భూగర్భ జలం కలుషితమయం

groundwater pollution in chhattisgarh

హర్యానా 18 జిల్లాల్లో అధికస్థాయిలో ఆర్సెనిక్‌, ఫ్లోరైడ్‌

చండీగఢ్‌ : బిజెపి పాలిత రాష్ట్రం హర్యానాలో స్వచ్ఛమైన నీరు దొరకటమే కష్టంగా మారుతున్నది. ప్రమాదకర మూలకాల కారణంగా ఇక్కడి భూగర్భ జలాలు విషపూరితంగా మారుతున్నాయి. హర్యానాలోని 18 జిల్లాల్లోని 51 ఆవాసాలలో భూగర్భ జలాలు ఆర్సెనిక్‌తో కలుషితమైనట్టు నిర్ధారణ అయింది. ఉండాల్సిన స్థాయి కంటే అనేక రెట్లు అధికంగా విషపూరిత మూలకాలు ఉన్నట్టు వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆర్సెనిక్‌ను విషపూరిత మూలకంగా గుర్తించింది. తాగునీటిలో అధిక ఆర్సెనిక్‌ స్థాయిలు.. క్యాన్సర్‌, చర్మ గాయాలు, హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహంతో ముడిపడి ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక హర్యానాలోని 20 జిల్లాల్లోని 136 ప్రాంతాలు ఫ్లోరైడ్‌-కలుషితమైన భూగర్భజలాలతో ఇబ్బంది పడుతున్నాయి. ఫ్లోరైడ్‌ స్థాయిలు కూడా అనుమతించిన స్థాయిలకు మించి అనేక రెట్లు అధికంగా ఉన్నాయి. పరిస్థితి తీవ్రతను గుర్తించిన నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి) అనేక రాష్ట్రాల్లో భూగర్భ జలాల్లో ఆర్సెనిక్‌, ఫ్లోరైడ్‌ కలుషితానికి సంబంధించిన చర్యలను ప్రారంభించింది. గతేడాది డిసెంబర్‌ 20న ట్రిబ్యునల్‌ ప్రధాన కార్యదర్శి ద్వారా హర్యానాకు నోటీసు జారీ అయింది. దీనిపై ప్రతిస్పందనను డిమాండ్‌ చేసింది. ప్రతిస్పందనగా.. హర్యానా జలవనరుల అథారిటీ చైర్‌పర్సన్‌ కేష్ని ఆనంద్‌ అరోరా జనవరి 18న ముఖ్యమంత్రితో సమావేశాన్ని ప్రకటించారు. అరోరా తాగునీటి నాణ్యతను పర్యవేక్షించటం ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ఈ పరిస్థితి ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తుందని, హర్యానాలో నీటి కాలుష్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి తక్షణ చర్యలు అవసరమని సామాజికవేత్తలు అంటున్నారు.

➡️