MayDay: మేడే సందర్భంగా రచనల పోటీ

విజయవాడ : మేడే సందర్భాన్ని పురస్కరించుకొని వివిధ సాహిత్య ప్రక్రియల్లో రచనల పోటీ నిర్వహిస్తున్నట్టు జాషువా సంస్కృతిక వేదిక తెలిపింది. ఈ మేరకు సోమవారం ఉదయం విజయవాడ బాలోత్సవ్‌ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో సంస్థ బాధ్యులు పోస్టరును విడుదల చేశారు. పోటీ వివరాలను ప్రకటించారు. ఆ ప్రకారం … అభివృద్ధిలో అసమానతలు, దోపిడీ, వివక్ష, సామాజిక సంక్షోభం తదితర అంశాలను ఇతివృత్త కేంద్రంగా తీసుకొని రచయితలు తమ రచనలు పంపవచ్చు. కథలు, కవితలు, పాటలు, వ్యాసాల ప్రక్రియల్లో ఈ పోటీ ఉంటుంది. ఒక్కో విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేలు చొప్పున ఉంటాయి. ప్రతి విభాగంలోనూ రూ.వెయ్యి చొప్పున రెండు ప్రోత్సాహక బహుమతులూ ఉంటాయి. 20.4.2024 లోగా రచనలను ఈమెయిల్‌ ద్వారా మాత్రమే పంపించాలి. ఆ నెలాఖరుకల్లా రచనల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, 5.5.2024 ఆదివారం విజయవాడలో జరిగే సభలో విజేతలకు బహుమతీ ప్రదానం ఉంటుంది. రచనల ఎంపిక పూర్తయిన వెంటనే, బహుమతి పొందిన రచనలతో పాటు ఇంకొన్ని మేలైన రచనలతో మే 5వ తేదీ నాటిక పుస్తకాలు ప్రచురించే ఆలోచన ఉంది. కాబట్టి, రచనలు తప్పకుండా యూనికోడ్లో లేదా పేజీ మేకర్లో తమ రచనలు పంపాలి. ఒక్కో రచయిత/ రచయిత్రి కథ, కవిత, పాట, వ్యాసం … నాలుగు ప్రక్రియల్లోనూ రచనలు పంపొచ్చు. అయితే, ఒక్కో విభాగంలో ఒకటికి మించి రచనలు పంపకూడదు. కథలు, వ్యాసాలూ ఎ4 సైజులో 4, 5 పేజీల వరకూ ఉండొచ్చు. కవితలు, పాటలకు ప్రత్యేకించి నిడివిపై నిబంధన లేనప్పటికీ` కవిత 30 పంక్తులకు అటూ ఇటూగా, పాట ఒక పల్లవి, 4 చరణాలుగా ఉంటే మంచిది. ఏ ప్రాంతంలో నివసిస్తున్న తెలుగు వారైనా, ఈ పోటీల్లో పాల్గొనవొచ్చు.
రచనలు పంపాల్సిన మెయిల్‌ ఐడి : sramikasambaralu24@gmail.com
రచనలు చేరటానికి చివరి తేదీ : 20.4.2024
మీడియా సమావేశంలో సాహితీ స్రవంతి రాష్ట్ర నాయకులు వొరప్రసాద్‌, శాంతిశ్రీ, ఉషారాణి; సాహిత్య ప్రస్థానం వర్కింగ్‌ ఎడిటర్‌ సత్యాజీ, అరసం కార్యదర్శి పరుచూరి అజయ్‌, కవి, రచయిత గడ్డం విజయరావు, కె.లక్ష్మయ్య, జాషువా సాంస్క ృతిక వేదిక బాధ్యులు గుండు నారాయణరావు పాల్గొన్నారు.

➡️