అర్ధనారీశ్వర పక్షి

Jan 14,2024 07:31 #Birds, #Sneha, #Stories
Honeycreeper birds story
  • ఒటాగో విశ్వవిద్యాలయానికి చెందిన జంతుశాస్త్రవేత్త, ప్రొఫెసర్‌ హమీష్‌ స్పెన్సర్‌, దక్షిణ బ్రెజిల్‌లోని ట్రినిడాడ్‌లో ద్వైపాక్షిక గైనాండ్రోమార్ఫ్‌ ఆకుపచ్చ హనీక్రీపర్‌ను గుర్తించారు. దానికి కుడి వైపున ఉండే ఈకలు మగ పక్షికున్నట్లు కాస్త మందంగా ఉండి, నీలం రంగులో ఉన్నాయి. ఎడమ వైపున ఆడపక్షికున్నట్లు సున్నితంగా, ఆకుపచ్చని రంగులో ఉన్నాయి. ఈ ఆకర్షణీయమైన పక్షిని క్లోరోఫేస్‌ జాతికి చెందిన ఆకుపచ్చ హనీక్రీపర్‌గా గుర్తించారు. ఇలా ఒకే జీవి రెండు ప్రత్యుత్పత్తి లక్షణాలను ప్రదర్శించడాన్ని ద్వైపాక్షిక గైనాండ్రోమోర్ఫ్‌ అంటారు. వంద సంవత్సరాల క్రితం కొలంబియాలోని మనిజాల్స్‌ అడవుల్లో, పక్షి శాస్త్రవేత్త జాన్‌ మురిల్లో మొట్ట మొదట గుర్తించారు.

ఇది అసాధారణమైన సంఘటన. ద్వైపాక్షిక గైనాండ్రోమోర్ఫీ అంటే పక్షి దేహం ఒకవైపు స్త్రీ లక్షణాలు, మరొక వైపు పురుష లక్షణాలను ప్రదర్శిస్తుంది. ఈ పరిస్థితి ఎక్కువగా జంతువులలో చూస్తాం. న్యూజిలాండ్‌లో జరిపిన పక్షుల అధ్యయనంలో ఏ పక్షి జాతిలోనూ ఈ ప్రత్యేకమైన దృగ్విషయం నమోదు కాలేదంటారు ప్రొఫెసర్‌ స్పెన్సర్‌. ‘విజ్ఞానశాస్త్రాన్ని పరిశీలిస్తే, గైనాండ్రోమోర్ప్‌ లక్షణాలు కొన్ని కీటకాలు, క్రస్టేసియన్లు, సాలెపురుగులు, బల్లులు, ఎలుకలు వంటి జంతు జాతులలో కనిపిస్తాయి. కానీ పక్షుల్లో వంద సంవత్సరాల తర్వాత ఇది రెండవ దృగ్విషయం. స్త్రీ కణం విభజనలో లోపం వలన ద్వైపాక్షిక గైనాండ్రోమోర్ఫ్‌లు ఏర్పడతాయి. గుడ్డు మియోసిస్‌ చెందేటప్పుడు (స్త్రీ కణం విభజన) లోపం జరిగి గుడ్డు రెండు స్పెర్మ్‌ల ద్వారా రెండుసార్లు ఫలదీకరణం జరుగుతుంది. పర్యవసానంగా, పక్షి ఒకవైపు హెటెరోగామెటిక్‌ (స్త్రీ కణాలు) గానూ, మరొకవైపు హోమోగామెటిక్‌ (పురుష కణాలు) గానూ అవయవ నిర్మాణం జరుగుతుంది. దాంతో ఒకే పక్షిలో స్త్రీ, పురుష లక్షణాలు క్రోడీకరింపబడతాయి’ అని వివరిస్తారు ప్రొఫెసర్‌ స్పెన్సర్‌.

Honeycreeper birds story

పక్షుల లైంగిక అవయవాలు శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్‌ కణాల ఆధారంగా అభివృద్ధి చెందుతాయి. మానవులలో క్రోమోజోమ్‌లు స్త్రీలలో ఎక్స్‌-ఎక్స్‌, పురుషుల్లో ఎక్స్‌-వైగా ఉంటాయి. పక్షుల్లో అలా కాదు. ఆడ పక్షిలో జెడ్‌-డబ్ల్యు.. మగ పక్షిలో జెడ్‌-జెడ్‌ క్రోమోజోమ్‌లు ఉంటాయి. ‘ఆహార సేకరణ, ఇతర అలవాట్లు దాని జాతి పక్షులవలెనే ఉంది కానీ.. అది ఒంటరిగానే ఉంటుంది. ఇతర పక్షులతో కలవదు. అవీ కలుపుకోవు. ఇది పునరుత్పత్తి చేయలేదు’ అని అంటున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ఆర్థర్‌ ఆర్నాల్డ్‌.’ఈ పక్షి ప్రతిరోజూ కనిపించదు. దాదాపు 4-6 వారాల పాటు ఒక ప్రదేశంలో ఉంటుంది. మరో ఎనిమిది వారాలు అదృశ్యమవుతుంది’ అని పరిశోధకులు నివేదికలో పేర్కొన్నారు. ‘ఇది చాలా అద్భుతమైనది. నేను దానిని చూడటం, పరిశోధించటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను’ అని ప్రొఫెసర్‌ స్పెన్సర్‌ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘పక్షి చిత్రాలు శాస్త్రీయ అవగాహనకు దోహదం చేస్తాయి. ఈ అసాధారణమైన సగం ఆడ, సగం మగ పక్షి ప్రకృతిలో విస్మయం కలిగించే విషయాలకు నిదర్శనం. దీని ద్వారా ప్రకృతిలో కొత్తవి, అర్థం చేసుకోవలసినవి అనేకం ఉన్నాయని రుజువవుతోంది. జర్నల్‌ ఆఫ్‌ ఫీల్డ్‌ ఆర్నిథాలజీలో ఇది చారిత్రాత్మక నివేదిక. పక్షుల లింగ నిర్ధారణ విషయాలు, లైంగిక ప్రవర్తన రహస్యాలు గుర్తించడానికి గైనాండ్రోమోర్ప్‌లు చాలావరకు ఉపయోగ పడతాయని స్పెన్సర్‌ చెబుతున్నారు. తోటి పరిశోధకులు కొత్త విషయాలను, అసాధారణ సంఘటనలను వెలికి తీసేందుకు అప్రమత్తంగా ఉండాలని ఆయన అంటున్నారు.

➡️