నేటి నుంచి విజయవాడలో నిరవధిక నిరాహార దీక్షలు.. అంగన్‌వాడీల ప్రకటన

Jan 17,2024 07:55 #Anganwadi strike

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : తమ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న మొండి వైఖరికి నిరసనగా నేటి (17వ తేది-బుధవారం) నుండి నిరపధిక నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు అంగన్‌వాడీలు ప్రకటించారు. ఉదయం 11 గంటలకు అంగన్‌వాడీ సంఘాల నాయకత్వం దీక్షలను చేపట్టనుంది. దీక్షా శిబిరాన్ని ఎంఎల్‌సి కెఎస్‌ లక్ష్మణరావు ప్రారంభించనున్నారు. విజయవాడలోని బాలోత్సవ్‌భవన్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు), అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ (ఎఐటియుసి) ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) రాష్ట్ర నేతలు కారుసాల సుబ్బారావమ్మ, పి.ప్రకాష్‌, పి.పద్మలు ఈ విషయం తెలిపారు. సమస్యల పరిష్కారంకోసం ప్రాణత్యాగానికి కూడా నాయకత్వం సిద్ధంగా ఉందని, తాడోపేడో తేల్చుకుంటామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మొండితనానికి సరైన సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. తమ న్యాయమైన కోర్కెలు పరిష్కారం చేయాలని డిసెంబరు 12 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఫ్రభుత్వం ఆరు సార్లు చర్చలకు పిలిచినప్పటికీ తమకు వేతనాలు పెంచాలనే డిమాండ్‌ను అంగీకరించలేదన్నారు. ఈ నేపథ్యంలో పోరాటాన్ని ఉధృతం చేయాలని అన్ని యూనియన్లు నిర్ణయించినట్లు వారు వెల్లడించారు. సమ్మె కొనసాగింపును ప్రభుత్వం తమపై రుద్దిందన్నారు. 5 సంవత్సరాల్లో ఒక్క సారి మాత్రమే వేతనాలు పెంచుతామని అంటున్నారని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, చాలీ చాలని జీతాలతో ఎలా బతకాలని యూనియన్‌ నేతలు ప్రశ్నించారు. తెలంగాణ కంటే అదనంగా వెయ్యిరూపాయలు పెంచుతామని సిఎం ప్రకటించి ఎన్నికల ప్రణాళికలో పెట్టారన్నారు. కోటి సంతకాల సేకరణ చేస్తున్నామని, సంతకాల కార్యక్రమం పూర్తికాగానే సిఎంకు త్వరలో పంపిస్తామన్నారు. అంగన్‌వాడీ సమస్యలను పరిష్కరించమని తాము విజ్ఞప్తి చేస్తే ఎస్మా ప్రయోగించి ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరిస్తూ షోకాజ్‌ నోటీసులివ్వడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అంగన్‌వాడీలకు జీతాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. మీడియాసమావేశంలో సిఐటియు నేతలు జె రత్నకుమారి, ఉమాదేవి, రమాదేవి, ఐఎఫ్‌టియు నుంచి పద్మ, రవిచంద్ర, ఎఐటియుసి నుంచి పి ప్రకాష్‌, కెఆర్‌ ఆంజనేయులు పాల్గొన్నారు.

➡️