కమల్‌నాథ్‌ కాంగ్రెస్‌ను వీడనున్నారా?

Feb 17,2024 15:38 #BJP, #Kamal Nath, #Madhya Pradesh

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ మాజీ సిఎం కమల్‌నాథ్‌, అతని కుమారుడు నఖుల్‌ నాథ్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడనున్నారా? అంటే అవుననే వార్తలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా సోషల్‌మీడియాలో నకుల్‌ నాథ్‌ తన బయో నుంచి కాంగ్రెస్‌ను తొలగించారు. గత కొన్నిరోజులుగా కాంగ్రెస్‌ నేతలు తీసుకుంటున్న నిర్ణయాలకు కమల్‌నాథ్‌, అతని కుమారుడు నకుల్‌నాథ్‌లు ఇద్దరూ అసంతృప్తిగా ఉన్నారని, త్వరలోనే వారిద్దరూ బిజెపి కండువా కప్పుకోనున్నారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. తాజాగా నిన్న (శుక్రవారం) మధ్యప్రదేశ్‌ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు విడి శర్మ కమల్‌నాథ్‌ బిజెపిలోకి చేరనున్నట్లు వ్యాఖ్యానించారు. విడి శర్మ వ్యాఖ్యల అనంతరం ఒక్కరోజు తర్వాత శనివారం నఖుల్‌నాథ్‌ బయోలో కాంగ్రెస్‌ను తొలగించడం.. కమల్‌నాథ్‌ శనివారం ఢిల్లీ వెళ్లటం చూస్తే తండ్రీ, కుమారులిద్దరూ బిజెపిలోకి చేరతారనే వార్తలకు బలం చేకూరింది. అయితే ఈ వార్తలను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజరు సింగ్‌ తోసిపుచ్చారు. కమల్‌నాథ్‌ కాంగ్రెస్‌ని వీడడం లేదని, కాంగ్రెస్‌లోనే కొనసాగతారని దిగ్విజరు వ్యాఖ్యానించారు.

కాగా, కమల్‌నాథ్‌ కాంగ్రెస్‌ని వీడుతున్నారనే ఊహాగానాలపై మధ్యప్రదేశ్‌ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు విడి శర్మ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… ‘అయోధ్యలోని రామమందిరం ‘ప్రాణప్రతిష్ట’ వేడక ఆహ్వానాన్ని కాంగ్రెస్‌ తిరస్కరించడంతో కలత చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలకు బిజెపి పార్టీలోకి ఆహ్వానించేందుకు తలుపులు తెరిచే ఉన్నాయని’ అయన అన్నారు. నకుల్‌నాథ్‌ చింద్వారా లోక్‌ సభ నుంచి పోటీచేయనున్నట్లు ఆయన ఇటీవల ప్రకటించారు. అయితే దీనిపై కాంగ్రెస్‌ ఎటువంటి ప్రకటనా చేయలేదు. చింద్వారా స్థానం తొమ్మిదిసార్లు కమల్‌నాథ్‌ గెలిచారు. 2019 ఎన్నికల్లో కూడా ఈ స్థానం నుంచి నఖుల్‌నాథ్‌ ఎంపీగా గెలిచారు.

➡️