి చేయడానికి అప్రజాస్వామిక పోలీసు విధానం అమలు చేస్తున్నది. కార్మికులు, రైతులు, మధ్య తరగతి, మైనారిటీల హక్కులను కాపాడుకోవాలన్నా అందరూ కలిసి విశాల ఐక్యతను నిర్మించుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఓడించడానికి ఉద్యమాలు ఉధృతం చేయాలని మహా ధర్నాలో వక్తలు పిలుపునిచ్చారు. రెండు రోజులపాటు జరిగిన ఈ మహా ధర్నా రానున్న ఉద్యమాలకు గొప్ప స్ఫూర్తిని అందించింది.

(వ్యాస రచయిత ఎ.పి రైతు సంఘం అధ్యక్షులు)వి. కృష్ణయ్య
(వ్యాస రచయిత ఎ.పి రైతు సంఘం అధ్యక్షులు)వి. కృష్ణయ్య
➡️