తిరుమలలో జీతాల కోసం హెల్త్‌ కార్మికుల ఆందోళన

తిరుమల : తిరుమలలోని హెల్త్‌ డిపార్ట్మెంట్లో గురూజీ కంపెనీ పరిధిలో పనిచేస్తున్న హెల్త్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు పెండింగ్‌ జీతాల కోసం ఆదివారం ఉదయం మెరుపు ఆందోళనకు దిగారు. కాంట్రాక్టర్లు ప్రతి నెల జీతాలు సకాలంలో చెల్లించడం లేదని కార్మికులు ఎలా బతకాలని ప్రశ్నించారు. సకాలంలో జీతాలు రాకపోవడానికి తిరుమల హెల్త్‌ ఆఫీసర్‌ ప్రధాన కారణమని, నేడు జరుగుతున్న ఆందోళనకు హెల్త్‌ ఆఫీసర్‌ కారకులని, ఆమెపై టిటిడి చర్యలు తీసుకోవాలని కోరారు. గురూజీ కంపెనీ చెల్లించాల్సిన జీతాలను వెంటనే చెల్లించాలని సిఐటియు నేత టి.సుబ్రమణ్యం డిమాండ్‌ చేశారు. హెల్త్‌ డిపార్టుమెంటులో కాంట్రాక్ట్‌ దక్కించుకున్న అన్ని కంపెనీల తీరు ఇదే రకంగా ఉందని, కాంట్రాక్టర్లను జీతాలు చెల్లించాలని అడిగితే టీటీడీ బిల్లులు చెల్లించలేదని అంటున్నారని అన్నారు. టీటీడీ వ్యవహారం వల్ల అంతిమంగా కార్మికులకు నష్టం జరుగుతుందని వాపోయారు. ప్రతినెల జీతాలు చెల్లించడానికి హెల్త్‌ ఆఫీసర్‌ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆమె నిర్వాకం వల్ల కార్మికులు ప్రతినెల ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇప్పటికైనా టిటిడి యాజమాన్యం స్పందించి కార్మికులకు ప్రతినెల సకాలంలో జీతాలు చెల్లించడానికి టిటిడి చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకులు టి.సుబ్రమణ్యం డిమాండ్‌ చేశారు. రేపటి లోపు కార్మికులకు జీతాలు పడకపోతే హెల్త్‌ ఆఫీసు రే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

➡️