బీమా సాయం సకాలంలో అందజేయాలి : కలెక్టర్ కృతికాశుక్లా

Feb 27,2024 17:31 #Arogyashri, #collector, #Kakinada

ప్రజాశక్తి-కాకినాడ : రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకం ద్వారా అందిస్తున్న ఆర్థిక సహాయం సకాలంలో లబ్ధిదారులకు అందేలా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, గడువు లోగా దరఖాస్తులను పరిష్కారించాలని కలెక్టర్ డా. కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో వైఎస్సార్ బీమా పథకానికి సంబంధించి క్లైమ్ ల పరిష్కారం పురోగతి, బాధిత కుటుంబ సభ్యులకు మరణం, ఎఫ్ఐఆర్, ఫోరెన్సిస్ సైన్స్ లాబొరేటరీ పోస్టుమార్టం రిపోర్టులు వంటి ఇతర అర్హతలకు సంబంధించిన ధృవపత్రాల జారీలో చోటుచేసుకుంటున్న జాప్యంపై జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ కృతికా శుక్లా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, మున్సిపల్ కార్పొరేషన్, వైద్య ఆరోగ్యం, పోలీస్, జీజీహెచ్, పంచాయతీ శాఖల అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకం కింద ప్రమాదవశాత్తు మరణించిన వారికి రూ.5 లక్షలు, సాధారణ మరణానికి ఒక లక్ష నామినిగా నమోదు కాబడిన వ్యక్తి బ్యాంకు ఖాతలో నేరుగా డీబీటీ పద్ధతిలో సొమ్ము చేస్తుందన్నారు. బాధిత కుటుంబీకులకు సత్వరం ఆర్థిక సహాయం అందించేందుకు వీలుగా మృతుని యొక్క మరణం, ఎఫ్ఐఆర్, ఫోరెన్సిస్ సైన్స్ లాబొరేటరీ, పోస్టుమార్టం రిపోర్టులు వంటి ఇతర అర్హతలకు సంబంధించిన ధృవపత్రాలను సకాలంలో జారీ చేయాలన్నారు. ఈ క్లైమ్ లకు సంబంధించిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కారానికి అధికారులు కృషి చేయాలన్నారు. ఇందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు వైఎస్సార్ బీమా పథకం కింద 757 క్లైమ్ లకు సంబంధించి రూ.10.81 కోట్ల లబ్ధిదారుల బ్యాంకు ఖాతలో జమ చేయడం జరిగిందని మిగిలిన దరఖాస్తులు వివిధ దశల్లో ఉన్నాయాని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎంజేవీ.భాస్కరరావు, డీఆర్డీఏ పీడీ కె శ్రీరమణి, కాకినాడ నగర పాలక సంస్థ ఏడీసీ సీహెచ్ నాగనరసింహారావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.జే.నరసింహ నాయక్, డీసీహెచ్ఎస్ డా స్వప్న, జీజీహెచ్ ఆర్ఎం డా అనిత ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️