‘క్యాష్‌ ఫర్‌ కిడ్నీ’ కేసులో అపోలోపై విచారణ

Dec 6,2023 10:52 #Kidney

న్యూఢిల్లీ : ‘క్యాష్‌ ఫర్‌ కిడ్నీ’ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిపై విచారణ ప్రారంభమయింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ ఆర్గాన్‌ అండ్‌ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఒటిటిఒ) ఈ విచారణను చేపట్టింది. ఈ మేరకు ఎన్‌ఒటిటిఒ మంగళవారం తెలిపింది. మయన్మార్‌కు చెందిన వ్యక్తులను ప్రలోభాలకు గురి చేసి ‘క్యాష్‌ ఫర్‌ కిడ్నీ’ స్కామ్‌ జరుగుతోందని, ఈ స్కామ్‌లో అపోలో ఆసుపత్రి ప్రమేయం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అపొలోలో ఏడాదికి 1,200 కంటే ఎక్కువగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నాయని ఆ కథనాల్లో పేర్కొన్నారు. ‘మయన్మార్‌ నుండి యువకులను అపోలో ఢిల్లీ ఆసుపత్రికి తరలించి, అక్కడ వారి కిడ్నీలను ధనిక రోగులకు దానం చేయడానికి డబ్బు చెల్లిస్తున్నారు’ మీడియా కథనాల్లో వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎన్‌ఒటిటిఒ విచారణ చేపట్టింది. కాగా తమపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా కల్పితాలని ఇంద్రప్రస్థ అపోలో యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. మీడియా కథనాలను ఇంద్రప్రస్థ మెడికల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఎంసిఎల్‌) కూడా ఖండించింది.

➡️