తొలి విడతలో 252 మంది అభ్యర్థులకు నేర చరిత్ర

  • 450 మంది కోటీశ్వర్లు
  •  10 మందికి ఆస్తుల్లేవ్‌ !
  •  ఎడిఆర్‌ నివేదిక

న్యూఢిలీ : సార్వత్రిక ఎన్నికల్లో తొలిదశ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 252 మందికి నేర చరిత్ర ఉన్నట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీపార్మ్స్‌ (ఎడిఆర్‌) నివేదించింది. కేంద్ర ఎన్నికల సంఘం సమాచారం ప్రకారం.. మొదటి దశ ఎన్నికల్లో మొత్తం 1,625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 1,491 మంది పురుషులు, 134 మంది మహిళా అభ్యర్థులు. పోటీలో ఉన్న మహిళల శాతం కేవలం 8 మాత్రమే. కాగా 1,618 మంది అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించి ఎడిఆర్‌ ఒక నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం మొత్తం అభ్యర్థుల్లో 16 శాతం మంది అంటే 252 మంది అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. 10 శాతం మంది అంటే 161 మంది అభ్యర్థులపై హత్య, కిడ్నాప్‌ వంటి కేసులున్నాయి. ఏడుగురు అభ్యర్థులపై హత్య, 19 మందిపై హత్యాయత్నం అభియోగాల కింద కేసులు నమోదయ్యాయి. 18 మంది అభ్యర్థులు, మహిళలపై నేరాలకు సంబంధించి కేసులున్నాయి. వీరిలో ఒకరిపై లైంగికదాడి కేసు కూడా నమోదైంది. అదే సమయంలో 35 మంది అభ్యర్థులపై ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన కేసులూ ఉన్నాయి.

28 శాతం అభ్యర్థులు కోటీశ్వర్లు
తొలి దశ ఎన్నికల్లో 1618 మంది అభ్యర్థుల్లో 450 మంది అంటే 28 శాతం మంది అభ్యర్థులు కోటీశ్వరులేనని ఎడిఆర్‌ నివేదించింది. అభ్యర్థుల సగటు ఆస్తులు రూ.4.51 కోట్లుగా ఉంది. తమిళనాడులోని తూత్తుకుడి స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థి కె. పొన్‌రాజ్‌ అత్యంత పేద అభ్యర్థి. ఆయన వద్ద రూ.320 మాత్రమే ఉన్నాయి.

ఆ తొమ్మిది స్థానాలపై అందరి దృష్టి
నాగ్‌పూర్‌ (మహారాష్ట్ర) ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం అయినప్పటికీ, నాగ్‌పూర్‌ ఎప్పుడూ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. ఈ స్థానం 1952 నుంచి 1996 వరకు, 1998 నుంచి 2009 వరకు కాంగ్రెస్‌ ఆధీనంలో ఉంది. 1996 ఎన్నికల్లో తొలిసారి బిజెపి ఖాతా తెరిచింది. అప్పుడు బన్వరీలాల్‌ పురోహిత్‌ ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో కాంగ్రెస్‌ విజయ పరంపరకు నితిన్‌ గడ్కరీ బ్రేక్‌ వేశారు. అప్పటి నుంచి ఆయన నాగ్‌పూర్‌ నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. గడ్కరీ ఇప్పుడు మూడోసారి ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థి వికాస్‌ ఠాక్రేతో పోటీ నెలకొంది. వికాస్‌ ఠాక్రే నాగ్‌పూర్‌ వెస్ట్‌ నుంచి ఎమ్మెల్యే , మేయర్‌గా ఉన్నారు.

బికనీర్‌ (రాజస్థాన్‌) : రాజస్థాన్‌లోని బికనీర్‌లో బిజెపి ప్రస్తుత న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఫ్‌ువాల్‌ను అభ్యర్థిగా నిలబెట్టింది. ఆయనపై రాజస్థాన్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన గోవింద్రామ్‌ మేఘ్వాల్‌ను కాంగ్రెస్‌ రంగంలోకి దించింది. గోవింద్‌రామ్‌ మేఘవాల్‌ ఇటీవలే ఖాజువాలా స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అర్జున్‌రామ్‌ మేఘవాల్‌ ఈ స్థానం నుంచి వరుసగా మూడు సార్లు ఎంపీగా ఉన్నారు.

అల్వార్‌ (రాజస్థాన్‌ ):అల్వార్‌లో బిజెపి అభ్యర్థి భూపేంద్ర యాదవ్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి లలిత్‌ యాదవ్‌ మధ్య పోటీ నెలకొంది. లలిత్‌ యాదవ్‌ ముండావర్‌ ఎమ్మెల్యే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 50 వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు. అలాగే భూపేంద్ర యాదవ్‌ రాజస్థాన్‌ నుంచి రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి చెందిన బాబా బాలక్‌నాథ్‌ అల్వార్‌ స్థానాన్ని గెలుచుకున్నారు.

చింద్వారా (మధ్యప్రదేశ్‌) :ఈ సీటు ఏడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌లో ఉంది. గత 45 ఏండ్లుగా ఇక్కడ నాథ్‌ కుటుంబానికి చెందిన ఒకరు గెలుస్తూ వస్తున్నారు. అయితే 1997లో జరిగిన ఉప ఎన్నికలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి సుందర్‌లాల్‌ పట్వా కమల్‌నాథ్‌పై 37 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. దీని తర్వాత, మరుసటి సంవత్సరం కమల్‌ నాథ్‌ కూడా పట్వాను భారీ తేడాతో ఓడించారు.
కమల్‌ నాథ్‌ 1980 నుంచి 2019 మధ్య ఇక్కడ తొమ్మిది సార్లు ఎంపీగా ఉన్నారు. 2018లో ముఖ్యమంత్రి అయ్యాక కుమారుడికి బాధ్యతలు అప్పగించారు. 2019లో మోడీ వేవ్‌ ఉన్నా నకుల్‌నాథ్‌ ఈ ఎంపీ సీటును కైవసం చేసుకున్నారు. ఈసారి కూడా కాంగ్రెస్‌ అభ్యర్థి నకుల్‌నాథ్‌, బిజెపి అభ్యర్థి వివేక్‌ బంటీ సాహు మధ్యే పోటీ నెలకొంది. 2019 ఉప ఎన్నికలు, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కమల్‌నాథ్‌పై సాహు ఓడిపోయారు.

మాండ్లా (మధ్యప్రదేశ్‌) : ఇక్కడి నుంచి బిజెపి ఆరు సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఎన్నికైన ఫగ్గన్‌ సింగ్‌ కులస్తేను పోటీలో నిలబెట్టింది. నాలుగుసార్లు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచిన ఓంకార్‌ సింగ్‌ మార్కంపై ఆయన పోటీ చేస్తున్నారు. ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మాండ్లా జిల్లా నివాస్‌ స్థానం నుంచి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే ఓటమిని చవిచూడాల్సి రావడంతో ఈ సీటుపై బిజెపి ఆందోళన పెరిగింది. మండల పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని 8 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ 5, బిజెపి 3 స్థానాల్లో ఉన్నాయి.

ఉదంపూర్‌ (జమ్మూ కాశ్మీర్‌) : జమ్మూ కాశ్మీర్‌లోని ఉదంపూర్‌-దోడా లోక్‌సభ స్థానం నుంచి కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ మూడోసారి ఎన్నికల బరిలో నిలిచారు. 2014లో జమ్మూ కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌పై 61 వేల ఓట్లతో విజయం సాధించారు.ఆ తర్వాత 2019లో కాంగ్రెస్‌ అభ్యర్థి విక్రమ్‌ ఆదిత్య సింగ్‌ 3 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు.

అరుణాచల్‌ వెస్ట్‌ : బిజెపి కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజును ఈ స్థానం నుంచి బరిలోకి దింపింది. ఆయనకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు నబమ్‌ తుకీ సవాల్‌ విసిరారు. టుకీ అరుణాచల్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, పాపం పరే జిల్లాలోని సాగాలి అసెంబ్లీ స్థానం నుంచి ఆరు సార్లు ఎన్నికయ్యారు.
2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి కిరెన్‌ రిజిజు ఈ స్థానంలో గెలుపొందారు.అదే సమయంలో, 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి తకమ్‌ సంజోరు విజయం సాధించారు.

కూచ్‌ బెహార్‌ (పశ్చిమ బెంగాల్‌) : 2019లో కూచ్‌ బెహార్‌ స్థానం నుంచి బిజెపి అభ్యర్థి నిషిత్‌ ప్రమాణిక్‌ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన్ను తృణమూల్‌ కాంగ్రెస్‌ బహిష్కరించగా.. బిజెపి టిక్కెట్‌పై కూచ్‌ బెహార్‌ నుంచి ఎన్నికలలో పోటీ చేసి గెలిచారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి పరేష్‌ చంద్రపై ఆయన 54,231 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

నగీనా (ఉత్తర ప్రదేశ్‌) : యూపీలోని బిజ్నోర్‌ జిల్లా నగీనా లోక్‌సభ స్థానం ఈసారి హైప్రొఫైల్‌గా మారింది. ఇక్కడ దళిత యువ నాయకుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ తన పార్టీ ‘ఆజాద్‌ సమాజ్‌ పార్టీ’ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దీంతో ఈ సీటుపై పోటీ చతుర్ముఖంగా మారింది. బిజెపి తరఫున నహ్తౌర్‌ ఎమ్మెల్యే ఓం కుమార్‌, ఇండియా అలయన్స్‌ తరఫున మాజీ న్యాయమూర్తి మనోజ్‌ కుమార్‌ బరిలో ఉన్నారు.
2019 మోడీ వేవ్‌లో కూడా ఈ సీటును బిఎస్పీ గెలుచుకుంది. ఈ స్థానం నుంచి బిఎస్పీ అభ్యర్థి గిరీష్‌ చంద్ర జాతవ్‌ గెలుపొందగా, బులంద్‌షహర్‌ నుంచి మాయావతి ఈసారి ఆయనను పోటీకి దింపారు.
లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్నాయి, జూన్‌ 4న ఫలితాలు రానున్నాయి. దేశంలోని 543 స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 19న మొదటి దశ, జూన్‌ 1న చివరి దశ ఓటింగ్‌ జరగనుంది. జూన్‌ 4న ఫలితాలు రానున్నాయి. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్‌ , సిక్కిం 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఒడిశాలో మే 13, మే 20, 25 మే, జూన్‌ 1 తేదీల్లో ఓటింగ్‌ జరగనుంది.

➡️