అనుచరులతో గంటా సమావేశం

Mar 14,2024 23:25 #ganta srinivasarao, #leaders, #meeting, #TDP

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన అనుచరులతో విశాఖ రుషికొండలోని ఒక విల్లాలో గురువారం సమావేశమయ్యారు. తాను ఈసారి విశాఖ జిల్లా భీమిలి నుంచి పోటీ చేస్తానని టిడిపి అధినేతను కోరడం, విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని చంద్రబాబు తేల్చి చెప్పడంతో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. చీపురుపల్లి నుంచి పోటీ చేస్తే విజయం కష్టమని, భీమిలి నుంచే పోటీ చేయాలని ఈ సమావేశంలో గంటాకు కొందరు సూచించినట్లు, అధిష్టాన వైఖరి సరిగా లేదని, పార్టీ మారాలని మరికొందరు సలహా ఇచ్చినట్లు సమాచారం. దీంతో, గంటా ఎటూ తేల్చుకోలేకపోయారు. శుక్రవారం మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఒకసారి ఒకచోట నుంచి గెలిచాక అక్కడి నుంచి మరలా గంటా పోటీ చేయలేదు. 1999లో అనకాపల్లి ఎంపీగా, 2004లో చోడవరం, 2009లో అనకాపల్లి, 2014లో భీమిలి, 2019లో విశాఖ ఉత్తర నియోజక ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతానికి భిన్నంగా ఈసారి ఆయన మళ్లీ భీమిలి కోరినా అధిష్టానం ఇవ్వలేదు. గెలిచిన తర్వాత నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరనే అపవాదు గంటాపై ఉంది. టిడిపి 2019లో అధికారం కోల్పోయి కష్టకాలంలో ఉన్నప్పుడు కనిపించకుండా పోయారని, పార్టీ మారేందుకు ప్రయత్నించారని విమర్శలు ఉన్నాయి. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు కనీసం పరామర్శకు వెళ్లలేదు. వైసిపి అధిష్టానంలోని కొంతమందితో లోపాయికారి మంతనాలు జరిపారన్న చర్చ టిడిపి అధినేతకు ఉండడంతో గంటాకు కోరిన స్థానం ఇవ్వలేదని సమాచారం. రాబోయే ఎన్నికల్లో పోటీ కోసం మిత్రులు, శ్రేయోభిలాషులతో చర్చించానని, ఆ వివరాలను అధిష్టానానికి తెలియజేస్తానని గంటా శ్రీనివాసరావు గురువారం రాత్రి ప్రకటించారు.

➡️