గవినివారిపాలెంలో అనారోగ్యం

Mar 18,2024 23:48

ప్రజాశక్తి – చీరాల
మండలంలోని గవినివారిపాలెంకు జబ్బు చేసింది. గ్రామంలో సుమారు 60మందికిపైగా ఒక్కసారిగా అనారోగ్యం పాలయ్యారు. అందరూ ఉన్నట్లు ఉండి బిపి, పల్స్‌ పడిపోయి ప్రమాదకర స్థితిలో చీరాల పట్టణంలోని వివిధ వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. ఒక్కసారిగా అనారోగ్యంతో హాస్పిటల్‌ పాలు కావడంతో గ్రామంలో ఆందోళన మొదలైంది. తల తిరగడం, వాంతులు, నీళ్ల విరేచనాలు వెంట వెంటనే కావడం వంటి లక్షణాలతోపాటు బిపి, పల్స్‌ పడిపోవడం ఆందోళన కలిగిస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. వాతావరణ పరిస్థితులు మారిపోవడం, తాగునీళ్లు ఏమైనా మారి ఉంటాయా అనే అనుమానం గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుపైగా గ్రామంలో నెలకొన్న అనారోగ్య పరిస్థితులతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి గ్రామంలో వైద్య శిభిరం ఏర్పాటు చేసి పరీక్షలు చేయాలని, అనారోగ్య కారణాలను విశ్లేషించి వైద్య సహాయం చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్ధికి తెల్లవారితే పరీక్షలు ఉండగా అనారోగ్యంతో వైద్యశాల్లో చేరాల్సిన పరిస్థితి వచ్చి పరీక్షలు కూడా రాయలేకపోయారు. గ్రామంలో పారిశుద్యం లేకపోవడం, ఊరి మద్యలో సంత కారణంగా పరిశుబ్రత లేకపోవడంతో అనారోగ్యం పాలౌతున్నట్లు తెలిపారు. మాజీ సర్పంచి గవిని నాగేశ్వరరావు, గోనబోయిన సన్నిటిబాబు, అతని కొడుకు అనారోగ్యం పాలయ్యాడు.

➡️