సంతోషమే సగం బలం

సంతోషమే సగం బలం అని పెద్దలు అన్నారు గానీ..నిజానికి సంపూర్ణ బలమే. మనిషి సంతోషంగా ఉండడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. సానుకూల దృక్పథం పెరిగి, సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలం. శారీరక వ్యాయామాల పట్ల శ్రద్ధ, ఆటల మీద ఆసక్తి పెరుగుతుంది. సంతోషంగా ఉండే వాళ్లలో ఆత్మవిశ్వాసం అధిక స్థాయిలో ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుందని అనేక శాస్త్రీయ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మనిషిలో సంతోషానికి సూచిక చిరునవ్వు. నేటి ఆధునిక యుగంలో ఇది మనిషి నుండి రోజురోజుకు దూరమైపోతుంది. దీంతో మనిషి తీవ్ర ఒత్తిడికి లోనై అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటూ తమ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో సంతోషం ప్రాముఖ్యతను గుర్తించిన మొదటి దేశం భూటాన్‌. 1970 వ సంవత్సరం నుంచే సంతోష సూచే నిజమైన ఆరోగ్య సూచని ప్రపంచానికి చాటింది . ఇక్కడ ”జాతీయ ఆదాయం” కన్నా ”జాతీయ సంతోషానికీ” అధిక ప్రాధాన్యత ఇస్తారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని 2013 నుంచి ఐక్యరాజ్య సమితి సంతోషం ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తూ, ప్రజల జీవన విధానంలో మార్పు తేవడానికి ప్రతియేటా మార్చి 20వ తేదీన ”అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని” నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం ”ఆనందం కోసం పునర్నిర్మాణం కావడం, దానికనుగుణమైన సమాజాలను నిర్మించడం” అనే ఇతివృత్తంతో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ ఇతివృత్తం కలయికను పెంపొందించడం, సామాజిక బంధాలను బలోపేతం చేయడం, సంతోషం, శ్రేయస్సును ప్రోత్సహించడానికి అనుగుణమైన సంఘాలను నిర్మించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పులు తీసుకొస్తూ, ఆనందాన్ని నింపడానికి ఐక్యరాజ్యసమితి 2015వ సంవత్సరంలో ”సుస్థిర అభివృద్ధి లక్ష్యాల”ను కూడా నిర్దేశించింది. వాటి ముఖ్య లక్ష్యం కూడా మానవుడు సంతోషం, శ్రేయస్సుతో బతకడమే. పేదరికం అంతం చేయడం, అంతరాలను తగ్గించడం, భూగోళాన్ని రక్షించడం లాంటి మూడు సార్వత్రిక లక్ష్యాలను ప్రపంచ దేశాల ముందుంచింది.
(మార్చి 20న అంతర్జాతీయ సంతోష దినోత్సవం సందర్భంగా)

-సంపతి రమేష్‌ మహారాజ్‌
సామాజిక విశ్లేషకులు
7989579428

➡️