నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌కు ప్రిన్సిపల్స్‌గా ఎలా ప్రమోషన్‌ కల్పిస్తారు? – హైకోర్టు ఆగ్రహం

Mar 28,2024 23:28 #AP High Court, #judgement

ప్రజాశక్తి-అమరావతి :ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ (ఫిజికల్‌ డైరెక్టర్‌/లైబ్రేరియన్‌)లోని వారిని ప్రిన్సిపల్స్‌గా ప్రమోషన్‌కు వీలు కల్పిస్తూ జిఓ జారీ చేసిన ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీచింగ్‌లో అనుభవం లేని వారిని ప్రన్సిపల్స్‌గా ఎలా నియమిస్తారని ప్రశ్నించింది. ప్రభుత్వం 2021 డిసెంబరు 8న జారీ చేసిన జిఓ 76పై విస్మయం వ్యక్తం చేసింది. జిఓ జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీని జైలుకు పంపుతామని హెచ్చరించింది. ఏప్రిల్‌ ఒకటిన జరిగే విచారణకు ఆయన హాజరై వివరణ ఇవ్వాలంది. లారీలు నడిపేవాళ్లకు విమానాలు నడింపేందుకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో, ఇదీ అలాగే ఉందని ఘాటు వ్యాఖ్య చేసింది. జూనియర్‌ గవర్నర్‌మెంట్‌ కాలేజీల్లో 197 మంది జూనియర్‌ లెక్చరర్లకు ప్రిన్సిపల్స్‌గా ప్రమోషన్‌ కల్పిస్తూ ఇంటర్‌ విద్యాశాఖ కమిషనరు జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను డివిజన్‌ బెంచ్‌ సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు జస్టిస్‌ జి నరేందర్‌, జస్టిస్‌ హరినాథ్‌తో కూడిన డివిజన్‌ బెంచ్‌ గురువారం ఆదేశాలిచ్చింది. 197 మంది లెక్చరర్లకు ప్రిన్సిపల్స్‌గా ప్రమోషన్స్‌ కల్పిస్తూ వెలువడిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ ప్రభుత్వ లెక్చరర్స్‌ – లైబ్రెరీ సైన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సంజీవరావు ఇతరులు హైకోర్టును ఆశ్రయించారు.

➡️