పాక్‌ను వెంటాడుతున్నఅధిక ధరలు, పేదరికం, సైనిక జోక్యం

Feb 5,2024 10:33 #Pakistan
High prices, poverty and military intervention haunt Pakistan

8న ఎన్నికలు

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారం జోరందుకుంటోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు వారం రోజుల వ్యవధిలోనే మూడు శిక్షలు విధించడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. డిసెంబరులో నిర్వహించిన గాలప్‌ సర్వేలో పాకిస్తాన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తిగా ఇమ్రాన్‌ నిలిచారు. ధరల పెరుగుదల, పేదరికం, అవినీతి, ఎడాపెడా విద్యుత్‌ భారాలు, వ్యవస్థీకృత దోపిడీ వంటి ఆర్థిక సమస్యలు ఈ ఎన్నికల్లో ప్రధానంగా ముందుకు వస్తున్నాయి. అలాగే పాక్‌ రాజకీయాల్లో మితిమీరిన సైనిక జోక్యం , బయటనుంచి అమెరికా ఒత్తిడి, స్వతంత్ర విదేశాంగ విధానం ఇమ్రాన్‌ఖాన్‌ ఖైదు, రాజకీయ హింస వంటి అంశాలపై కూడా చర్చ జరుగుతోంది. నిర్ణీత గడువు కన్నా నాలుగు నెలలు ఆలస్యం, అనేక రాజకీయ ఒడుదుడుకుల మధ్య ఈ నెల 8న సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. పాకిస్తాన్‌ సైన్యం కనుసన్నల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని ఏమేరకు ప్రతిబింబిస్తాయన్నది అనుమానమే. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను, ఆయన పార్టీ పాకిస్తాన్‌ తెహ్రీక్‌- ఇ- ఇన్సాఫ్‌ (పిటిఐ)ని ఎన్నికల్లో పాల్గొనకుండా ఆ పార్టీ ఎన్నికల గుర్తును తొలగించేశారు. మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ దేశానికి తిరిగి రావడం, పిటిఐ ఎన్నికల గుర్తు లేకపోవడంతో పిఎంఎల్‌ (ఎన్‌) విజయావకాశాలు కొంతమేర మెరుగుపడవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీ, సెనేట్‌తో కూడిన పార్లమెంటుకు అలాగే, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుగతాయి. జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉండగా, వీటిలో 266 స్థానాలకు ఫస్ట్‌ పాస్ట్‌ ది పోస్ట్‌ పద్ధతిలో సింగిల్‌ మెంబర్‌ నియోజకవర్గాల ద్వారా ఎన్నికవుతారు. మహిళలకు 60, మైనార్టీలకు 10 సీట్లు రిజర్వు చేయబడ్డాయి. రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎన్నుకోబడిన సభ్యులు పార్లమెంటు ఎగువ సభ సెనేట్‌లోని 100 స్థానాలకు ప్రతినిధులను ఎన్నుకుంటారు. మొత్తం 12.8 కోట్ల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2018లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 50 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

➡️