స్మార్ట్‌ మీటర్లపై సర్కారుకు నోటీసు

ప్రజాశక్తి-అమరావతి : వ్యవసాయ విద్యుత్‌ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు జారీ చేసింది. వ్యవసాయ విద్యుత్‌ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు, అనుబంధ పరికరాలను బిగించే కాంట్రాక్టును షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు అప్పగించడాన్ని సవాలు చేస్తూ టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎపిలో అధిక ధరలకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని కోర్టుకు పిటిషనరు తరఫున న్యాయవాది తెలిపారు. మీటర్ల ఏర్పాటుపై స్టే విధించాలని కోరారు. స్టే ఇవ్వలేమంటూనే ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ సహా ఎపిలోని మూడు డిస్కమ్‌ల ఎమ్‌డిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబరు 20కు వాయిదా వేస్తూ చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

➡️