వృద్ధి కొందరికే

Jan 11,2024 06:52 #edite page, #Editorial

జాతీయ గణాంకాల శాఖ కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన ఆదాయ ముందస్తు అంచనాలు భిన్న దృశ్యాలను ఆవిష్కరిస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విడుదలైన ఈ మొదటి అంచనాలు వృద్ధిలో పెరుగుదలను ప్రతిపాదిస్తూనే సరుకుల డిమాండ్‌ మాత్రం అంతంతమాత్రంగానే ఉంటుందని పేర్కొంది. కీలకమైన సేవా రంగంలో సైతం పురోగతి అంతంతమాత్రంగానే ఉంటుందని అంచనా వేసింది. మరో మాటలో చెప్పాలంటే సరుకుల, సేవల వినియోగం కరోనా మహమ్మారి విరుచుకుపడిన ముందు సంవత్సరాలతో పోలిస్తే వెనుకబాటే! ప్రైవేటు వినియోగం ఇంకా కుంటుతూనే ఉంది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పట్టణాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ కొనుగోలు శక్తి ఇప్పుడప్పుడే పుంజుకునే అవకాశం లేదని గణాంకశాఖ అంచనా! మెట్రోపాలిటన్‌ సిటీల్లో కొంతమేర కొనుగోళ్లు జోరుగా సాగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ అది కూడా పాక్షికమేనని, క్షేత్రస్ధాయిలో పూర్తిస్థాయిలో అధ్యయనం జరిగితే ఇక్కడ కూడా అనేక వైరుధ్యాలు బయటపడతాయని, మెట్రో పాలిటన్‌లో కనపడుతున్న అరకొర మెరుపు మేడిపండు తీరేనని నిపుణులు అంటున్నారు. దీని అర్ధం ఏమిటి? డిమాండ్‌ లేని వృద్ధి చెబుతున్న దేమిటి? వృద్ధి ఫలాలు నిజంగా ప్రజలందరికీ అందితే, వారి కొనుగోలు శక్తి ఎందుకు పెరగదు? ఈ ప్రశ్నలకు జవాబు స్పష్టం. నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా వృద్ధి దేశంలోని కొందరికే పరిమితమౌతోంది. ఫలితంగా అసమానతలు కొనసాగడమే కాక, ఏడాదికేడాదికి తీవ్రమౌతున్నాయి. ప్రజానీకం సృష్టిస్తున్న సంపదలో 30 శాతం ఒక శాతంగా ఉన్న కొద్దిమంది వద్ద పోగుపడుతుండగా, అట్టడుగున ఉన్న 25 శాతం మంది చేతిలో కేవలం 11 శాతం మాత్రమే ఉంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిడిపి 7.3 శాతానికి చేరుకుంటుందని గణాంక శాఖ అంచనా వేసింది. ఇది గత (2022-23) ఆర్థిక సంవత్సరానికన్నా ఎక్కువ. అదే సమయంలో జివిఎ (గ్రాస్‌ వాల్యు యాడెడ్‌ గ్రోత్‌) ఏడు శాతం నుండి 6.9 శాతానికి తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన రంగాల్లో వృద్ధి అంతంతమాత్రంగానో, లేదా గతానికన్నా తక్కువగానో ఉండటం దీనికి కారణం. వ్యవసాయం, పశుసంపద, అటవీ, మత్స్య రంగాల్లో వృద్ధి నామమాత్రమే. ఈ రంగాల్లో 1.8 శాతం మాత్రమే పెరుగుదల ఉందని గణాంక శాఖ నిర్ధారించింది. గత సంవత్సరంలో ఈ రంగాల్లో 4 శాతం వృద్ధిరేటు ఉండగా, ఈ ఏడాది దానిలో సగానికన్నా తక్కువ నమోదు కావడం గమనార్హం. ఎనిమిది సంవత్సరాల్లో ఇదే అత్యంత తక్కువ. సేవారంగం తరువాత దేశ ఆర్థిక వ్యవస్థకు విలువను అందించే కీలకమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇంత తక్కువ వృద్ధిని నమోదు చేయడం ఆందోళనకరం. ఖరీఫ్‌ ఉత్పత్తి తగ్గడం, రబీలో సాగు విస్తీర్ణం తక్కువగా ఉండటంతో ఈ మాత్రపు వృద్ధి నమోదు కావడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సేవా విభాగంలో కీలకమైన రవాణా, కమ్యూనికేషన్స్‌-బ్రాడ్‌ కాస్టింగ్‌, హోటల్స్‌ రంగాల్లో వృద్ధి వేగం సగానికిపైగా తగ్గుతుందని అంచనా! గత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగంలో 14 శాతం వృద్ధి నమోదుకాగా, ఈ ఏడాది 6.3 శాతానికే పరిమితమయ్యే అవకాశం ఉందని గణాంకశాఖ పేర్కొంది. నవంబర్‌ నెలలో విడుదల చేసిన నివేదికలో కూడా ఈ రంగాలకు సంబంధించి దాదాపు ఇవే అంశాలను ఆ శాఖ పేర్కొంది. రెండు దశాబ్దాల క్రితం జిడిపిలో 60 శాతం కన్నా ఎక్కువ వాటాతో ఉన్న ప్రైవేటు వ్యయం (వ్యక్తులు చేసే ఖర్చు) కరోనా సమయంలో కనిష్ట స్థాయికి పడిపోయిన విషయం తెలిసిందే. 2022-23లో ఈ రంగంలో 7.5 శాతం వృద్ధి సాధించగా, ప్రస్తుత సంవత్సరం 4.4 శాతానికే పరిమితం కానుందన్నది తాజా అంచనా! సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూల నుండి ద్విచక్ర వాహనాల వరకు కొనుగోళ్లు పుంజుకోలేదని, ప్రజలు ఆసక్తి చూపడం లేదని తాజా నివేదికలో పేర్కొన్నారు.

వాస్తవాలు ఇలా ఉండగా, మోడీ ప్రభుత్వం మాత్రం తన కార్పొరేట్‌ అనుకూల, ప్రజా వ్యతిరేక ఎజెండాను కొనసాగిస్తూనే ఉంది. ఉపాధి హామీ చట్టం (నరేగా)కు నిధులు తెగ్గోయడంతో పాటు, అనేక ఆంక్షలు పెడుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేకపోగా, ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలు కుదించుకు పోతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు దాటుతున్నాయి. ఈ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఎన్నికల వేళ అయోధ్య వంటి సున్నిత అంశాలను తెరమీదకు తెచ్చి ప్రజలను చీల్చడానికి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయత్నిస్తున్నాయి. ఈ తరహా కుట్రల పట్ల ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలి.

➡️