పేదలకు ఇళ్ల స్థలాలేవి..?

Apr 11,2024 20:34

ప్రజాశక్తి – నెల్లిమర్ల : నెల్లిమర్ల నగర పంచాయతీలో పేదలకు ఇళ్ల స్థలాలు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. వైసిపి అధికారం చేపట్టి నగర పంచాయతీలో 1500 మందిని గుర్తించి వారికి ఇళ్ళ పట్టాలు మంజూరు చేసి రిజిస్ట్రేషన్‌ పత్రాలు పంపిణి చేసింది. అయితే కొండ ప్రాంతంలో ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు కేటాయించడంతో అక్కడ ఎటువంటి సౌకర్యాలూ లేవని ఆ స్థలాన్ని లబ్ధిదారులు తిరష్కరించారు. దీంతో 62 మంది లబ్దిదార్లకు మండల పరిషత్‌ కార్యాలయం వద్ద పంప్‌ హౌస్‌ వెనుక ఇళ్ళ నిర్మాణం చేశారు. మిగతా 1400 మందికి మాత్రం వేరే చోట స్థలం చూపించలేదు. పలు మార్లు అధికార్లు, ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్ళి గత 4సంవత్సరాలుగా మొరపెట్టుకున్నా ఫలితం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూడమ్మ వనం వద్ద సర్వే నెంబర్‌316లో (ఎల్‌సిసి ల్యాండ్‌) ప్రభుత్వ మిగులు భూమి 45 ఎకరాలు ఉందని అందులో పేదలకు ఇళ్ళు స్థలాలు ఇవ్వాలని ప్రజా ప్రతినిధులు దృష్టికి తీసుకు వెళ్ళారు. అయితే గత సంవత్సరం ఎమ్మెల్యే కూడా ఇదే స్థలంలో కొంత భూమిని సదరు రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఇచ్చిన వారికి మంజూరు చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదు. గత నాలుగున్నర సంవత్సరాలుగా పట్టాలు ఇచ్చిన వారికి ఇళ్ళ స్థలాలు చూపించాలని లబ్దిదార్లు మొరపెట్టుకున్నా ఫలితం మాత్రం దక్కలేదు. ఇంతలో ఎన్నికల సమీపిస్తున్నాయని ఈ హాడావుడిలో తమను ఇంకెవరు పట్టించుకుంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు స్థలాలను కేటాయించాలని కోరతున్నారు.

➡️