హామీలు ఘనం… ఆచరణ శూన్యం

Apr 15,2024 09:33 #implementation, #modi, #Promises
  • అన్నదాతల సమస్యలపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వం
  • నీటి మూటలైన ఎంఎస్‌పి, ఆదాయం రెట్టింపు వాగ్దానాలు
  • పథకాలు, బడ్జెట్లలో భారీ కోతలు
  • ప్రాణాలు తీసుకుంటున్న రైతన్నలు

న్యూఢిల్లీ : పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లోని అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బిజెపి, దాని భాగస్వామ్య పార్టీల అభ్యర్థులు ప్రచారానికి వస్తుంటే రైతన్నలు వారిని తరిమికొడుతున్నారు. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రైతుల్లో ఇంత ఆగ్రహం ఎందుకు కలుగుతోంది? వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అణచివేసినందుకు మాత్రమే వారు కోపగించుకోవడం లేదు. లేదా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేసినప్పుడు తమపై దాష్టీకాన్ని ప్రదర్శించినందుకు కూడా వారు మండిపడడం లేదు. మరి వాటికి మించిన కారణాలేమున్నాయి ?
దేశంలో అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీ కావు. అన్నదాతలకు ఇచ్చిన హామీలను తమ పదేళ్ల పాలనలో మోడీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. వీటన్నింటినీ ఫైనాన్షియల్‌ అకౌంటబులిటీ ఇండియా (ఫ్యాన్‌ ఇండియా) సంస్థ రూపొందించిన ‘రైతుల రిపోర్ట్‌ కార్డు’ ఎత్తిచూపింది. ఎంఎస్‌ స్వామినాథన్‌ కమిషన్‌ ప్రతిపాదన మేరకు రైతుల ఉత్పత్తులకు కనీసం ఒకటిన్నర రెట్లు అదనంగా కనీస మద్దతు ధర చెల్లించి వాటిని సేకరిస్తామని 2014లో నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. 2016లో ఆయన మరో హామీ కూడా ఇచ్చారు. 2022 నాటికి రైతులు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని నమ్మబలికారు. అయితే మోడీ హామీ మేరకు రైతుల ఆదాయం 2022 నాటికి నిజంగా రెట్టింపు అయిందా లేదా అనేది పరిశీలిద్దాం.

పథకాల్లో కోతలు
‘2021లో వ్యవసాయ కుటుంబాల పరిస్థితిని అంచనా వేస్తూ ఓ నివేదిక విడుదలైంది. 2018-19లో రైతు కుటుంబాల నెలసరి ఆదాయాన్ని ఈ నివేదిక రూ.10,218గా అంచనా వేసింది. లక్ష్యంగా నిర్దేశించుకున్న నెలసరి ఆదాయం రూ.22,610కి ఇది కనీసం దగ్గరగా కూడా లేదు’ అని ఫ్యాన్‌ ఇండియా రిపోర్ట్‌ కార్డు తెలిపింది. ప్రభుత్వ పత్రాలు, అందుబాటులో ఉన్న గణాంకాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ పథకం-ధర మద్దతు (ఎంఐఎస్‌-పీఎస్‌ఎస్‌)పై కేంద్రం మౌనం వహిస్తోందని నివేదిక చెప్పింది. ఎంఎస్‌పీ ఆధారిత సేకరణకు ఈ పథకమే కీలకం అవుతుంది. అయితే గత రెండు సంవత్సరాలుగా ఈ పథకంలో కోత పెడుతున్నారు. బడ్జెట్‌ అంచనాల ప్రకారం ఈ పథకానికి 2022-23లో రూ.1,500 కోట్లు కేటాయించగా అది 2023-24, 2024-25లో దారుణంగా రూ.0.01 కోట్లకు తగ్గిపోయింది.

ప్రతి రోజూ 30 ఆత్మహత్యలు
2023-24 ఖరీఫ్‌ సీజన్‌కు ప్రకటించిన కనీస మద్దతు ధర సహేతుకంగా కానీ, గిట్టుబాటు అయ్యేలా కానీ లేదు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం మాట అటుంచి పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, సహేతుకంగా లేని ఎంఎస్‌పీ…వెరసి చిన్న, సన్నకారు రైతులను, మధ్య తరగతి రైతులను, కౌలుదారులను రుణాల ఊబిలోకి నెట్టేశాయి. ఇక మోడీ ప్రభుత్వం చేస్తున్న మరో వాదన ఏమిటంటే 2013లో అప్పుల భారంతో అల్లాడుతున్న రైతులు 52%గా ఉండగా 2019 నాటికి 60.2%కి తగ్గిపోయారట. ఇందులో వాస్తవం ఎంతుందో చూద్దాం. 2014 నుండి 2022 వరకూ నరేంద్ర మోడీ పాలనలో దేశంలో 1,00,474 మంది అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడ్డారని ఇటీవల విడుదలైన జాతీయ నేర రికార్డుల బ్యూరో నివేదిక తెలియజేసింది. అంటే ఈ తొమ్మిదేండ్లలో రోజుకు సగటున 30 మంది ఆత్మహత్య చేసుకున్నారు.
శుష్క వాగ్దానాలు, విఫలమైన పథకాలు, అరకొర కేటాయింపుల కారణంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఓ పథకం ప్రకారం అన్నదాతలను నిర్లక్ష్యం చేయడమే ఆత్మహత్యలు పెరగడానికి కారణమని రిపోర్ట్‌ కార్డ్‌ స్పష్టం చేసింది. మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-24 మధ్యకాలంలో రైతుల ఆత్మహత్యలు 10,281 నుండి 11,290కి పెరిగాయి. ఇది గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారమే. ఇక బలవన్మరణానికి పాల్పడుతున్న వ్యవసాయ కార్మికుల సంఖ్య మరింత అధికంగా ఉంటోంది. ఈ సంఖ్య 4,324 నుండి 6,083కి…అంటే 41% పెరిగింది. మహారాష్ట్రలోని విదర్భ, మరట్వాడా ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

ఈ హామీల మాటేమిటి ?
ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ)కి జవసత్వాలు కల్పిస్తామని కూడా నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. 2022-23 నాటికి వ్యవసాయ ఎగుమతులను వంద బిలియన్‌ డాలర్లకు పెంచుతామని చెప్పారు. పాడైపోయిన వ్యవసాయ ఉత్పత్తుల కోసం అగ్రి-రైల్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. ఆ మాటేమో కానీ గత ఐదేండ్లలో ఆయన అనేక వందేభారత్‌ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. చిన్న, సన్నకారు రైతులకు నెలకు రూ.3,000 పెన్షన్‌ ఇస్తామని కూడా ఊరించారు. అది నేటికీ కార్యరూపం దాల్చలేదు.

ఉపాధి హామీ బడ్జెట్‌ కుదింపు
వ్యవసాయం, రైతుల సంక్షేమంపై ప్రభుత్వ ఖర్చు, అలాగే బడ్జెట్‌ కేటాయింపులు నానాటికీ తగ్గిపోతున్నాయి. 2014-15, 2021-22 మధ్యకాలంలో వ్యవసాయ కార్మికులు సహా రైతన్నల వేతనాల వృద్ధి రేటు 1 శాతం కంటే తక్కువగానే ఉంది. ఇక గ్రామీణ ఉపాధి హామీ పథకం విషయానికి వస్తే ఆధార్‌ ఆధారిత చెల్లింపుల పద్ధతిని ప్రవేశపెట్టడంతో 57 శాతం మంది కార్మికులపై ప్రభావం పడింది. పైగా ఈ పథకానికి గత కొన్ని సంవత్సరాలుగా కేటాయింపులు తగ్గిపోతున్నాయి. 2014-15 బడ్జెట్‌లో ఈ పథకానికి 1.85 శాతం నిధులు కేటాయించగా 2023-24లో 1.33 శాతం మాత్రమే కేటాయించారు. ఉపాధి పథకానికి ఇంత తక్కువ బడ్జెట్‌ కేటాయించడం అదే మొదటిసారి. గత సంవత్సరం బడ్జెట్‌లో రూ.60,000 కోట్లు కేటాయించారు. అంతకుముందు సంవత్సరపు జీడీపీలో చూసుకుంటే ఇది 33 శాతం తక్కువ. సవరించిన అంచనాలను రూ.86,000గా చూపారు. అయితే 2024-25 అంచనాలలో ఆ పెరుగుదలను చూపలేదు. వీటన్నింటికీ తోడు ఆదేశాలు పాటించనందుకు పశ్చిమ బెంగాల్‌కు కేంద్రం రూ.7,000 కోట్లు బకాయి పడింది. ఇందులో రూ.2,800 కోట్ల వేతన బకాయిలు కూడా ఉన్నాయి. పేద కార్మికులను శిక్షించాల్సిన అవసరం ఏమొచ్చింది? వారి వేతనాలు లాక్కోవాల్సిన అగత్యం ఏం ఏర్పడింది?

గ్రామీణ రుణాలు తక్కువే
ఎంతో ప్రాచుర్యం కల్పించిన ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనకు రూ.14,600 కోట్లు కేటాయించారు. అయితే ఇందులో చాలా భాగం బీమా కంపెనీల జేబుల్లోకే వెళ్లాయి. ఉదాహరణకు 2022-23 రబీ సీజన్‌లో 7.8 లక్షల మంది రైతుల క్లెయిములకు సంబంధించి చెల్లించింది కేవలం రూ.3,878 కోట్లు మాత్రమే. ఇక రైతు రుణాల విషయానికి వస్తే బ్యాంకుల పట్టణ, మెట్రోపాలిటన్‌ బ్రాంచీల ద్వారా అనేక రుణాలు మంజూరు చేశారు. ఇవి మొత్తం రుణాలలో మూడో వంతు ఉన్నాయి. గ్రామీణ బ్రాంచీల ద్వారా ఇచ్చిన రుణాలు తక్కువే. 2019 ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వం రైతులకు లక్ష రూపాయల వరకూ వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు.

విధానాలు మారాలి
ఓ వైపు వాతావరణ మార్పులు, మరోవైపు వాతావరణ పరిస్థితుల కారణంగా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. ఆర్థిక భారాలు, ఉత్పాదక ఖర్చులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా అన్నదాతలు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం తన విధానాలను మార్చుకుంటేనే గ్రామీణ ప్రాంతాల్లో అన్నదాతల మరణ మృదంగాన్ని ఆపేయగలమని రిపోర్ట్‌ కార్డ్‌ తెలిపింది. ఏదేమైనా సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రైతన్నల ఆగ్రహ జ్వాలలు మిన్నుముట్టే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.

➡️