ఐటి నోటీసులపై బలవంతపు చర్యలు ఆపండి

  •  సిఇసికి సీతారాం ఏచూరి లేఖ

న్యూఢిల్లీ : త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను దెబ్బతీయాలన్న దుష్ట తలంపుతో సిపిఎం త్రిస్సూర్‌ జిల్లా కమిటీ బ్యాంక్‌ ఖాతాను స్తంభింపచేశారని, కాబట్టి ఎన్నికలయ్యేవరకు ఎలాంటి బలవంతపు చర్యలకు పాల్పడకుండా ఇసిని నిరోధించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సిపిఐ(ఎం) విజ్ఞప్తి చేసింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సోమవారం నాడు ఈ మేరకు ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు ఒక లేఖ రాశారు. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు అభ్యంతరకరమైన ఈ ఆదేశాలను నిలుపుచేసేలా ఐటి అధికారులను ఆదేశించాలని ఆయన ఆ లేఖలో కోరారు. రాజ్యాంగంలోని 324 అధికరణ కింద ఎన్నికల కమిషన్‌కు కల్పించిన అధికారాలను ఇందుకోసం వినియోగించాల్సిందిగా కోరారు. కేంద్ర సంస్థ చర్యలను ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకువస్తూ ఇటీవల కాలంలో లేఖ రాయడం ఇదే మొదటిసారని ఆయన పేర్కొన్నారు. త్రిస్సూర్‌ జిల్లా కమిటీ ఖాతాను స్తంభింపజేయడం పూర్తిగా అక్రమం, గర్హనీయమని ఏచూరి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పార్టీ అన్ని శాఖల ఖాతాలతోపాటు ఈ శాఖ ఖాతా వివరాలను కూడా ఇప్పటికే చట్టానికి అనుగుణంగా ఐటి శాఖకు, ఎన్నికల కమిషన్‌కు అందజేశామని, అవి వారి వెబ్‌సైట్‌ల్లో కనిపిస్తున్నాయని ఏచూరి గుర్తు చేశారు.
ఏడాది కాలంగా వీటిపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని చెప్పారు. పైగా పన్నుల చట్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తుందన్న రికార్డు సిపిఎంకు వుందంటూ గతంలో అనేకసార్లు ఐటి అథారిటీ ప్రశంసించిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేశారు. ఎన్నికల కమిషన్‌కు గతంలో అందచేసిన వివరాలే ఇవని అన్నారు. ఏ చట్టమూ పేర్కొనకపోయినా, అవసరం లేకపోయినా ప్రజా జీవితంలో నిజాయితీగా ఉండాలన్న ఉద్దేశంతో సిపిఎం ఈ వివరాలను తన వెబ్‌సైట్‌లో పెడుతోందని చెప్పారు.
కేరళలో సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్‌కు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే ఈ చర్య తీసుకుందని ఏచూరి తన లేఖలో ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు ఏ బ్యాంక్‌ ఖాతాల స్తంభన ఉండబోదని ఇంతకుముందే ఇటువంటి ఓ కేసులో ఐటి అథారిటీ సుప్రీంకోర్టుకు తెలియజేసిందని అన్నారు. ఇటువంటి ఆక్షేపణీయమైన చర్య చేపట్టడానికి ముందు ఇసి అనుమతి కోసం ఐటి అథారిటీ సంప్రదించిందా లేదా అన్నది తమకు తెలియదని ఏచూరి ఆ లేఖలో పేర్కొన్నారు.
ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించి, ఎన్నికల నిబంధనావళి కూడా అమల్లోకి వచ్చేసినందున, ఐటి అథారిటీ తీసుకున్న ఈ చర్య స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు నిర్వహించాలన్న లక్ష్యాన్ని, అన్ని పార్టీలకు గల సమాన అవకాశాలు కల్పించాలన్న ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం కాదా అని ప్రశ్నించారు. త్రిస్సూర్‌ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి బిజెపి పోటీ చేయడం కేవలం యాదృచ్ఛికమేనా? అని ఆయన ఆ లేఖలో ప్రశ్నించారు.

 

➡️