అమెరికా మంత్రిపై అభిశంసన

Feb 15,2024 08:58 #America
Impeachment of the American Minister

వాషింగ్టన్‌: అమెరికా హోమ్‌ల్యాండ్‌ రక్షణ మంత్రి అలెజాండ్రో మయోర్కాస్‌పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం మంగళవారం అక్కడి ప్రతినిధుల సభలో నెగ్గింది. ఒక మంత్రిపై ఇలా జరగడం అమెరికాలో దాదాపు 150 ఏళ్లలో ఇదే తొలిసారి. అమెరికా- మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలను నివారించటంలో అలెజాండ్రో విఫలమయ్యారని ఆరోపిస్తూ రిపబ్లికన్లు ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే రిపబ్లికన్‌ పార్టీకి పట్టున్న ప్రతినిధుల సభలో అతి స్వల్ప మెజారిటీతో (214-213) వారు పైచేయి సాధించారు. ఈ అంశం ఇప్పుడు డెమోక్రాట్ల ఆధిక్యం ఉన్న సెనెట్‌కు చేరుతుంది. అక్కడ నెగ్గితేనే మయోర్కాస్‌ అభిశంసన అమల్లోకి వస్తుంది. ఆయనకు మద్దతుగా ఓటు వేసిన వారిలో ముగ్గురు రిపబ్లికన్‌ సభ్యులూ ఉన్నారు. మోపిన అభియోగాలు అభిశంసన స్థాయివి కాదని.. దీని వల్ల రాజ్యాంగ విలువలు దెబ్బతింటాయని వారు చెప్పారు. పైగా దీని వల్ల అక్రమ వలసల సమస్య పరిష్కారం కాదని వివరించారు. మయోర్కాస్‌పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్రంగా మండిపడ్డారు. దీన్ని రాజ్యాంగ విరుద్ధ చర్యగా అభివర్ణించారు. రిపబ్లికన్లది రాజకీయ కుట్ర అన్నారు. మయోర్కాస్‌ గౌరవప్రదమైన పబ్లిక్‌ సర్వెంట్‌ అని కొనియాడారు. శరణార్థిగా కుటుంబంతో అమెరికాకు వచ్చిన ఆయన రెండు దశాబ్దాలుగా ప్రజా సేవలో ఉన్నారని తెలిపారు. చట్టాన్ని నిబద్ధతతో అమలు చేశారన్నారు. అయితే మరోవైపు దేశ సరిహద్దులను రక్షించటంలో మయోర్కాస్‌ విఫలమయ్యారని రిపబ్లికన్లు ఆరోపించారు. ఆ పార్టీకి చెందిన స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ సైతం అభిశంసనను సమర్థించారు.

➡️