ఉపాధి పనుల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలి

Apr 19,2024 22:09

 ప్రజాశక్తి – జియ్యమ్మవలస  : మండలంలోని కుందర తిరువాడ పంచాయతీలో శుక్రవారం ఉపాధి పనులను వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మరాపు సూర్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు మాట్లాడుతూ కేంద్రంలో వామపక్షాలు, రాష్ట్రంలో వ్యవసాయ కార్మిక సంఘాల పోరాటాలతో ఉపాధి హామీ చట్టం వచ్చిందని తెలిపారు. నిరుపేద రైతులకు, కూలీలకు, వలస కూలీలకు ఎంతో ఉపయోగపడే ఉపాధి చట్టాన్ని బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వీర్యం చేసి ఎత్తివేయడానికి ప్రయత్నిస్తుందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం గతేడాది రూ.90వేల కోట్లు ఉపాధి చట్టానికి ఖర్చుపెడితే ఈ ఏడాది కేవలం రూ.60వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించడం దుర్మార్గమన్నారు. ఎలాగైనా ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలన్న దురుద్దేశంతో ఉపాధి పనుల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం జరుగుతుందని, దీన్ని ప్రజలు గమనించాలని కోరారు. గతంలో టెంట్లు, మెడికల్‌ కిట్లు, మంచినీరు, మజ్జిగ సరఫరా చేసేవారని, పనిముట్లయిన గుణపాలు, పార్ల, తట్టలు కొని ఇచ్చేవారని, మేట్లకు ఐదు రూపాయల ప్రోత్సాహం ఇచ్చే వారిని, ఇప్పుడు అవన్నీ తీసివేయడమంటే ఉపాధి పనుల వద్ద కూలీలు విసిగు చెందేలా పనిచేస్తున్నారని విమర్శించారు. గ్రామాల్లో ఉపాధి పనుల వద్ద మౌలిక సదుపాయాలన్నీ వెంటనే కల్పించాలని, ఎండలు ఎక్కువగా ఉన్న కారణంగా ఒక్క పూట మాత్రమే పని చేయా లని డిమాండ్‌ చేశారు. రానున్న రోజుల్లో ఉపాధి చట్టాన్ని ఎత్తివేయడానికి ప్రయత్నిస్తే ఉపాధి కూలీలంతా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాడాలని, దీనికి ఎప్పుడూ వ్యవసాయ కార్మిక సంఘం సిద్ధంగా ఉంటుందని తెలిపారు.

➡️