మంచుకురిసే వేళలో …’

Jan 18,2024 07:29 #Health Awareness, #Jeevana Stories
health care in winter season

మంచు కురిసే వేళలో

మల్లె విరిసేదెందుకో

మల్లె విరిసే మంచులో

మనసు మురిసేదెందుకో…’ అంటూ ‘అభినందన’ సినిమాలో ఆచార్య ఆత్రేయ రచించిన గీతాన్ని గాయకులు ఎస్‌పి బాలు, ఎస్‌.జానకి ఎంతో హృద్యంగా ఆలపించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న మంచుతో పల్లెల్లో ప్రకృతి తెరలు వేసుకున్నట్టు కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో ప్రకృతి అందాలను చూడటం ఎంతైనా సరికొత్త అనుభూతే. అయితే ఈ ఆనందాన్ని ఆస్వాదిస్తూనే పండుగకు సొంతూళ్లకు వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

దేశవ్యాప్తంగా రోజురోజుకూ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచుతో పరిసరాలు కమ్ముకుపోతున్నాయి. పండగ ప్రయాణాలు చేసేవారి వాహనాలతో రహదారులు రద్దీగా ఉంటున్నాయి. ఎదురుగా ఎవరున్నారనేది కూడా కనిపించనంతగా పొగమంచు కురుస్తోంది. విపరీతంగా మంచు కురుస్తుంటే డ్రైవింగ్‌ చేయటం చాలాకష్టం. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం జరగొచ్చు. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించాలి.

లో బీమ్‌ లైట్లే ఉపయోగకరం : ఎక్కువ కాంతిని ఇస్తాయనే భావనతో చాలామంది వావాహనాలకు హైబీమ్‌ లైట్లను వాడుతుంటారు. పొగమంచులో ఈ కాంతి కలిసిపోతుంది. లో బీమ్‌ లైట్లను వినియోగిస్తే ఎదురుగా వస్తున్న వాహనాల డ్రైవర్లకు మీ వాహనం ఎక్కడుందో తెలిసి అప్రమత్తం అవుతారు. మీ వాహనంలో ఫాగ్‌లైట్లు ఉంటే వాటిని ఆన్‌లైన్‌లో ఉంచటం మేలు.

ఆన్‌లో వార్నింగ్‌ లైట్‌ : వార్నింగ్‌ లైట్‌ను ఆన్‌ చేసుకుని ప్రయాణించటం మేలు. వాటివల్ల మనకు ఎదురుగా, వెనుక వైపు వచ్చే వాహనదారులు మన వాహనం డైరెక్షన్‌ను గుర్తించే అవకాశం ఉంటుంది.

డ్రైవింగ్‌ నెమ్మదిగా చేయాలి : అతివేగం చాలా ప్రమాదకరం. ఎందుకంటే తక్కువ విజిబులిటీ కారణంగా ఏదైనా వాహనం ఒక్కసారిగా మీ ముందు కనిపించే అవకాశం ఉంది. దాంతో ప్రమాదం చోటు చేసుకోవచ్చు. వీలైనంత నెమ్మెదిగా డ్రైవింగ్‌ చేయటం మేలు.

హెచ్చరికలను పాటించాలి : రాష్ట్ర, జాతీయ రహదారులపై రేడియం లైట్లు అందుబాటులో ఉంటున్నాయి. ఇవి రోడ్లను రెండుగా విభజిస్తున్న విషయాన్ని గమనించాలి. బ్రిడ్జి, ఇరుకైన రోడ్ల వద్ద అదనపు రేడియం లైటింగ్‌, తెలుపు, పసుపు రంగుల్లో వార్నింగ్‌ బోర్డులు ఏర్పాటు చేసినందున వాటిని సరిగా అనుసరించాలి.

డీఫాగర్‌ను వాడాలి : వాహనాల అద్దాలపై మంచును కరిగించేందుకు డీ ఫాగర్‌ను వాడాలి. కారు ముందు, వెనుక అద్దాలపై తెల్లగా పేరుకుపోయిన మంచును ఆటోమేటిక్‌గా వేడెక్కేలా చేసి మంచును కరిగించేందుకు ఇవి దోహదపడతాయి.

స్పీకర్లు, బ్లూటూత్‌లు తగ్గించాలి : చాలామంది పాటలు వింటూ డ్రైవింగ్‌ చేసే అలవాటు ఉంటుంది. మ్యూజిక్‌ సిస్టమ్‌ సౌండ్‌ను వీలైనంత తక్కువగా ఉంచాలి. అవసరమైతే పూర్తిగా సౌండ్‌ ఆఫ్‌ చేసినా మంచిదే.

తగిన దూరం పాటించాలి : డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు ముందున్న వాహనాలకు తగినంత దూరాన్ని పాటించాలి. ముందున్న వాహనం హఠాత్తుగా ఆగితే వెంటనే అప్రమత్తమయ్యేందుకు తగిన సమయం దొరుకుతుంది. మంచు వేళలో రోడ్లు, టైర్లు జారటానికి అవకాశం ఎక్కువ. టెయిల్‌ లైట్లు, బ్రేక్‌ లైట్ల ద్వారా ముందున్న వాహనాలను అనుసరించండి.

హెడ్‌లైట్లు చెక్‌ చేసుకోండి : రాత్రి వేళలో ప్రయాణం చేయాల్సివచ్చినప్పుడు వాహనం హెడ్‌లైట్ల పనితీరును ఒకసారి చెక్‌ చేసుకోవాలి. ఒక లైట్‌ మాత్రమే పనిచేస్తుంటే ప్రయాణాన్ని వాయిదా వేసుకోవటమే మంచిది. ఎందుకంటే సింగిల్‌ హెడ్‌లైట్‌ కారణంగా వాహనాన్ని టూ వీలర్‌ అని పొరపాటు పడే ప్రమాదం ఉంది. దాంతో ప్రమాదాలు చోటుచేసుకోవచ్చు.

వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

అలాగే, మంచు కురిసే చలికాలం ఆరోగ్యానికి హాని చేస్తుంది. వృద్ధులు, చిన్నారులు, బాలింతలు ఎక్కువగా అనారోగ్యానికి గురౌతుంటారు. వీరంతా మంచు సమయంలో బయట తిరగకపోవటం మంచిది. చలికాలంలో టైఫాయిడ్‌, డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా తదితర వ్యాధులు చుట్టుముడుతుంటాయి. చెవులు, ముక్కుకు చలిగాలి వెళ్లకుండా చూసుకోవాలి.

ఈ జాగ్రత్తలు అవసరం

మంచులో ఎక్కువగా బయట తిరగొద్దు.

వీధుల్లో దొరికే ఆహారాలు తినొద్దు

ఇంట్లో ఏసీలు, కూలర్లు వాడొద్దు

ఫ్యాన్లు తగ్గించుకుని వాడటం మేలు

జలుబు, దగ్గు, జ్వరం వస్తే డాక్టరును సంప్రదించాలి

వేడి వేడి ఆహార పదార్థాలనే తీసుకోవాలి

దోమలు కుట్టకుండా చూసుకోవాలి

కూల్‌డ్రింక్స్‌, ఐస్‌క్రీములకు దూరంగా ఉండాలి

బైక్‌పై వెళ్తే గ్లౌజులు, స్కార్ప్‌, జర్కిన్‌, హెల్మెట్‌ వంటివి వాడాలి

పౌషకాహారం తీసుకోవాలి

రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్స్‌ను ఎంచుకోవాలి

ప్రతిరోజూ వ్యాయామం చేయాలి.

 

– డాక్టర్‌ బి.ప్రతిభ, సామాజిక ఆరోగ్య కేంద్రం, పొందూరు, శ్రీకాకుళం జిల్లా

 

➡️