హిమాచల్‌ ప్రదేశ్‌లో ముదిరిన రాజకీయ సంక్షోభం ..

 సిమ్లా :    హిమాచల్‌ ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ కుల్దీప్‌ సింగ్‌ పఠానియా బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లాతో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అనుమతి కోరినట్లు తెలుస్తోంది. తాజాగా కాంగ్రెస్‌ మంత్రి విక్రమాదిత్య సింగ్‌ తన పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. అంతకు ముందు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జైరాం ఠాకూర్‌ కూడా గవర్నర్‌ను కలిశారు.

రాష్ట్రంలో త్వరలోనే బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని హిమాచల్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికైన హర్ష్‌ మహాజన్‌ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల నుంచి తమకు ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ రాజీనామా చేయాలని అన్నారు.

అసెంబ్లీ నుండి  బిజెపి ఎమ్మెల్యేల బహిష్కరణ..

రాష్ట్రంలో నేటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే బిజెపి ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. దీంతో 15 మంది ప్రతిపక్ష సభ్యులను స్పీకర్‌ సభ నుంచి బహిష్కరించారు. వీరిలో శాసనసభ ప్రతిపక్ష నేత జైరాం ఠాకుర్‌ కూడా ఉన్నారు. అనంతరం సభను వాయిదా వేశారు.మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌కు సంఖ్యా బలం ఉన్నప్పటికీ.. కొంతమంది ఎమ్మెల్యేలు బిజెపి అభ్యర్థికి ఓటేయ్యడంతో కాంగ్రెస్‌ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 68 సభ్యులున్న హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 40, బిజెపికి  25 మంది ఎమ్మెల్యేలున్నారు. మరో ముగ్గురు స్వతంత్రులు.

తమ ఎమ్మెల్యేలను కిడ్నాప్‌ చేసిన బిజెపి  : హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి 

రాజ్యసభలో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన తమ ఎమ్మెల్యేలను బిజెపి కిడ్నాప్‌ చేసిందని హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు పేర్కొన్నారు. సిఆర్‌పిఎఫ్‌ సాయంతో బిజెపి బుధవారం ఉదయం ప్రత్యేక విమానంలో వారిని మరో ప్రాంతానికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. అయితే సీఎం సుఖ్విందర్‌పై ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారని, ముఖ్యమంత్రిని మార్చాలని ఇప్పటికే పార్టీ హైకమాండ్‌ను కోరినట్లు తెలుస్తోంది.

➡️