మంచు గుప్పెట్లో కాశ్మీర్‌ .. మైనస్‌ డిగ్రీలకు ఉష్ణోగ్రతలు

Dec 14,2023 13:28 #cold wave, #Kashmir valley, #Srinagar

 శ్రీనగర్‌ :    జమ్ముకాశ్మీర్‌ మంచు గుప్పెట్లో చిక్కుకుంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు చేరుకున్నాయి. కాశ్మీర్‌ లోయ వ్యాప్తంగా తీవ్రమైన చలిగాలులు వీస్తుండటంతో దాల్ సరస్సు సహా పలు  నదులు  గడ్డకట్టాయి. మంచినీటి పైపులు సైతం గడ్డకట్టడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది.

శ్రీనగర్‌లో బుధవారం రాత్రి కనిష్టంగా మైనస్‌ 5.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని.. దీంతో ఈ సీజన్‌లో అత్యంత శీతల రాత్రిగా నమోదైనట్లు అధికారులు గురువారం తెలిపారు.  మంగళవారం రాత్రి నమోదైన (మైనస్‌ 5.3 డిగ్రీల సెల్సియస్‌) ఉష్ణోగ్రత కన్నా కొంచెం తక్కువని అన్నారు. నగరంలో ఈ శీతాకాలంలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత ఇదేనని అధికారులు తెలిపారు.

అమర్‌నాథ్‌ యాత్రకు బేస్‌ క్యాంప్‌ ప్రాంతమైన దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లా పెహల్గాంలో మైనస్‌ 5.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్‌లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత మైనస్‌ 5 డిగ్రీలుగా రికార్డయినట్లు అధికారులు తెలిపారు. ఖాజిగుండ్‌లో మైనస్‌ 3.8 డిగ్రీల సెల్సియస్‌, కొకెర్‌నాగ్‌ పట్టణంలో మైనస్‌ 1.6 డిగ్రీల సెల్సియస్‌, కుప్వారాలో మైనస్‌ 4.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.    డిసెంబర్‌ 15 వరకు వాతావరణం పొడిగా ఉంటుందని, అయితే వారాంతంలో తేలికపాటి వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

➡️