శిరోముండనం !

Apr 18,2024 05:55 #Articles, #Case, #edit page, #Shiromundanam

ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన శిరోముండనం సంఘటనలో ప్రత్యేక కోర్టు వెలువరించిన తీర్పు భిన్నాభిప్రాయాలకు వేదికైంది. ఎట్టకేలకు తీర్పు రావడంతో పాటు, అధికార, ధన, కుల బలంతో రెచ్చిపోయిన తోట త్రిమూర్తులను ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించడం నిస్సందేహంగా ఆహ్వానించదగ్గ విషయం. అమానుష కాండకు తెగబడినప్పటి నుండి ఇప్పటివరకు అధికారాన్ని అంటిబెట్టుకునే ఉన్న త్రిమూర్తులు కేసును నీరు గార్చడానికి వేసిన ఎత్తులు దిగ్భ్రాంతిని కలిగిస్తాయి. దీంతో ఈ కేసు ఎప్పటికైనా ముగుస్తుందా? బాధితులకు న్యాయం జరుగుతుందా అన్న అనుమానాలు సైతం ముసురుకున్నాయి. చిట్టచివరకు త్రిమూర్తులను ధర్మాసనం దోషిగా ప్రకటించడం ఇంతకాలం పట్టువిడవకుండా పోరాడిన వెంకటాయ పాలెం దళితుల, బాధితుల, వారికి అండగా నిలిచిన ప్రజాసంఘాల విజయం! అయితే, దోషులకు ధర్మాసనం విధించిన 18 నెలల జైలు శిక్ష, 4.78 లక్షల రూపాయల జరిమాన అత్యంత అసంతృప్తికరం! ఒక రకంగా కోర్టు విధించిన ఈ శిక్ష ఆయన మీద నామమాత్రపు ప్రభావం కూడా చూపదు! జైలుకు పోకుండానే బెయిల్‌ పొందడానికి ఆయన అనుచరగణం చేస్తున్న ప్రయత్నాలే దీనికి నిదర్శనం.
నిజానికి ఈ అనాగరిక సంఘటన వెలుగులోకి రావడం, ఆ తరువాత న్యాయం కోసం జరిగిన సుదీర్ఘ పోరాటం, దానికి లభించిన మద్దతు ఒక అద్భుతం. పీడనతో పాటు, దానిని ప్రతిఘటించే శక్తి కూడా ఈ సమాజంలోనే ఉంటుందనడానికి ఇదో నిదర్శనం. 1994 ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలో రాజకీయంగా తనతో కలిసి రాలేదన్న కక్షతో ఇద్దరు దళిత యువకులపై అక్రమ కేసులు బనాయించి, కనుబొమలతో పాటు వారికి శిరోముండనం చేయించిన నికృష్ట చరిత్ర తోట త్రిమూర్తులది! ఆయన అధికార బలానికి జడిసి దళితవాడంతా ఆ అవమానాన్ని మౌనంగానే భరించింది. అయితే, రెండు రోజుల తరువాత దినపత్రికల్లో ప్రచురితమైన ఈ దారుణం కలకలం రేపింది. అప్పటి జిల్లా ఎస్‌పి స్వయంగా కదిలారు. త్రిమూర్తులుతో పాటు, ఆయన అనుచరులపైనా ఎస్‌సి, ఎస్‌టి వేధింపుల చట్టం కింద కేసులు పెట్టారు. బాధితులకు అండగా హక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు కదిలాయి. ఐక్య పోరాట వేదికగా దృఢంగా నిలిచాయి. ఉన్నవాడికి చట్టం ఎలా చుట్టంగా మారుతుందనడానికి కూడా ఈ కేసు ఒక ఉదాహరణ. ఈ కాలమంతా తోట త్రిమూర్తులు అధాకారాన్ని అంటబెట్టుకునే ఉన్నారు. కాంగ్రెస్‌, టిడిపి, వైసిపి ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలోకి ఫిరాయించారు. అధికార, అంగబలాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించారు. బాధితులపై క్రిస్టియన్లన్న ముద్ర వేశారు. పనులు దొరక్కుండా చేసి ఆకలితో అలమటించేలా చేశారు. విచారణ జరిగే కాలంలో నలుగురు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు మారారు. న్యాయమూర్తులను, కోర్టులను కూడా అదే స్థాయిలో మార్చారంటే ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం జరిగిందో ఊహించవచ్చు. సుదీర్ఘ కాల విచారణలో 24 మంది సాక్షుల్లో ప్రస్తుతం ఇద్దరు ముగ్గురు మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. ఇంత నిరీక్షణ, పోరాటం తరువాత వచ్చిన తీర్పుతో దక్కిన ఊరటా అంతంతమాత్రమే!
దళితులపై జరిగే దారుణాల విచారణలో అంతులేని జాప్యం, నిస్సారమైన తీర్పులు కొత్తేమీ కాదు! గతంలోనూ ఇటువంటి సంఘటనలు ఉన్నాయి. ఈ దుస్థితిని మార్చి దళిత ప్రజానీకంలో మనోధైర్యం నింపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తోట త్రిమూర్తులకు ప్రత్యేక కోర్టు విధించిన శిక్షపై ప్రభుత్వం తక్షణం అప్పీలుకు వెళ్లాలి. ఆయనకు కఠినశిక్ష పడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. దళితుల మద్దతు తమకే ఉందని చెప్పుకుంటున్న వైసిపికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఆయనపై రాజకీయపరమైన చర్యలు చేపట్టాలి. ఇప్పటికే ఉన్న ఎంఎల్‌సి పదవికి రాజీనామా ఇప్పించాలి. ఈ దిశలో చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వంపైనా, వైసిపిపైనా పౌర సమాజం ఒత్తిడి తీసుకురావాలి.

➡️