వేసవిలో వడియాలు

Mar 17,2024 07:15 #ruchi, #Sneha

ఎండాకాలం వచ్చిందంటే రకరకాల వడియాలు పెడతారు పెద్దవాళ్లు. వీటితో పాటు ఊరమిరపకాయలూ తయారుచేస్తారు. ఆరోగ్యానికి మేలు చేసే పచ్చి మిరపకాయలు కంటి చూపును మెరుగుపరచడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణ వ్యవస్థ సాఫీగా పనిచేసేలా చేయడంలో ఎంతో ఉపయోగపడతాయి. అందుకే ఊర మిరపకాయలను పట్టుకుంటారు. వడియాలకు పెట్టింది పేరు మన ఇరు తెలుగు రాష్ట్రాలు. కాస్త సమయం వెచ్చించి, వడియాలు పెట్టుకుంటే రసమో, పులుసో చేసుకున్నప్పుడు వీటిని నంజుకుని తింటుంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేము.
ఇవి ఎలా తయారుచేస్తారో తెలుసుకుందాం.

ఊర మిరపకాయలు


కావలసినవి : లావుగా కారం తక్కువగా ఉండే మిరపకాయలు – పావు కిలో, పుల్లని పెరుగు – పావు కిలో, నీళ్లు -100 ఎంఎల్‌ , వాము – ఒక టీ స్పూన్‌, రాళ్ల ఉప్పు – 100 గ్రాములు లేదా తగినంత, పసుపు- అర టీ స్పూన్‌.
తయారీ : ముందుగా రోట్లో వామును వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. తర్వాత మిరపకాయల తొడిమెలను తొలగించకుండా వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడవాలి. ఈ మిరపకాయలకు కత్తితో నిలువుగా గాటు పెట్టుకోవాలి. ఒక గిన్నెలో పెరుగును తీసుకుని కవ్వంతో చిలికి అందులో నీళ్లను పోసి మజ్జిగలా చేసుకోవాలి. ఇందులోనే ఉప్పును, పసుపును, ముందుగా దంచి పెట్టుకున్న వామును కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మజ్జిగలో గాటు పెట్టుకున్న మిరపకాయలను వేసి కలిపి 24 గంటల పాటు ఊరబెట్టాలి. తరువాత వీటిని మజ్జిగ నుండి తీసి కవర్‌ మీద ఉంచి ఒక రోజంతా ఎండబెట్టాలి.
వీటిని తీసి, అదే మజ్జిగలో వేసి ఊరబెట్టి మరలా ఎండబెట్టాలి. ఇలా మజ్జిగ పూర్తిగా అయిపోయే వరకూ ఎండబెడుతూ, ఊరబెడుతూ ఉండాలి. తర్వాత ఈ మిరపకాయలను 5 నుండి 6 రోజుల పాటు పూర్తిగా ఎండే వరకు ఉంచాలి. అంతే ఊర మిరపకాయలు రెడీ. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి. వీటిని చిన్న మంట మీద వేయించాలి. వీటిని పప్పు, సాంబార్‌లో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.

మినప్పప్పుతో..


కావలసినవి : మినప్పప్పు -అర కేజీ, పచ్చిమిర్చి – 7 / 8, జీలకర్ర- టీ స్పూన్‌, అల్లం- రెండు అంగుళాల ముక్క, ఉప్పు- టేబుల్‌ స్పూన్‌.
తయారీ: మినప్పప్పు కడిగి మునిగేలా నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే గ్రైండర్‌లో మెత్తగా రుబ్బాలి. అందులో ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేయాలి. మొత్తం మెత్తగా మెదిగిన తరవాత ఒక గిన్నెలోకి తీసుకుని, తడి వస్త్రాన్ని లేదా పాలిథిన్‌ షీట్‌ని ఎండలో పరిచి దాని మీద వడియాలు పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీటిని తీసుకుని అందులో స్పూన్‌ని ముంచి అప్పుడు పిండి తీసుకుంటే పిండి సులువుగా జారుతుంది. రెండు రోజుల పాటు ఎండనివ్వాలి. మూడవ రోజు వలిచి మళ్లీ ఎండబెట్టాలి. అప్పుడు గలగలలాడుతాయి. ఇవి ఏడాది పాటు నిల్వ ఉంటాయి. వీటిని మీడియం ఫ్లేమ్‌లో వేయిస్తే చక్కగా వేగి కరకరలాడుతాయి.

సగ్గుబియ్యంతో..


కావలసినవి : సగ్గుబియ్యం- ఒక కప్పు, పచ్చిమిర్చి- రెండు, నీళ్లు- ఆరు కప్పులు, జీలకర్ర పొడి-అరటీస్పూను, ఉప్పు- తగినంత.
తయారీ : ముందుగా ఓ పాత్ర తీసుకుని అందులో నీళ్లు పోసి బాగా మరిగించాలి. ఇప్పుడు సగ్గుబియ్యం వేసి బాగా ఉడికించాలి. నీళ్లు చిక్కగా వచ్చాక అందులో జీలకర్రపొడి, ఉప్పు, కచ్చపచ్చగా చేసి ఉంచిన పచ్చిమిర్చి వేసి బాగా కలపి చల్లారనివ్వాలి. ఇప్పుడు కాటన్‌ క్లాత్‌ మీద కాని లేదా పాలిథిన్‌ పేపర్‌ మీద కానీ చిన్న గరిటెతో వడియాలు పెట్టుకోవాలి. రెండు లేక మూడు రోజులు బాగా ఎండబెట్టాలి. తర్వాత వలుచుకుని, గాలి తగలని డబ్బాలో నిల్వ చేసి ఉంచాలి. ఆ తర్వాత మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నూనెలో వేయించుకోవాలి. అంతే సగ్గుబియ్యం వడియాలు రెడీ.

➡️