సాగునీటి ఎద్దడిపై ఇరిగేషన్‌ ఎఇ నిర్బంధం

Jan 23,2024 10:51 #Irrigation Projects, #Konaseema

ప్రజాశక్తి- ఉప్పలగుప్తం (డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా) :పంట కాలువను పరిశీలించేందుకు సోమవారం వచ్చిన ఇరిగేషన్‌ ఎఇని తీవ్ర సాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్న రైతులు నిర్బంధించారు. డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం వాడపర్రు పంట కాలువ శివారు కూనవరం టైలెండ్‌ ప్రాంతంలో పంట కాలువకు సాగునీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూనవరం ప్రాంతంలో పంట కాలువపై సుమారు 500 ఎకరాల వరకు వరి సాగవుతోంది. నారుమళ్లు వేసిన నాటి నుంచి సాగు నీరు సక్రమంగా అందకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం నాట్లు వేసేందుకు చేలను సిద్ధం చేసినా సాగు నీరు అందకపోవడంతో నాట్లు వేయలేకపోయామని రైతులు వాపోతున్నారు. ఈ సమయంలో ఇరిగేషన్‌ ఎఇ శివరామకృష్ణ పంట కాలువను పరిశీలించేందుకు వచ్చారు. దీంతో, ఆయనను రైతులు చుట్టుముట్టి నిర్బంధించారు. సాగునీటి ఎద్దడి ఇబ్బందులపై అనేకసార్లు ఫోన్‌ చేసి తెలిపినా ఎందుకు పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట కాలువలో పూడిక తొలగించే పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించామని, నెల రోజులుగా తాను కాంట్రాక్టర్‌ను పూడిక తొలగించాలంటూ కోరుతున్నానని రైతులకు ఎఒ నచ్చజెప్పారు. సుమారు 14 కిలోమీటర్లు పొడవు ఉన్న పంట కాలువ ఎగువ భాగంలో పూడిక తీత పనులు ప్రారంభమై ఇప్పటివరకు నాలుగు కిలోమీటర్ల మేర పూడిక తొలగించారని చెప్పారు. మరికొద్ది రోజుల్లో కూనవరం శివారు ప్రాంతంలో కూడా పూడికతీత పనులు జరుగుతాయన్నారు. దీనిపై రైతులు స్పందిస్తూ, ఇప్పటికే నారుమళ్లు ఎండిపోయి నాట్లు వేసే చేలు బీటలువారి పోతున్నాయని, పంట కాలువ శివారు ప్రాంతం నుంచి పూడికతీత పనులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. మూడు రోజుల్లోగా కూనవరం శివారు ప్రాంతానికి సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటానని ఎఇ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.

➡️