డిసెంబర్‌లో రూ.1.65 లక్షల కోట్ల జిఎస్‌టి వసూలు

Jan 1,2024 21:06 #Business

న్యూఢిల్లీ : గడిచిన ఏడాది డిసెంబర్‌ మాసంలో దేశంలో వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లు 10 శాతం పెరిగి రూ.1.65 లక్షల కోట్లుగా చోటు చేసుకున్నాయని ఆర్థిక శాఖ మంత్రత్వ శాఖ వెల్లడించింది. 2022 ఇదే డిసెంబర్‌లో రూ.1.50 లక్షల కోట్ల పన్ను వసూళ్లు జరిగాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఏడో నెలలో జిఎస్‌టి వసూళ్లు రూ.1.60 లక్షల కోట్ల మార్క్‌ను దాటాయి. కాగా.. గడిచిన నవంబర్‌ నెలలోని రూ.1.68 లక్షల కోట్ల వసూళ్లతో పోల్చితే డిసెంబర్‌లో 2 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. కాగా.. వరుసగా పది నెలల్లోనూ రూ.1.50 లక్షల కోట్ల మార్క్‌ దాటడం విశేషం.

2023 ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ మధ్యకాలంలో స్థూల జిఎస్‌టి వసూళ్లు 12శాతం పెరిగి రూ.14.97 లక్షల కోట్లుగా చోటు చేసుకున్నాయి. 2022 అదే సమయంలో రూ.13.40 లక్షల కోట్లు వసూళ్లయ్యాయి. 2023 డిసెంబర్‌లోని రూ.1,64,882 కోట్ల స్థూల జిఎస్‌టిలో సిజిఎస్‌టి కింద రూ.30,443 కోట్ల రాబడి నమోదయ్యింది. ఎస్‌జిఎస్‌టి కింద రూ.37,935 కోట్లు, ఐజిఎస్‌టి కింద రూ.84,255 కోట్లు చొప్పున వసూళ్లయ్యాయని ఆర్థిక శాఖ వెల్లడించింది.

➡️