గుజరాత్‌లో 32 మందికే సర్కారు కొలువులు !

Feb 16,2024 07:43 #Gujarat, #Unemployees
in-gujarat-only-32-people-are-government-measures

రెండేళ్లలో బిజెపి ప్రభుత్వం సాధించిన ‘ప్రగతి’

అహ్మదాబాద్‌ : సంవత్సరానికి రెండు కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలో హామీలు గుప్పించింది. ప్రధాని సొంత రాష్ట్రంలోనే ఆ హామీ అమలుకు నోచుకోవడం లేదు. ఆ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం 2.38 లక్షల మంది విద్యావంతులైన నిరుద్యోగులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. గుజరాత్‌లోని బిజెపి ప్రభుత్వం గత రెండు సంవత్సరాల కాలంలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చిందో తెలుసా? అక్షరాలా 32 మందికి మాత్రమే. శాసనసభలో కాంగ్రెస్‌ సభ్యులు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇది. రాష్ట్రంలోని 29 జిల్లాల్లో 2,38,978 మంది నిరుద్యోగులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని, వీరు కాకుండా 10,757 మంది పాక్షిక విద్యావంతులు కూడా పేర్లు నమోదు చేసుకున్నారని ప్రభుత్వం వివరించింది. అంటే పేర్లు నమోదు చేసుకున్న మొత్తం నిరుద్యోగుల సంఖ్య 2,49,735. వీరిలో 32 మందికి మాత్రమే సర్కారు కొలువులు లభించాయి. 22 మంది అహ్మదాబాద్‌, తొమ్మిది మంది భావనగర్‌, ఒకరు గాంధీనగర్‌లో ఉద్యోగాలు పొందారు. ఆనంద్‌ జిల్లాలో అత్యధికంగా 21,633 మంది నిరుద్యోగులు ఉండగా వడోదరలో 18,732 మంది, అహ్మదాబాద్‌లో 16,400 మంది ఉన్నారని రాష్ట్ర పరిశ్రమల మంత్రి బల్వంత్‌సింగ్‌ రాజ్‌పుట్‌ శాసనసభకు తెలియజేశారు.

➡️