ఆకట్టుకున్న కళారూపాలు : మహాధర్నా వద్ద ఆట-పాట

ప్రజాశక్తి – విజయవాడ : ఎపి కార్మిక సంఘాల ఐక్యవేదిక, ఎపి రైతు సంఘాల సమన్వయ సమితి సంయుక్త ఆధ్వర్యాన నగరంలోని జింఖానా మైదానంలో చేపట్టిన 48 గంటల మహాధర్నాలో కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు, నృత్య ప్రదర్శనలు, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. బిజెపి ప్రభుత్వ విధానాలతో వివిధ రంగాలపై పడిన ప్రభావాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. మతోన్మాదం, కార్పొరేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం, ధరలు, కార్మికులు, రైతులు పడుతునున్న ఇబ్బందులు, రైతుల ఆత్మహత్యలు తదితర అంశాలపై కళారూపాలు ఆకట్టుకున్నాయి. మైదానం ప్రాంగణంలో మోడీ విధానాలపై వినూత్న రీతిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కళాకారులు వేదికపై గజ్జకట్టి, డప్పుకొట్టి, చిందులేశారు. ఆయా సంఘాలకు చెందిన సుమారు 200 మంది కళాకారులు ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ కళారూపాలను ప్రదర్శించి ‘ధూమ్‌-దామ్‌’ నిర్వహించారు. ప్రజానాట్యమండలి (పిఎన్‌ఎం), ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి (ఎపిఎన్‌ఎం), అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, ప్రజాకళాకారుల సమాఖ్య, విజయవాడకు చెందిన అంగన్‌వాడీలు, ఐద్వా తదితర సంఘాల కళాకారుల ఆట-పాటలు, నృత్యాలు, వివిధ కళారూపాలను ప్రదర్శించారు. రైతుల సమస్యలు, ధరల పెరుగుదల తదితర అంశాలపై నృత్యాలు, కళారూపాలు ఆకట్టుకున్నాయి. ”ఎక్కడమ్మ నువ్వు లేనిదీ…ఏమిటీ నువ్వు చేయలేనిదీ” అనే పాటకు చేసిన నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. గుంటూరు జిల్లా కాజ గ్రామానికి చెందిన పిఎన్‌ఎం చిన్నారులు… రైతుల సమస్యలపై నృత్యం చేశారు. ‘పెరిగిన విద్యుత్‌ బిల్లులు-ప్రజలు పడుతున్న ఇబ్బందుల’పై ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి కళాకారులు చేసిన ప్రదర్శన ఆలోచింపచేసింది. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఒంగోలు, అనంతపురానికి చెందిన కళాకారుల ఆట-పాట ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రజాకళాకారుల సమాఖ్య గిరిజన నృత్యాలను ప్రదర్శించారు. విజయవాడకు చెందిన అంగన్వాడీ, ఐద్వా దళాలు కోలాటం ప్రదర్శించాయి. ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.అనిల్‌కుమార్‌, గాయకులు ఎ.జగన్‌, పెద్దిరాజు, అప్పన్న, ఖాసిం, లూధర్‌పాల్‌, ఎపిఎన్‌ఎం నాయకులు పి.చంద్రనాయక్‌, టి.పెంచిలయ్య, పిచ్చయ్య, నజీర్‌, ఆరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.జాలయ్య బృందం, ప్రజాకాళాకారుల సమాఖ్య నాయకులు వర్మ తదితరుల నేతృత్యంలో కళారూపాల ప్రదర్శనలు సాగాయి.

➡️