ఎంఎల్‌సి తోట త్రిమూర్తులుకు 18 నెలల జైలు

ప్రజాశక్తి- విశాఖ లీగల్‌ రిపోర్టర్‌, రామచంద్రపురం : డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన దళిత యువకులను బంధించి శిరోముండనం చేసిన, చిత్రహింసలకు గురి చేసిన కేసులో నేరం రుజువైంది. ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు సహా తొమ్మిది మంది నిందితులకు 18 నెలలు జైలు శిక్షతో పాటు మొత్తంగా రూ.3.78 లక్షల జరిమానా విధిస్తూ విశాఖపట్నం జిల్లా షెడ్యూల్‌ తెగల, కులాల కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి లాలం శ్రీధర్‌ మంగళవారం తీర్పు ఇచ్చారు. ఐపిసి సెక్షన్‌ 342 ప్రకారం ఆరు నెలలు, 506 ప్రకారం ఆరు నెలలు, రూ.2 వేల జరిమానా, 323 ప్రకారం ఆరు నెలల జైలు, ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టం 313 ప్రకారం 18 నెలల జైలు, రూ.20 వేల చొప్పున జరిమానా, ఐపిసి 310 కింద 18 నెలలు జైలు, రూ.20 వేల చొప్పున జరిమానా విధించారు. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అంటే 18 నెలలు పాటు అనుభవించాలని తీర్పు ఇచ్చారు. మొత్తం జరిమానా సొమ్ములో రూ.1.50 లక్షల చొప్పున శిరోముండనం బాధితులైన దడాల వెంకటరత్నం, కోటి చినరాజులకు చెల్లించాలని తీర్పు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఘటన జరిగిన 28 ఏళ్ల తరువాత తీర్పు వెలువడింది. తీర్పు అనంతరం సస్పెన్షన్‌ ఆఫ్‌ సెంటెన్స్‌ కోసం తోట త్రిమూర్తులు దరఖాస్తు చేసుకోగా, న్యాయమూర్తి పరిశీలించారు.
నెల రోజులు పాటు తాత్కాలికంగా శిక్ష నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. కోర్టు శిక్ష విధించిన వారిలో తోట త్రిమూర్తులుతో పాటు తోట పెదబాబులు, తోట రాము, తోట పుండరీక్షాక్షుడు, తోట బాబి, దేవళ్ల కిశోర్‌, తోట శ్రీను, మంచం శ్రీనివాస్‌, ఆచంట రాంబాబు ఉన్నారు. ఈ కేసులో బాధితుల్లో ఒకరు, సాక్షుల్లో తొమ్మిది మంది, నిందితుల్లో ఒకరు ఇప్పటికే మృతి చెందారు.
ఘటన పూర్వాపరాలు…
ఈ ఘటనపై బాధితుల కథనం ప్రకారం… 1994 ఎన్నికల్లో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి తోట త్రిమూర్తులు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆ సందర్భంగా దళిత యువకులు కొందరు బిఎస్‌పి తరఫున పనిచేశారు. తనకు అనుకూలంగా లేనందున త్రిమూర్తులు వారిపై కక్ష పెంచుకొని వేధింపులకు పాల్పడ్డారు. వారిపై ట్రెస్‌పాసింగ్‌ (అక్రమ చొరబాటు) కేసు నమోదు చేయించారు. ఆ కేసును కొట్టేయడంతో బాలికను వేధించారనే మరో అక్రమ కేసు బనాయించారు. అరెస్టుకు భయపడి దడాల వెంకటరత్నం, కోటి చినరాజు పారిపోయారు. వారిద్దరిని కుటుంబ సభ్యులతో త్రిమూర్తులు వెతికి రప్పించి రామచంద్రపురం మండల వెంకటాయపాలెంలో 1996 డిసెంబర్‌ 29న శిరోముండనం చేయించారు. దళిత యువకులు చల్లపూడి పట్టాభిరామయ్య, కనికెళ్ల గణపతి, పువ్వుల వెంకటరమణలను చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటనపై జర్నలిస్టు టిఎస్‌ఎన్‌.రాజు రాసిన వార్త 1997 జనవరి 1న వార్త దినపత్రికలో ప్రచురితమైంది. ఈ వార్త ఆధారంగా అప్పటి ఎస్‌పి ఆదిత్య త్రిపాఠి బాధితులను కలిసి వివరాలు సేకరించి ద్రాక్షారామం పోలీస్‌ స్టేషన్‌లో తోట త్రిమూర్తులు, ఆయన అనుచరులు తొమ్మిదిమందిపై ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. 24 మందిని ప్రత్యక్ష సాక్షులుగా గుర్తించారు. 1997 జనవరి 7న పోలీసులు ప్రధాన నిందితుడు తోట త్రిమూర్తులను అరెస్టు చేశారు. మరుసటి రోజు మిగిలిన నిందితులు కోర్టులో లొంగిపోయారు. 1997 జనవరి 19న ప్రధాన నిందితునిగా తోట త్రిమూర్తులు, మరో తొమ్మిది మందిపై రాజమండ్రి ప్రత్యేక కోర్టులో ఛార్జిషీటు దాఖలైంది. ఈ కేసుకు సంబంధించి అప్పటి టిడిపి ప్రభుత్వం 15 రోజుల్లోనే ఛార్జిషీటు దాఖలు చేయించి, నిందితులకు బెయిల్‌ ఇప్పించబోయింది. ప్రభుత్వ ఒత్తిడిని గమనించిన న్యాయమూర్తి కేసు విచారణను 27.5.1997 నుంచి 4.6.1997 వరకూ షెడ్యూల్‌ని ఇచ్చారు. నిందితులు 87 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్నారు. రాజమండ్రిలోని న్యాయమూర్తిపై తనకు నమ్మకం లేదని త్రిమూర్తులు హైకోర్టుకు ఫిర్యాదు చేసి స్టే తెచ్చుకోవడంతో కేసును విశాఖ ప్రత్యేక కోర్టుకు బదలాయింపు జరిగింది. 1998 మే 3న విశాఖ ప్రత్యేక కోర్టులో కేసు విచారణ మొదలైంది.
కేసు ఎత్తివేసేందుకు అప్పటి టిడిపి ప్రభుత్వం యత్నం
తోట త్రిమూర్తులుపై కేసు ఎత్తివేస్తూ అప్పటి టిడిపి ప్రభుత్వం 1998 ఆగస్టు 22న జిఒ 1796ను జారీ చేసింది. బాధితులు, హక్కుల సంఘాలు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వాన్ని మందలిస్తూ హైకోర్టు ఈ జిఒను నిలిపేసింది. కేసు విశాఖ నుంచి అమలాపురానికి అనంతరం తిరిగి మళ్లీ విశాఖ కోర్టుకు చేరింది. అనంతరం కాంగ్రెస్‌ పాలనలో ఈ కేసుకు ప్రత్యేక పిపి రఫీ అహ్మద్‌ కిద్వారుని నియమించింది. దీనిపై నిందితులు హైకోర్టుకు వెళ్లి విచారణను సాగదీశారు. ప్రత్యేక పిపి మధ్యలోనే విరమించుకున్నారు. అనంతరం రెండో పిపిగా జవహర్‌ అలీ నియమితులయ్యారు. విశాఖ కోర్టు కేసు విచారణకు 5.8.2016 నుంచి 11.8.2016 వరకూ షెడ్యూల్‌ ఇచ్చింది. బాధితులకు రక్షణ కల్పించలేమంటూ పుష్కరాల సాకుతో ఇన్‌ఛార్జి డిఎస్‌పి, ఇతర అధికారులు కోర్టుకు చెప్పి విచారణను 2016 సెప్టెంబర్‌ 26కు వాయిదా వేయించారు. ఇదే సమయంలో పిపి జవహర్‌ అలీని తప్పించారు. దీంతో, బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఇది హైకోర్టులో పెండింగ్‌లో ఉండగా సలాది శ్రీనివాస్‌ను ప్రత్యేక పిపిగా ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై బాధితులు అభ్యంతరం తెలపడంతో హైకోర్టు ప్రస్తుతం వై.సుజాతను పిపిగా నియమించింది.
బాధితులు ఎస్‌సిలు కాదంటూ దొంగ సర్టిఫికెట్లు సమర్పించిన నిందితులు
2017 మే 8న తుది దశ విచారణ మొదలైంది. మిగిలిన సాక్షుల విచారణ, ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. ఈ సమయంలో బాధితులు ఎస్‌సిలు కాదనే కొత్త వాదనను నిందితులు లేవనెత్తారు. మతం మార్చుకున్నట్టుగా దొంగ సాక్ష్యాలు సృష్టించారు. దీని కోసం స్థానిక రెవెన్యూ యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చారు. బాధితులకు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయకుండా అడ్డుకున్నారు. దీంతో, బాధితులు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. చివరికి హైకోర్టు ఆదేశాలతో ఆ పత్రాలు సాధించుకున్నారు. 2024 ఏప్రిల్‌ 12న తుది తీర్పు ఇవ్వనున్నట్టు ప్రత్యేక కోర్టు ప్రకటించింది. అనంతరం న్యాయమూర్తి సెలవులో ఉండడంతో తీర్పు 16కు వాయిదా వేశారు. మొత్తంగా 148 సార్లు వాయిదా అనంతరం త్రిమూర్తులుపై నేరం రుజువైనట్టు కోర్టు పరిగణించి తుది తీర్పును ఇచ్చింది. బాధితుల్లో పువ్వుల వెంకటరమణ దీర్ఘకాలిక వ్యాధితో రెండు నెలల క్రితం, నిందితుల్లో ఒకరైన తలాటం మురళీకృష్ణ 1999లో జరిగిన రోడ్దు ప్రమాదంలో మృతి చెందారు.

➡️